అమెరికా ప్రయాణానికి ఆదుకోరూ..
పాపన్నపేట(మెదక్): పురిటిగడ్డపై పూటగడవని పరిస్థితిలో వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్న దంపతుల బిడ్డ రోబో టెక్నాలాజీలో దిట్టగా ఎదిగాడు. అమెరికాలోని మిచిగాన్‌లో జరుగనున్న రోబో పెస్ట్ వరల్డ్ ఛాంపియన్ పోటీలకు ఎంపికై తన సత్తా చాటాడు. వేల మైళ్లదూరం.. ఖరీదైన ప్రయాణం.. దాతలు ఎవరైనా సహకరించి ఆదుకోవాలని కోరుతున్నాడు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామానికి చెందిన పోచమ్మ–సాయిలు దంపతులు కొంతకాలం క్రితం సంగారెడ్డి జిల్లా మియాపూర్‌కు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారి కొడుకు వినయ్‌కుమార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్న నాటి నుంచి రోబో టెక్నాలాజిపై ఆసక్తి పెంచుకొని పలు ఎగ్జిబిట్లు రూపొందించాడు.
ఈ క్రమంలో ఇటీవల కందిలోని ఐఐటీలో జరిగిన మెటర్నల్ ఎగ్జిబిషన్‌కు నలుగురు స్నేహితులతో కలిసి తీసుకెళ్లిన రోబో ప్రదర్శన అత్యుత్తమైందిగా ఎంపికైంది. దీంతో అమెరికాలోని మిచిగాన్‌లో గల లారెన్స్ టెక్నాలాజీ యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్న రోబో ఫెస్ట్‌వరల్డ్ ఛాంపియన్ పోటీలకు వీరు ప్రదర్శించే మోడల్ ఎంపికైంది. జూన్ 1న జరిగే ఈ పోటీలకు ఆ సంస్థవారు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. కాగా ఖర్చులకు డబ్బులు లేవని, దాతలు సహకరించి తన విదేశీ ప్రయాణానికి సహకరించాలని వినయ్ కోరుతున్నాడు.