మోదీకి సంచలన సూచన, అధికారికి నోటీసులు
రాట్లం: సూసైడ్ స్కీమ్స్ పెట్టాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివాదాస్పద సూచన చేసిన ఓ ప్రభుత్వ అధికారిణి షోకాజ్ నోటీసులు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాట్లం జిల్లా రావోటి మండల తహశీల్దార్ అమితా సింగ్ తన ఫేస్ బుక్ పేజీలో 'సూసైడ్ స్కీం' పెట్టాలని ప్రధానిని కోరుతూ మంగళవారం ఓ పోస్ట్ చేశారు. దానిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో ఓ ప్రభుత్వ అధికారిణి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అమితా సింగ్ కు జిల్లా ఇన్-చార్జ్ కలెక్టర్ హర్జీందర్ సింగ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
కాగా ప్రధానమంత్రి ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి ముస్లింలు భారత జాతీయ జెండా చూపుతూ వందేమాతరం, భారత్ మాతాకి జై అని నినాదాలు చేశారని అనితా సింగ్ తన పోస్టులో రాసుకున్నారు. దయచేసి ప్రధానమంత్రి 'రాజీవ్ గాంధీ ఆత్మహత్య యోజన' పథకాన్ని ప్రారంభించాలని ఆమె కోరారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు మీద మాయగాళ్లు అయిన లౌకికవాదులకు ఈ స్కీంను ప్రారంభించాలన్నారు. ప్రధాని ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో అక్కడి ముస్లింలు ఆయనను ఆప్యాయంగా స్వాగతించడాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు.
అయితే ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడం, విమర్శలు వెల్లువెత్తడంతో దాన్ని అనితా సింగ్ డిలీట్ చేశారు. కాగా ఆ పోస్టు తనకు వాట్సాప్ ద్వారా అందిందని వెంటనే ఫేస్ బుక్ లో పోస్టు చేసినట్లు ఆమె తెలిపారు. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ పోస్టును పెట్టలేదని ఎవరైనా నొచ్చుకుని ఉంటే మన్నించాలని క్షమాపణలు కోరారు.