Lanco Infratech
-
రూ. 35 కోట్ల నిధుల సమీకరణకు ల్యాంకో ఇన్ఫ్రా నిర్ణయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ (సీసీడీ) జారీ ద్వారా రూ. 35 కోట్లు దాటకుండా నిధుల్ని సమీకరించాలని ల్యాంకో ఇన్ఫ్రాటెక్ నిర్ణయించింది. ఇందుకోసం డిసెంబర్ 30న బోర్డు సమావేశం జరుపుతున్నామని, ఆ తర్వాత వాటాదారుల అనుమతితో సీసీడీలను జారీ చేయనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. -
లాభాల్లోకి ల్యాంకో ఇన్ఫ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొంత కాలంగా వరుస నష్టాలతో సతమతమవుతున్న ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌కు ఈ త్రైమాసికం విద్యుత్ వెలుగులు నింపింది. ఆగిపోయిన విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్, బొగ్గు సరఫరా కావడంతో మూడేళ్ల విరామం తర్వాత తొలిసారిగా లాభాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ. 99 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 528 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. ల్యాంకో కొండపల్లి యూనిట్‌కు సంబంధించి రూ. 175 కోట్ల మ్యాట్ రీయింబర్స్మెంట్ వడ్డీతో సహా మొత్తం ఆదాయంలో నమోదుచేయడం, ల్యాంకో అన్పారా విద్యుత్ యూనిట్‌కు సంబంధించి ఉత్తరప్రదేశ్ విద్యుత్ నియంత్రణా కమిషన్ జారీచేసిన టారీఫ్ ఆర్డరు కింద లభించే మరో రూ. 500 కోట్లను కూడా ఆదాయంలో కలపడం ద్వారా కంపెనీ తాజా త్రైమాసికంలో లాభాల్ని కనపర్చగలిగింది. సమీక్షా కాలంలో ఆదాయం 43% వృద్ధితో రూ. 2,444 కోట్ల నుంచి రూ. 3,493 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో వడ్డీ భారం రూ. 773 కోట్ల నుంచి రూ. 615 కోట్లకు తగ్గినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ. 27,722 కోట్ల ఈపీసీ ఆర్డర్లు ఉన్నాయని, వీటిలో అత్యధిక భాగం మూడేళ్లలో పూర్తవుతాయని తెలిపింది. 2018 నాటికి కంపెనీ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా. సోలార్ సెల్ యూనిట్ చత్తీస్‌గఢ్‌లో 100 మెగా వాట్ల సోలార్ సెల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ల్యాంకో గ్రూపు ప్రకటించింది. ల్యాంకో అనుబంధ కంపెనీ ల్యాంకో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న 250 ఎకరాల ప్రత్యేక ఆర్థిక మండలిలో ఇతర దేశీ, విదేశీ కంపెనీలు యూనిట్లను ఏర్పాటు చేయడానికి 150 ఎకరాలను కేటాయిస్తున్నారు. దేశంలో తొలిసారిగా ప్లగ్ అండ్ ప్లే (అన్ని సౌకర్యాలు సమకూర్చిన తర్వాత) విధానంలో ఇతర తయారీ కంపెనీల ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆహ్వానిస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సెజ్ సెప్టెంబర్, 2016 నాటికి అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే 150 మెగావాట్ల పాలీ సిలికాన్ రిఫైనింగ్, వేఫర్ ప్లాంట్‌లో రూ. 1,250 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
అనుబంధ కంపెనీల్లో ల్యాంకో పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అనుబంధ కంపెనీల మూలధన అవసరాల కోసం ల్యాంకో ఇన్ఫ్రాటెక్ రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. సెక్యూరిటీస్ రూపంలో రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వాటాదారుల అనుమతి కోరనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ నెలలలో జరిగే వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించాల్సి ఉంది. మార్చి 31, 2015 నాటికి ఈ అనుబంధ కంపెనీల్లో రూ.10,959 కోట్లు సెక్యూరిటీస్ రూపంలో ఇన్వెస్ట్ చేసింది. -
3 వేల మెగావాట్ల ప్రాజెక్టులు విక్రయిస్తాం: లాంకో ఇన్ఫ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు విద్యుత్ ప్రాజెక్టులను విక్రయించనున్నట్టు ల్యాంకో ఇన్ఫ్రాటెక్ వెల్లడించింది. రూ.5 వేల కోట్ల నగదు సమీకరించేందుకు 3 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను విక్రయించనున్నట్టు తెలిపింది. రుణం తగ్గించుకునే పనిలో గత ఏడాదిగా నిమగ్నమయ్యామని, వివిధ ఆస్తుల విక్రయం ద్వారా రూ. 15,000 కోట్ల రుణభారాన్ని తగ్గించుకుంటామని పేర్కొంది. 1,200 మెగావాట్ల ఉడిపి థర్మల్ ప్లాంట్‌ను అదాని పవర్‌కు రూ.6 వేల కోట్లకు విక్రయించేందుకు ల్యాంకో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఉడిపి ప్లాంటు విక్రయం ద్వారా నగదు రూపంలో రూ.925 కోట్లు వచ్చి చేరతాయని ల్యాంకో భావిస్తోంది. అయితే ల్యాంకో ఇన్ఫ్రాకు సమయం మీరిన రుణ ం(ఓవర్ డ్యూ) రూ.1,700 కోట్లు ఉన్నట్టు సమాచారం. 47 సంస్థల నుంచి సుమారు రూ.49 వేల కోట్ల రుణాల్ని కంపెనీ తీసుకొంది. ఆర్డరు బుక్ ప్రస్తుతం రూ.21 వేల కోట్లుంది. గ్రూప్ విద్యుత్ నిర్వహణ సామర్థ్యం 4,732 మెగావాట్లు కాగా, 4,636 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో, 9,000 మెగావాట్లు పలు దశల్లో ఉన్నాయి. కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ అనుమతి, బ్యాంకులతో సమావేశం నేపథ్యంలో లాభాల్లోకి తిరిగి చేరుకుంటామన్న ధీమాను గ్రూప్ సీవోవో వి.శ్రీనివాస్ వ్యక్తం చేశారు. ప్రమాదకర స్థాయిలో..: పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఎండీ కేఆర్ కామత్ నేతృత్వంలో ఆగస్టు 18న బ్యాంకర్లు, కంపెనీ ఉన్నత స్థాయి అధికారులు సమావేశమయ్యారు. ల్యాంకో గ్రూప్ ప్రమాదకర స్థితిలో ఉందని బ్యాంకర్లు వ్యాఖ్యానించినట్టు పీటీఐ పేర్కొంది. కాగా, కార్యకలాపాలు సాగేలా ప్రాధాన్య రుణం, నాన్ ఫండ్ సౌకర్యాన్ని బ్యాంకర్లు కల్పించే అవకాశం ఉందని సమాచారం. క్యాపిటల్ మార్కెట్ల నుంచి కొంతైనా నిధులను సమీకరించాలని ప్రమోటర్లుకు బ్యాంకర్లు సూచించినట్టు తెలిసింది. 80:10:10 నిష్పత్తిలో ఆర్థిక సహాయం చేయాల్సిందిగా బ్యాంకర్లను ల్యాంకో విన్నవించింది. ఇందులో 80% రుణంగా, ఈక్విటీగా మార్చే వీలుగా 10% ఉప రుణం గా పరిగణించాలని కోరింది. ప్రతిపాదిత ప్రణాళికలో భాగంగా లీడ్ లెండర్ 80:10:10 నిష్పత్తిలో లేదా రుణాన్ని ముందస్తు ఈక్విటీగా మార్చుకునే వీలుంది. -
అదాని చేతికి ల్యాంకో ఉడిపి ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉడిపిలో నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను అదాని గ్రూపునకు విక్రయించినట్లు ల్యాంకో ఇన్ఫ్రా ప్రకటించింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ. 6,000 కోట్లపైనే ఉంటుందని, దీని ద్వారా ల్యాంకోకు రూ.2,000 కోట్ల నగదు లభించడమే కాకుండా రూ.4,000 కోట్లకు పైగా రుణ భారం తగ్గుతుందని కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం అదాని గ్రూపు చైర్మన్ గౌతమ్ ఆదాని హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు 2020 నాటికి 20,000 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన అనంతరం ఈ అతిపెద్ద డీల్ జరగడం విశేషం. ప్రస్తుతం అదాని గ్రూపు 8,500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశీయ విద్యుత్ పరిశ్రమలో విలువ పరంగా ఇది రెండో అతిపెద్ద కొనుగోలు ఒప్పందంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్యనే అనిల్ అంబానీకి చెందిన రిల యన్స్ పవర్ రూ.10,000 కోట్లకు జేపీ అసోసియేట్స్‌కు చెందిన విద్యుత్ ప్రాజెక్టులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఉడిపి విద్యుత్ ప్లాంట్ గురించి దిగుమతి చేసుకున్న బొగ్గుతో ఏర్పాటైన తొలి స్వతంత్ర విద్యుత్ ప్రాజెక్టుగా ఉడిపి విద్యుత్ రికార్డులకు ఎక్కింది. 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును దిగుమతి చేసుకోవడానికి మంగుళూరు పోర్టులో 4 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన సొంత జెట్టీలు ఉన్నాయి. అవసరమైతే ఈ జెట్టీ సామర్థ్యాన్ని మరో 4 మిలియన్ టన్నులకు పెంచుకోవచ్చు. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో 90 శాతం కర్ణాటక రాష్ట్రానికి, మిగిలిన 10 శాతం పంజాబ్ రాష్ట్రానికి విక్రయించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విద్యుత్ ప్లాంట్ సామర్థ్యాన్ని అదనంగా 1,320 మెగా వాట్లకు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వంతోల్యాంకో ఈ మధ్యనే ఒప్పందం కుదుర్చుకుంది.