LED lighting
-
ఎల్ఈడీ లైట్లతో వందల కోట్లు ఆదా.. ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటు ద్వారా జీహెచ్ఎంసీకి రూ. 418 కోట్లు ఆదా అయ్యాయి. సోమవారం జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటు పూర్తి కాగా.. ఆ సంవత్సరం రూ. 42.42 కోట్లు, అనంతరం 2018–19 లో రూ. 85.23 కోట్లు, 2019–20లో రూ. 84.48 కోట్లు, 2020–21లో రూ. 86.72కోట్లు, అక్టోబర్ 2021 వరకు రూ. 49.93 కోట్లు వెరసి రూ. 347.78 కోట్లు కరెంట్ చార్జీలు ఆదా అయినట్లు పేర్కొంది. మెటీరియల్ ఖర్చులు, కార్మికుల ఖర్చులు కూడా తగ్గడంతో వాటితో కలిపి మొత్తంగా రూ.418.26 కోట్లు ఆదా అయినట్లు పేర్కొంది. హైదరాబాద్ నగరంలో ఎల్ఈడీ వీధి దీపాలను కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈఈఎస్ఎల్.. ఎన్టీపీసీతో కలిసి ఏర్పాటు చేసినట్లు తెలిపింది. (చదవండి: ‘శంషాబాద్’కు ఇంధన పొదుపు అవార్డు) -
‘లైట్’ తీస్కోవద్దు..ఎల్ఈడీ.. కీడు!
సాక్షి, హైదరాబాద్ : మీ ఇంట్లో ఎల్ఈడీ లైట్లు వినియోగిస్తున్నారా.. అయితే, జరభద్రం! వీటిని ఏమాత్రం ‘లైట్’గా తీసుకోకండి! ఈ వెలుగులు శృతిమించితే మిగిలేవి చీకట్లే! ధగధగల వెనుక దడదడ ఉంది.. ఈ కాంతి కాలుష్యం కాటేసే ప్రమాదం పొంచి ఉంది. అవును.. మీరు విన్నది నిజమే! ఎల్ఈడీ దీపాల దు్రష్పభావాలపై భువనేశ్వర్‌కు చెందిన సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్కు చెందిన ప్రొఫెసర్ సిబా ప్రసాద్ మిశ్రా బృందం అధ్యయనం నిర్వహించింది. ఇందులో పలు విస్మయపర్చే విషయాలు వెలుగు చూశాయి. గ్రేటర్‌సిటీలో కాంతికాలుష్య తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని తేలింది. దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఈ తీవ్రత అత్యధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ అధ్యయన వివరాలు ఇటీవల ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్’అనే పరిశోధన జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. దుష్ప్రభావాలు ఏమిటి..? ఎల్ఈడీ కాంతి కాలుష్యం శృతిమించడం వల్ల సిటీజన్లు నిద్రలేమి, స్థూలకాయం, డిప్రెషన్, చక్కెర వ్యాధి తదితర జీవనశైలి జబ్బుల బారిన పడుతున్నారు. మానవాళితోపాటు ఇతర జీవరాశుల్లోనూ విపరిణామాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఛత్వారం వస్తుంది. కంటిచూపు దెబ్బతింటుంది. పాదచారులు, వాహనచోదకులు ఒక చోటు నుంచి మరోచోటుకు ప్రయాణించే సమయంలో కంటిచూపులో స్పష్టత కోల్పోయి తరచూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. అత్యధిక కాలం ఎల్ఈడీ కాంతులను చూసేవాళ్లు సమీప భవిష్యత్‌లో రంగులను గుర్తించే విజన్ సామర్థ్యాన్ని సైతం కోల్పోయే ప్రమాదముందని కంటి వైద్య నిపుణుడు శ్రీకాంత్ ‘సాక్షి’కి తెలిపారు. ఏ నగరంలో కాంతితీవ్రత ఎంత? గ్రేటర్ హైదరాబాద్‌లో ఎల్ఈడీ విద్యుత్ ధగధగలు వెదజల్లుతున్న కాంతి తీవ్రత 7,790 యూనిట్లుగా ఉంది. ఈ తీవ్రతను ప్రతి చదరపు మీటర్‌స్థలంలో విరజిమ్మే కాంతి తీవ్రత ఆధారంగా లెక్కిస్తారు. ఈ విషయంలో మన గ్రేటర్ సిటీ తరవాత కోల్‌కతా రెండోస్థానంలో నిలిచింది. ఈ సిటీలో 7,480 యూనిట్ల కాంతితీవ్రత ఉంది. మూడోస్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీలో 7,270 యూనిట్ల కాంతి తీవ్రత నమోదైంది. భువనేశ్వర్‌లో అత్యల్పంగా 2,910 యూనిట్లుగా కాంతి తీవ్రత నమోదవడం గమనార్హం. ఈ తీవ్రతను 2014–ఆగస్టు 2019 మధ్యకాలంలో లెక్కించినట్లు తెలిపారు. హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, ముంబై, అహ్మదాబాద్‌లో కాంతి తీవ్రత ఈ మధ్యకాలంలో 102.23 శాతం మేర పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది. పశు,పక్ష్యాదులకూ గడ్డుకాలమే.. ఎల్ఈడీ కృత్రిమకాంతులు మానవాళికే కాదు పెంపుడు జంతువులు, పక్షుల జీవనశైలిని సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. వాతావరణ మార్పులకు అనుగుణంగా పక్షులు తమ మనుగడ కోసం ఒక చోటు నుంచి మరోచోటుకు వలసపోయే సమయంలో అత్యధిక కాంతుల బారిన పడినప్పుడు దారితప్పుతున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. కప్పలు సైతం వాటి ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. గబ్బిలాలు ఈ కాంతి బారినపడినప్పుడు భౌతిక ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ అత్యధిక కాంతుల బారిన పడిన జంతువులు అధిక దూరం ప్రయాణించేందుకు బెంబేలెత్తే పరిస్థితి తలెత్తుతోంది. అత్యధిక విద్యుత్ కాంతులు, కృత్రిమ కాంతులు, భారీ విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేసే సమయంలో ప్రభుత్వం తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. -
యాదాద్రికి ఎల్ఈడీ వెలుగులు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానం రెండో ఘాట్‌లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ ఎల్ఈడీ లైట్లు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఆకర్షణగా మారాయి. వీటిని ఏర్పాటుకు రూ.50లక్షలను వెచ్చించినట్లు అధికారులు తెలిపా రు. వీటిని యాదాద్రి దేవస్థానంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇటలీకి చెందిన నీరీ అనే సంస్థకు అప్పగించారు. సుమారు ఆరు నెలలు కష్టపడి ఈ లైట్లను తయారు చేశారు. రూపుదిద్దుకున్న లైట్లను ఇటలీ నుంచి యాదాద్రికి తీసుకు రావడానికే సుమారు మూడు నెలల సమయం పట్టిందని అధికారులు పేర్కొన్నారు. ప్రముఖ ప్రదేశాల్లోనే.. ఇలాంటి ఎల్ఈడీ లైట్లను గతంలో తంజావూర్, ఛత్రపతి శివాజీ, బాల్ థాక్రే స్మారక స్థూపం, సుప్రింకోర్టు, ఇండియా గేట్, ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ల వద్ద ఏర్పాటు చేసి ప్రశ«ంసలు అందుకున్నామని నీరీ సంస్థ అధికారులు తెలిపారు. వీరికి ఈ లైట్ల తయారీలో 75ఏళ్ల అనుభవం ఉందని అధికారులు చెప్పారు. వీటిని ఏర్పాటు చేసే ప్రదేశాలకు అనుగుణంగా లైట్లను అమర్చడం వారి ప్రత్యేకత. ఉదాహరణకు తిరుపతిలో స్వామివారి తిరునామాల చిత్రాలతో, సుప్రీంకోర్టు వద్ద ధర్మ చక్రం చిత్రంతో, అదేవిధంగా యాదాద్రిలో లక్ష్మీనారసింహ స్వామి వారి చిత్రాలతో నిర్మాణం చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. లైట్ల ప్రత్యేకతలు.. క్యాస్ ఐరన్ అనే లోహంతో లోపల ఒక పైపు, పైన ఒక పైపుతో తయారు చేశారు. రెండో ఘాట్ రోడ్డు పక్కన 50 లైట్లను ఏర్పాటు చేశారు. వీటితో భక్తులకు చీకటిలో సైతం పగలుమాదిరిలా వెలుతురు పుష్కలంగా ఉం టుం దని భక్తులు పేర్కొన్నారు. అతి తక్కువ విద్యుత్‌తో ఎక్కువ వెలుగులు వచ్చే వి ధంగా ఈ లైట్లు ఉపయోగపడుతున్నాయని ఎస్సీ లింగారెడ్డి, ఈఈ రామారావు అంటున్నారు. ప్రమాదాల నివారణ.. రాత్రి వేళ ఎక్కువ వెలుగులు రావడంతో ప్రమాదాల నివారణకు కూడా దోహదం చేస్తున్నాయని అధికారులు అంటున్నారు. ఆలయానికి కాలినడకన వచ్చే భక్తులు భయంలేకుండా స్వామి వారి సన్నిధికి చేరుకోవచ్చని సిబ్బంది పేర్కొన్నారు. -
శ్రీవారి ఆలయానికి ఎల్ఈడీ శోభ
సాక్షి, తిరుమల: రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన తిరుమలేశుని ఆలయంతోపాటు తిరుమలలోనూ దాతల సహకారంతో సరికొత్త సాంకేతిక విద్యుత్ వ్యవస్థతోపాటు త్రీడీ విద్యుత్ కాంతులు ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. తిరుమలలోని శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, కల్యాణకట్ట, అన్నప్రసాద కేంద్రంతోపాటు అన్ని కాటేజీలు, అతిథిగృహాలు, వీధి లైట్లకు రోజూ సుమారు 1.25 నుండి 1.50 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. అంటే ఏడాదికి 4.5 కోట్ల యూనిట్ల విద్యుత్ అన్నమాట. ఇందుకు టీటీడీ సుమారుగా రూ.14 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని అదుపు చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. దానికోసం రూ.5 కోట్ల ఖర్చుతో ఆలయంతోపాటు తిరుమలలోని దాదాపుగా అన్ని కాటేజీల్లో ఎల్ఈడీ బల్పులు అమర్చారు. వీధుల్లోనూ సోడియం వేపర్ బల్బుల స్థానంలో 120వాట్స్ ఎల్ఈడీ బల్పులు అమర్చుతున్నారు. -
హైదరాబాద్‌లో సిస్కా ఎల్ఈడీ లాంజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎల్ఈడీ లైటింగ్ ఉత్పత్తుల తయారీలో ఉన్న సిస్కా హైదరాబాద్‌లో తొలి ఎల్ఈడీ లాంజ్‌ను ప్రారంభించింది. 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇక్కడి ఎంజీ రోడ్లో ఇది ఏర్పాటైంది. దీనితో కలిపి దేశవ్యాప్తంగా కంపెనీకి మొత్తం 87 లాంజ్‌లు ఉన్నాయి. రెసిడెన్షియల్, క మర్షియల్, ఔట్‌డోర్, ఇండస్ట్రియల్ లై టింగ్ ఈ స్టోర్లలో కొలువుదీరాయి. ఇంటీరియర్ డిజైనర్లు, ఆర్కిటెక్టులు, కన్సల్టెంట్లతో భాగస్వామ్యం మరింత బలపడేందుకు లాంజ్‌లు దోహదం చేస్తాయని సిస్కా ఎల్ఈడీ ఎండీ రాజేశ్ ఉత్తమ్‌చందానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.