3 వేల మెగావాట్ల ప్రాజెక్టులు విక్రయిస్తాం: లాంకో ఇన్‌ఫ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు విద్యుత్ ప్రాజెక్టులను విక్రయించనున్నట్టు ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ వెల్లడించింది. రూ.5 వేల కోట్ల నగదు సమీకరించేందుకు 3 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను విక్రయించనున్నట్టు తెలిపింది. రుణం తగ్గించుకునే పనిలో గత ఏడాదిగా నిమగ్నమయ్యామని, వివిధ ఆస్తుల విక్రయం ద్వారా రూ. 15,000 కోట్ల రుణభారాన్ని తగ్గించుకుంటామని పేర్కొంది.
1,200 మెగావాట్ల ఉడిపి థర్మల్ ప్లాంట్‌ను అదాని పవర్‌కు రూ.6 వేల కోట్లకు విక్రయించేందుకు ల్యాంకో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఉడిపి ప్లాంటు విక్రయం ద్వారా నగదు రూపంలో రూ.925 కోట్లు వచ్చి చేరతాయని ల్యాంకో భావిస్తోంది. అయితే ల్యాంకో ఇన్‌ఫ్రాకు సమయం మీరిన రుణ ం(ఓవర్ డ్యూ) రూ.1,700 కోట్లు ఉన్నట్టు సమాచారం. 47 సంస్థల నుంచి సుమారు రూ.49 వేల కోట్ల రుణాల్ని కంపెనీ తీసుకొంది. ఆర్డరు బుక్ ప్రస్తుతం రూ.21 వేల కోట్లుంది.
గ్రూప్ విద్యుత్ నిర్వహణ సామర్థ్యం 4,732 మెగావాట్లు కాగా, 4,636 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో, 9,000 మెగావాట్లు పలు దశల్లో ఉన్నాయి. కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ అనుమతి, బ్యాంకులతో సమావేశం నేపథ్యంలో లాభాల్లోకి తిరిగి చేరుకుంటామన్న ధీమాను గ్రూప్ సీవోవో వి.శ్రీనివాస్ వ్యక్తం చేశారు.
ప్రమాదకర స్థాయిలో..: పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఎండీ కేఆర్ కామత్ నేతృత్వంలో ఆగస్టు 18న బ్యాంకర్లు, కంపెనీ ఉన్నత స్థాయి అధికారులు సమావేశమయ్యారు. ల్యాంకో గ్రూప్ ప్రమాదకర స్థితిలో ఉందని బ్యాంకర్లు వ్యాఖ్యానించినట్టు పీటీఐ పేర్కొంది. కాగా, కార్యకలాపాలు సాగేలా ప్రాధాన్య రుణం, నాన్ ఫండ్ సౌకర్యాన్ని బ్యాంకర్లు కల్పించే అవకాశం ఉందని సమాచారం.
క్యాపిటల్ మార్కెట్ల నుంచి కొంతైనా నిధులను సమీకరించాలని ప్రమోటర్లుకు బ్యాంకర్లు సూచించినట్టు తెలిసింది. 80:10:10 నిష్పత్తిలో ఆర్థిక సహాయం చేయాల్సిందిగా బ్యాంకర్లను ల్యాంకో విన్నవించింది. ఇందులో 80% రుణంగా, ఈక్విటీగా మార్చే వీలుగా 10% ఉప రుణం గా పరిగణించాలని కోరింది. ప్రతిపాదిత ప్రణాళికలో భాగంగా లీడ్ లెండర్ 80:10:10 నిష్పత్తిలో లేదా రుణాన్ని ముందస్తు ఈక్విటీగా మార్చుకునే వీలుంది.