ఎన్బీఎఫ్సీలకు కొత్తగా ఎల్సీఆర్
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) సంబంధించి లిక్విడిటీ కవరేజీ రేషియో (ఎల్సీఆర్)ను ఆర్బీఐ తీసుకురానుంది. డిపాజిట్లు తీసుకునే అన్ని ఎన్బీఎఫ్సీలతోపాటు, రూ.5,000 కోట్ల ఆస్తులున్న ప్రతీ ఎన్బీఎఫ్సీ కూడా ఈ విధానం పరిధిలోకి రానుంది. ఈ మేరకు ఆర్బీఐ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఇందుకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. ఎన్బీఎఫ్సీ రంగంలో లిక్విడిటీ సమస్యలకు ముగింపు పలకడం, ఐఎల్ఎఫ్ఎస్ తరహా సంక్షోభాల నివారణ కోసం ఆర్బీఐ ఈ చర్యలను చేపట్టింది.
ఎల్సీఆర్ విధానానికి ఎన్బీఎఫ్సీ రంగం సాఫీగా మారేందుకు వీలుగా... 2020 ఏప్రిల్ నుంచి 2014 ఏప్రిల్ వరకు నాలుగేళ్ల కాలంలో అంచలంచెలుగా అమలు చేయాలన్నది ఆర్బీఐ ప్రణాళిక. ‘‘ఎన్బీఎఫ్సీలు తప్పనిసరిగా తగినంత అధిక నాణ్యత కలిగిన లిక్విడ్ ఆస్తులను (హెచ్క్యూఎల్ఏ) కలిగి ఉండాలి. తీవ్రమైన నిధుల లభ్యత సమస్య ఏర్పడినప్పుడు ఈ ఆస్తులను 30 రోజుల అవసరాలకు సరిపడా నగదుగా మార్చుకోవచ్చు’’ అని ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాల్లో తెలియజేసింది.
60 శాతం ఎల్సీఆర్
‘‘2020 ఏప్రిల్ 1 నుంచి ఎల్సీఆర్ నిబంధనలకు ఎన్బీఎఫ్సీలు కట్టుబడి ఉండాలి. కనీసం 60 శాతంగా ఎల్సీఆర్ ఉండాలి. క్రమంగా 2024 ఏప్రిల్ నాటికి ఈ కవరేజీని 100 శాతానికి చేరాల్సి ఉంటుంది’’అని ఆర్బీఐ పేర్కొంది. ఎన్బీఎఫ్సీ రంగంలో ఇటీవలి పరిణామాల విశ్లేషణ తర్వాతే ఈ మార్గదర్శకాలను తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇక అప్లికేషన్ ఆఫ్ జనరిక్ అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ (ఏఎల్ఎమ్) తదితర ఇతర మార్గదర్శకాలు కూడా ఈ ముసాయిదాలో ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ ఉన్నత స్థాయి యాజమాన్యంతో కూడిన అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ (ఏఎల్సీవో)ని కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది. లిక్విడిటీ రిస్క్ నిర్వహణ కోసం దీన్ని సూచించింది. ఎన్బీఎఫ్సీ రుణ కార్యకలాపాలపై ఇబ్బందులు ఎదురైతే ఎదుర్కొనేందుకు అత్యవసర నిధి ప్రణాళికను కూడా రూపొందించుకోవాలని పేర్కొంది.