లాభాల్లోకి ల్యాంకో ఇన్‌ఫ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొంత కాలంగా వరుస నష్టాలతో సతమతమవుతున్న ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌కు ఈ త్రైమాసికం విద్యుత్ వెలుగులు నింపింది. ఆగిపోయిన విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్, బొగ్గు సరఫరా కావడంతో మూడేళ్ల విరామం తర్వాత తొలిసారిగా లాభాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ. 99 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 528 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది.
ల్యాంకో కొండపల్లి యూనిట్‌కు సంబంధించి రూ. 175 కోట్ల మ్యాట్ రీయింబర్స్‌మెంట్ వడ్డీతో సహా మొత్తం ఆదాయంలో నమోదుచేయడం, ల్యాంకో అన్పారా విద్యుత్ యూనిట్‌కు సంబంధించి ఉత్తరప్రదేశ్ విద్యుత్ నియంత్రణా కమిషన్ జారీచేసిన టారీఫ్ ఆర్డరు కింద లభించే మరో రూ. 500 కోట్లను కూడా ఆదాయంలో కలపడం ద్వారా కంపెనీ తాజా త్రైమాసికంలో లాభాల్ని కనపర్చగలిగింది.
సమీక్షా కాలంలో ఆదాయం 43% వృద్ధితో రూ. 2,444 కోట్ల నుంచి రూ. 3,493 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో వడ్డీ భారం రూ. 773 కోట్ల నుంచి రూ. 615 కోట్లకు తగ్గినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ. 27,722 కోట్ల ఈపీసీ ఆర్డర్లు ఉన్నాయని, వీటిలో అత్యధిక భాగం మూడేళ్లలో పూర్తవుతాయని తెలిపింది. 2018 నాటికి కంపెనీ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా.
సోలార్ సెల్ యూనిట్
చత్తీస్‌గఢ్‌లో 100 మెగా వాట్ల సోలార్ సెల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ల్యాంకో గ్రూపు ప్రకటించింది. ల్యాంకో అనుబంధ కంపెనీ ల్యాంకో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న 250 ఎకరాల ప్రత్యేక ఆర్థిక మండలిలో ఇతర దేశీ, విదేశీ కంపెనీలు యూనిట్లను ఏర్పాటు చేయడానికి 150 ఎకరాలను కేటాయిస్తున్నారు.
దేశంలో తొలిసారిగా ప్లగ్ అండ్ ప్లే (అన్ని సౌకర్యాలు సమకూర్చిన తర్వాత) విధానంలో ఇతర తయారీ కంపెనీల ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆహ్వానిస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సెజ్ సెప్టెంబర్, 2016 నాటికి అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే 150 మెగావాట్ల పాలీ సిలికాన్ రిఫైనింగ్, వేఫర్ ప్లాంట్‌లో రూ. 1,250 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.