లీటర్లు లీటర్లుగా...!
అక్షర తూణీరం
పుష్కర కృష్ణాతీర్థమే కాదు.. ముందు ముందు ఢిల్లీలో కొత్త ఆలోచనలు మొలకలెత్తితే పోస్టాఫీసులు మల్టీపర్పస్ మాల్స్ కావచ్చు.
ఎన్నికల సంరంభమంత ఆర్భాటంగా పుష్కర కోలాహలం మొదలైంది. ఇట్లాంటి సందర్భాన్ని చంద్రబాబు పేటెంట్ చేసేశారు. మూడు పుష్కరాల నుంచీ ఈ తర్పణ సంప్రదాయానికి యమ ప్రచారం కల్పిస్తూ వస్తున్నారు. ‘‘రేవుల్లోకి మునగండి! మునగండి!’’ అనే నినాదంతో పెద్ద సైజు ఇమేజీతో హోర్డిం గులు దిగిపోతాయి. అవి పుష్కర స్నానాలాచరించవు. కానీ, లక్ష లాది మందిని ముంచి స్నానాలు చేయిస్తాయి. ఇప్పటికే వాటికి టెండర్లు పూర్తయి, కళాకారుల కుంచెలు కదుల్తున్నాయి. లక్షల సంఖ్యలో రకరకాల కరపత్రాలు మూడు నాలుగు భాషల్లో పచ్చ రంగులో అచ్చవుతున్నాయి. వీటిలో రెండువైపుల మన అభివృద్ధి పథకాల గురించి, మూడోవైపు పుష్కరాల్లో జాగ్రత్తల గురించీ వివ రించడం జరుగుతుంది.
మరోపక్క ఢిల్లీ సర్కారు పుష్కర తీర్థం ద్వారా పుణ్యాన్ని లీటర్ల లెక్కన అమ్మ డానికి కంకణం కట్టుకుంది. గతంలో గంగాజలం, గోదా వరి నీళ్లు పోస్టాఫీసుల ద్వారా అమ్మిన ఘనచరిత్ర మోదీకి ఉంది. ఇప్పుడు ‘పుష్కర కృష్ణా తీర్థం’ అమ్మకానికి వస్తోంది. అసలు ఆగస్టు మొదటి వారం లోనే అన్ని పోస్టాఫీసులకు పుష్కర తీర్థం సీసాలు పంపేసి, ముందస్తుగానే గ్రామీణ ప్రజలను పునీతుల్ని చేయ్యాలను కున్నారు. ఉన్నట్లుండి ఒకాయన పుష్కరుడు ప్రవేశించకుండా పుణ్య జలమెలా అవుతుంది? ఆగస్టు 12 తర్వాత వచ్చేట్టు చూడాలి అని గుర్తు చేశాట్ట. అప్పుడందరూ నాలికలు కరుచుకుని, ఆ విధంగా వాయిదా వేశారు. మనలో కూడా ఇంతటి మేధావులున్నారని మురిసిపోయారట!
ఎంకిపెళ్లి సుబ్బిచావుకని మాకేంటి ఈ దండగ అంటూ చిన్న పోస్టుమాస్టర్లు గొడవ పెడుతున్నారు. కృష్ణాతీరంలో ఉండేవారెవ్వ రైనా ఇవి కొంటారా? ఏలిన వారికి తెలియదేమో గాని కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఊరూరికీ కృష్ణా కాలువలుంటాయి. కృష్ణా డెల్టాలో సాగునీరు అవే. వాటిని సీసాల్లో పోసి ఆ ఊళ్లోనే అమ్మిం చడం - హిమాలయాల్లో ఐస్ అమ్మడం, ఎడారిలో ఇసుక అమ్మడం లాంటివి. పాపం ఆ గ్రామీణ పోస్టు మాస్టర్లకు ప్రత్యక్షంగా పుష్కర పన్ను పడింది. పై వారి కోటా ప్రకారం తీర్థజలం వస్తుంది. అమ్మినా, వారే సేవించినా, స్నానమాడినా పై వారికి అనవసరం. డబ్బు మాత్రం జమ చేసెయ్యాలి. లేదంటే జీతంలో కోత పడు తుంది.
పాపం, వాళ్లు గతంలో భద్రాచలం రామ కల్యాణం అక్షిం తలు విక్రయించారు. అన్నవరం సత్యనారాయణ దేవుని ప్రసాదాలు అంటగట్టారు. ఇంకా భవిష్యత్తులో ఏమేమి అమ్మిస్తారో భయపడి పోతున్నారు. మరీ అంతకు ముందు చలిజ్వరం టాబ్లెట్లు క్వినైన్ అమ్మేశారు. ఇందిరమ్మ హయాంలో సరసమైన ధరకు నిరోధ్లు అమ్మించారు. ముందు ముందు ఢిల్లీలో కొత్త ఆలోచనలు మొల కలెత్తితే పోస్టాఫీసులు మల్టీపర్పస్ మాళ్లు అయిపోవడం ఖాయం. కమిషన్ మీద సినిమా టిక్కెట్లు అమ్మించవచ్చు. మన దేశానికి కల్పతరువు, కామధేనువు అయిన మద్యాన్ని వీటి ద్వారా అందిం చవచ్చు. మన సంప్రదాయసిద్ధమైన రుద్రాక్షలు, గంధపు చెక్కలు, విభూది, మహత్తు గల తావీదులు అమ్మకానికి పెట్టచ్చు. ఇంకా బోలెడు ఆలోచనలు నాకే వస్తుంటే, వారికి కొదవా?!
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)