అసలు కోహ్లితో ‘పోరు’ మొదలైతేగా...
వాగ్వాదాలపై లీమన్ వ్యాఖ్య
మెల్బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై తన ఆటతో పాటు నోటితో కూడా విరాట్ కోహ్లి దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా మూడో టెస్టులో అతనికి, ఆసీస్ ఆటగాళ్లకు మధ్య చాలా సార్లు వాగ్వాదం జరిగింది. కోహ్లి ఎదురుదాడి ఆస్ట్రేలియాపై ప్రభావం చూపిం చిందా అనే ప్రశ్నకు జట్టు కోచ్ లీమన్ భిన్నంగా స్పందించాడు. విరాట్ తీరును అతను చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ‘అసలు మేం ఇంకా విరాట్ కోహ్లితో పోరు మొదలు పెట్టనే లేదు’ అని లీమన్ సమాధానమివ్వడం విశేషం. ‘ఇది ఆసక్తికర సిరీస్.
ఇరు జట్లు కూడా ఈ తరహాలో దూకుడుగా ఉండటాన్ని మేం కూడా ఇష్టపడతాం. ఇలాంటివి మైదానంలో ఎన్ని జరిగినా పట్టించుకోనవసరం లేదు. ఆసీస్ కూడా ఇదే తరహాలో ఆడుతుంది. చాలా కఠినమైన పరిస్థితుల్లో, తీవ్ర పోటీ మధ్య సిరీస్ సాగుతోంది కాబట్టి నాకేం సమస్య లేదు’ అని లీమన్ అన్నాడు. ఆసీస్ ఆలస్యంగా డిక్లేర్ చేయడాన్ని కోచ్ సమర్థించుకున్నాడు.
భారత్ కూడా బౌండరీ వద్ద ఫీల్డర్లు పెట్టి, కొత్త బంతి తీసుకోకుండా ఆత్మరక్షణ ధోరణిలోనే ఆడిందని, చివరి రోజు సిరీస్ గెలవడమే తమకు ముఖ్యమని అతను చెప్పాడు. హ్యూస్ కుప్పకూలిన సిడ్నీ మైదానంలో ఆఖరి టెస్టు జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లు చాలా ఉద్వేగానికి లోనయ్యే అవకాశం ఉందని, అయితే సిరీస్లో జోరును కొనసాగిస్తారని లీమన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.