టీడీపీలో రాజుకున్న విభేదాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎమ్మెల్సీ పదవి జిల్లాలో టీడీపీలో చిచ్చు రేపింది. నిన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న నాయకులు మధ్య అగాథం ఏర్పడింది. మొన్న టి వరకు ఆ పదవి కోసం ఒకరే ప్రయత్నించగా ఇప్పుడా జాబితాలోకి రెండో వ్యక్తి వచ్చారు. అందులో ఒకరు జిల్లా ప్రధాన కార్య దర్శి ఐవీపీ రాజు కాగా, మరొకరు జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతగా పరిగణించి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు కోరుతున్నారు. ఇప్పటికే అనుచరులు, సన్నిహితులతో అశోక్ బంగ్లాలో సమావేశం నిర్వహించి, తమ కోరి కను అశోక్ గజపతిరాజు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా నేతలందరి మనోగతంగా ఆ సమయంలో చెప్పారు. కానీ, అశోక్ కాస్త చిరాకు పడ్డారు. ఉద్దేశమేంటో తెలియ దుగాని ఐవీపీకి మంచి చేద్దామనుకుంటున్నారా? చెడు చేద్దామనుకుంటున్నారా? అని కేడర్‌నుద్దేశించి కఠినంగా మాట్లాడారు.
బయటకు సీరియస్‌గా స్పందించినా అశోక్ గజపతిరాజు తప్పనిసరిగా గుర్తిస్తారని, బంగ్లాను అంటిపెట్టుకుని ఉన్న ఐవీపీకి న్యాయం చేస్తారని ఆయన అనుచరులు ఆశతో ఉన్నారు. ఈ పరిణామాలన్నీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌కు రుచించనట్టు ఉంది. అంతవరకు పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పదవిపైనే దృష్టిపెట్టిన జగదీష్ మనసు మా ర్చుకున్నారు. తన రాజకీయ కెరీర్ అక్కడితో ముగిసిపోకుండా కొత్త ఎత్తుగడ వేశారు. మున్సిపల్‌చైర్మన్ పదవిని తన భార్య ప్రతిమాదేవికి కట్టబెట్టి, తనకీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సరికొత్త పల్లవి ఎత్తారు. అంతటితో ఆగకుండా మద్దతు కూడగట్టుకుని, మనసులో మాటను నేరుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెవిలో వేశారు.
అదే విషయాన్ని మీడియా వద్ద ప్రస్తావించారు. దీంతో ఐవీపీరాజు కంగుతిన్నారు. దీంతో అశోక్ బంగ్లాలో లుకలుకలు మొదలయ్యాయి. ఐవీపీకి ఉన్నతావకాశాలు దక్కకుండా తెరవెనుక కుట్ర జరగుతుందనే వాదన తెరపైకొచ్చింది. ఇదే విషయమై విసృ్తత చర్చ జరుగుతోంది. అకస్మాత్తుగా తెరపైకొచ్చిన జగదీష్‌కు మద్దతివ్వడం ద్వారా ఎమ్మెల్సీ పదవికి పోటీ పెట్టి ఐవీపీకి దెబ్బకొట్టాలని ఓ వర్గం వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోందన్న వాదన విన్పిస్తోంది. మొత్తానికి బంగ్లా రాజకీయం రసవత్తరంగా మారింది.