'ఆ వెబ్సైట్లను నిషేధించడం కష్టం'
పనాజీ: ఎస్కార్ట్ సర్వీసెస్ వెబ్సైట్లను నిషేధించడం కష్టమని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేస్కర్ చెప్పారు. ఈ వెబ్సైట్ల సర్వర్లను దేశం వెలుపల నుంచి నిర్వహిస్తుండటే కారణమని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అశ్లీల వెబ్సైట్లపై కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. సర్వీస్ ప్రొవైడర్లు వందలాది అశ్లీల వెబ్సైట్లను తొలగించారు. అయితే ఎస్కార్ట్ సర్వీసెస్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న వెబ్సైట్లపై చర్యలు తీసుకోవడం కష్టమని గోవా సీఎం చెప్పారు.
'ఎస్కార్ట్ సర్వీసెస్ వెబ్సైట్లను దేశం వెలుపలి నుంచి నిర్వహిస్తున్నారు. విశ్వసించదగ్గ ఎస్కార్ట్ సర్వీస్ ప్రొవైడర్లుగా చలామణి అవుతూ వ్యభిచార కార్యకలాపాల కోసం వ్యక్తులను ఆకర్షిస్తున్నారు' అని గోవా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. కాగా ఇలాంటి వెబ్సైట్ల లింకులు సెర్చ్ ఇంజిన్లలో కనిపించకుండా బ్లాక్ చేయాల్సిందిగా సైబర్ క్రైమ్ సెల్.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను కోరినట్టు తెలిపారు.