మిషన్‌తో లెర్నింగ్ లెసైన్స్ పరీక్ష
గుంటూరు (నగరంపాలెం) : రవాణాశాఖ ఆధ్వర్యంలో అందించే సేవలలో అతిముఖ్యమైనది డ్రైవింగ్ లెసైన్స్‌లను జారీ చేయడం. దీని కోసం ప్రథమంగా వాహనదారులు కంప్యూటరు ద్వారా నిర్వహించే లెర్నింగ్ లెసెన్స్ రిజిస్ట్రేషన్ (ఎల్ఎల్ఆర్) పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 20 ప్రశ్నలకు 12కి అన్సర్ చేస్తే ఎల్ఎల్ఆర్ పరీక్ష ఉత్తీర్ణత సాధించినట్లు. కానీ ఈ పరీక్షలో కొంతమంది రవాణాశాఖ సిబ్బంది పరోక్ష సహకారం అందించడంతో ఎల్‌ఎల్‌ఆర్‌లు పొందుతున్నారు. వాహనప్రమాదాలను గణనీయంగా తగ్గించాలంటే డ్రైవింగ్ లెసైన్స్‌లను పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన వారికే జారీ చేయాల్సి ఉంది. దానికి మొదటి పరీక్ష అయిన ఎల్ఎల్ఆర్ జారీకి మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు రవాణాశాఖ కమిషనరు నిర్ణయించారు.
ఏటీఎం తరహాలో మిషన్ పని :
అందుకోసం ఇప్పటి వరకు ఎల్ఎల్ఆర్ పరీక్షకు వినియోగించే కంప్యూటర్ స్థానంలో ఏటీయం తరహాలో ఉండే ప్రత్యేకమైన మిషన్‌ను రూపొందిం చారు. దీని కోసం ఎల్ఎల్ఆర్ స్లాట్ బుకింగ్ సమయంలోనే అభ్యర్థి వివరాలతో పాటు వేలిముద్రలు సైతం తీసుకుంటారు.
ఎల్ఎల్ఆర్ పరీక్షకు హాజరైన అభ్యర్థి మిషన్‌లో ఉన్న బయోమెట్రిక్ సిస్టమ్‌పై వేలు ఉంచడం ద్వారా పరీక్ష ప్రారంభమవుతుంది. గతంలో వలే ప్రశ్న వచ్చిన తర్వాత 30 సెకన్లు లోపు సమాధానం కోసం ఏటీమ్ మిషన్ తరహాలో ఉన్న కీబోర్డుపై అప్షన్ నొక్కితే చాలు. పరీక్ష మొత్తం మిషన్ పైభాగంలో ఏర్పాటు చేసిన కెమెరా అడియోతో సహా వీడియో రికార్డు చేసి అభ్యర్థి డేటాతో పాటు స్టోర్ చేస్తుంది. ఈ మిషన్ అందుబాటులోకి వస్తే బయోమెట్రిక్ ఉండటం వలన ఒకరికి బదులు మరొకరు పరీక్షను రాయలేరు.
సమీపంలో ఉండి సమాధానాలు అందించడానికి వీడియో రికార్డు వలన సాధ్యం కాదు. ఫిబ్రవరి 24వ తేదీన విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రవాణాశాఖ కమిషనరు ప్రయోగాత్మకంగా వివరించి, వీటిని ఏర్పాటు చేయడానికి ప్రాథమికంగా అనుమతి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ మొదటి తేదీ నాటికి ప్రతి జిల్లా ఉపరవాణా కమిషనరు కార్యాలయూనికి 10 మిషన్లు అందించనున్నారు.