రెండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు...
ఏడాదిగా జువైనల్ హోంలో ఉంటున్న బాలుడు
అనుమానంతో హోంకు వచ్చిన తండ్రి.. కనిపించిన కుమారుడు
సైదాబాద్: రెండేళ్ల క్రితం తప్పిపోయాడనుకున్న బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయింది. పాతబస్తీలో పోలీసులు ఇటీవల చేపట్టిన కార్డన్ సర్చ్‌లో బాలకార్మికులు పట్టుబడిన విషయం తెలిసి ఓ బాలుడి తండ్రి తన కొడుకు వారిలో ఉన్నాడేమోనని సైదాబాద్‌లోని జువైనల్ హోంకు వచ్చాడు. అక్కడ తమ కుమారుడు కనిపించడంతో ఆనందభాష్పాలు రాల్చాడు. వివరాలు.. బీహార్‌కు చెందిన కాలురాం, శీలదేవి దంపతులు పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. కాటేదాన్‌లో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లాలుబాబురాం(8) రెండేళ్ల క్రితం కాటేదాన్‌లోని తన ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు.
కొడుకు కోసం స్థానికంగాను, బంధు,మిత్రుల ఇళ్లలోనూ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మైలార్దేవుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు (405/2013) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి నుంచి కుమారుడి ఆచూకీ కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. కాగా, తప్పిపోయిన వీరి కుమారుడు లాలుబాబురాం ప్రకాశజిల్లా ఒంగోలులో రోడ్లపై తిరుగుతుండగా అక్కడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు 2014లో సైదాబాద్‌లోని వీధి బాలుర సదనానికి తీసుకొచ్చి అప్పగించారు. అప్పటి నుంచి సైదాబాద్ బాలుర సదనంలోనే అతడు ఉంటున్నాడు. అయితే బీహార్‌కు చెందిన ఈ బాలుడి భాష అర్థం కాకపోవడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అతడి తల్లిదండ్రుల సమాచారం తెలుసుకోలేకపోయారు.