ప్రజలతో మమేకమవ్వండి
ముస్సోరి: ప్రజలకు సేవచేసేందుకు వారితో మమేకమవ్వటం అవసరమని శిక్షణలో ఉన్న సివిల్ సర్వీసెస్ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజలతో కలిసిపోయే సామర్థ్యాన్ని పెంచుకోవాలని ప్రధాని పేర్కొన్నారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో 92వ వ్యవస్థాపక కోర్సు శిక్షణలో ఉన్న అధికారులకు శుక్రవారం మోదీ పలు సూచనలు చేశారు. ’పుస్తకాల ద్వారా నేర్చుకోవటం సరే.. కానీ వీటినుంచి బయటకు వచ్చి ప్రజల గురించి అర్థం చేసుకోవటం ద్వారా వారికి మరింత సేవ చేసేందుకు వీలుంటుంది.
ఇలా చేయటం ద్వారానే విజయవంతమైన ఆఫీసర్లుగా పేరుతెచ్చుకుంటారు‘ అని ప్రధాని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల మధ్య వారధిలా అధికారులు వ్యవహరించాలని కోరారు. అధికారులు వేర్వేరుగా పనిచేయటం ద్వారా ఫలితాలు రావని.. జట్టుగా పనిచేస్తేనే అద్భుతాలు చేయవచ్చన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజాస్వామ్యంలో మార్పులొస్తాయన్న మోదీ.. ఇందుకోసం ఐఏఎస్ లు ఉత్ప్రేరకాలుగా పనిచేయాలన్నారు. అశోక స్థూపం పైనున్న నాలుగు సింహాల్లో కనిపించని నాలుగో సింహమే మీరని ప్రశంసించారు. ‘కేరీర్ కోసం కష్టపడి ఇక్కడికొచ్చారు. ప్రజాసేవను మిషన్‌గా భావించి పనిచేయండి‘ అని సూచించారు.