Legality of Marriage
-
LGBTQI: అసహజమేనా!.. స్వలింగ సంపర్కంపై మారుతున్న దృక్కోణం
స్వలింగ సంపర్కం. అసహజ లైంగిక ప్రవృత్తి. ఇది కొత్తదేమీ కాదు. ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే అన్ని సమాజాల్లోనూ, అన్ని కాలాల్లోలోనూ అనివార్యంగా కన్పించే ధోరణే. కానీ కొన్ని దశాబ్దాల క్రితం దాకా దీనికి సమాజం ఆమోదం లేదు. సరికదా, ఇందుకు పాల్పడే వారిని దోషుల్లా పరిగణిస్తూ హీనంగా చూసే ధోరణే చాలా సమాజాల్లో ఉండేది. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆస్కార్ వైల్డ్‌ను కూడా గే సెక్స్‌కు పాల్పడ్డారంటూ జైల్లో పెట్టారు! అత్యంత ప్రగతిశీల దేశంగా చెప్పుకునే ఇంగ్లండ్‌లో కూడా వందేళ్ల క్రితం ఇదీ పరిస్థితి! ఇప్పటికీ ఐరాస సభ్య దేశాల్లో 76కు పైగా స్వలింగ సంపర్కులపై వివక్షపూరితమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. అయితే గత పాతికేళ్లుగా ఈ విషయంలో పౌర సమాజం దృక్కోణంలో చెప్పుకోదగ్గ మార్పు కన్పిస్తోంది. లైంగిక ప్రవృత్తి విషయంలో స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కు వంటిదేనన్న వాదనలూ బయల్దేరాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ సంబంధాలకు సమర్థన 1990ల్లో 20 శాతం లోపే ఉండగా 2020 నాటికి 70 శాతానికి పైగా పెరిగింది! తాజాగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అధ్యక్షుడు బైడెన్ సంతకం కూడా చేశారు. ఐక్యరాజ్యసమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు, హక్కుల సంఘాలు కూడా స్వలింగ సంపర్కానికి, ఆ వివాహాలకు కొన్నేళ్లుగా ఎంతగానో మద్దతిస్తున్నాయి. స్వలింగ వివాహాలను తొలిసారిగా 2000లో నెదర్లాండ్స్ చట్టబద్ధం చేసింది. ఆ తర్వాత ఇప్పటిదాకా 34 దేశాల్లో చట్టపరంగానో, కోర్టు ఆదేశాల రూపేణో అందుకు ఆమోదం లభించింది. ఐరాస సభ్య దేశాల్లో భారత్‌తో పాటు మొత్తం 71 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాయి. ఆసియా దేశాల్లో... దక్షిణ, మధ్య ఆసియాతో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో స్వలింగ సంపర్కం, వివాహాలపై తీవ్ర వ్యతిరేకత, నిషేధం అమల్లో ఉన్నాయి. ఆసియాలో ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా తైవాన్ నిలిచింది. అలాగే చైనా కూడా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం లేదు. అయితే వారి వివాహాన్ని మాత్రం నేరంగానే చూస్తోంది. వియత్నాం కూడా ఇవి నేరం కాదని పేర్కొన్నా ఇంకా పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించలేదు. ఆ దేశాల్లో మరణశిక్షే... సౌదీ అరేబియా, సుడాన్, యెమన్, ఇరాన్‌ల్లో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణశిక్షే! నైజీరియా, సోమాలియాల్లోనూ కొన్ని ప్రావిన్సుల్లో ఇదే పరిస్థితి! అసహజ రతి, వివాహేతర సంబంధాలతో పాటు స్వలింగ సంపర్కులను కూడా రాళ్లతో కొట్టి చంపే శిక్షలు అరబ్ దేశాలతో పాటు పలు ఇరత దేశాల్లో అమల్లో ఉన్నాయి. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యూఏఈ, ఖతార్ వంటి దేశాల్లోనూ ఇందుకు మరణశిక్ష విధించే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రూనై మాత్రం స్వలింగ సంపర్కాలకు మరణశిక్ష అమలు చేయబోమని ప్రకటించడం విశేషం. భారత్‌లో పరిస్థితి? మన దేశంలో ఆది నుంచీ స్వలింగ సంపర్కంపై చిన్నచూపే ఉంటూ వచ్చింది. బ్రిటిష్ వారి హయాంలో దీనిపై నిషేధం విధించారు. సుప్రీంకోర్టు కూడా ఇది ప్రకృతి విరుద్ధమని, శిక్షార్హమైన నేరమేనని 2013లో తీర్పు చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నాన్ బెయిలబుల్ నేరం. దీనికి పదేళ్ల దాకా జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం ఎంతమాత్రమూ నేరం కాదని పేర్కొంటూ 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఉన్న దేశాలు చిలీ, స్విట్జర్లాండ్, కోస్టారికా, ఈక్వెడార్, తైవాన్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, మాల్టా, జర్మనీ, కొలంబియా, అమెరికా, గ్రీన్లాండ్, ఐర్లండ్, ఫిన్లండ్, లగ్జెంబర్గ్, స్కాట్లండ్, ఇంగ్లండ్, బ్రెజిల్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఉరుగ్వే, డెన్మార్క్, అర్జెంటీనా, పోర్చుగల్, ఐస్లాండ్, స్వీడన్, మెక్సికో, నార్వే, దక్షిణాఫ్రికా, స్పెయిన్, కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్, తైవాన్ ఏమిటీ ఎల్జీబీటీక్యూఐ? ► రకరకాల అసహజ లైంగిక ప్రవృత్తులున్న వారందరినీ కలిపి ఎల్జీబీటీక్యూఐ అని వ్యవహరిస్తుంటారు. ► ఇది లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్, ఇంటర్ సెక్స్‌కు సంక్షిప్త నామం. ► ఇద్దరు మహిళల మధ్య ఉండే లైంగికాసక్తి లెస్బియనిజం. ఇలాంటివారిని లెస్బియన్‌గా పిలుస్తారు. అదే పురుషుల మధ్య ఉంటే వారిని గే అంటారు. ► సందర్భాన్ని బట్టి ఎవరి మీదనైనా ఆకర్షణ చూపేవారు బై సెక్సువల్. ► ఇక పుట్టినప్పుడు ఆడ/మగగా ఉండి, పెరిగి పెద్దయ్యాక అందుకు భిన్నంగా మారేవారిని/మారేందుకు ఆసక్తి చూపేవారిని ట్రాన్స్‌జెండర్/ట్రాన్స్ సెక్సువల్ అంటారు. అంటే తృతీయ ప్రకృతులన్నమాట. మన దగ్గర హిజ్రాలుగా పిలిచేది వీరినే. దేశవ్యాప్తంగా వీరికి రకరకాల పేర్లున్నాయి. మళ్లీ వీరిలో చాలా రకాల వారుంటారు. ఉదాహరణకు మగ పిల్లాడిగా పుట్టి కూడా తనను తాను అమ్మాయిగా భావించుకుంటూ మరో అబ్బాయిని ఇష్టపడేవాళ్లు ఈ కోవలోకే వస్తారు. ఇలాంటివారిని హెటిరో సెక్సువల్ ట్రాన్స్‌జెండర్ అంటారు. ► క్యూ అంటే క్వీర్. వీరికి తాము ఆడా, మగా, ట్రాన్స్‌జెండరా, మరోటా అన్నదానిపై వాళ్లకే స్పష్టత ఉండదు. అందుకే వీరిని క్వశ్చనింగ్ అని కూడా అంటూంటారు. ► చివరగా ఇంటర్‌సెక్స్. అంటే పుట్టినప్పుడు జననాంగాల స్థితిగతులను బట్టి ఆడో, మగో చెప్పలేనివారు. మళ్లీ వీరిలోనే క్రాస్డ్రెస్సర్స్ అనీ, మరోటనీ పలు రకాలున్నాయి. ► ఎల్జీబీటీక్యూఐ మొత్తాన్నీ కలిపి ఇటీవల కామన్‌గా గే గా వ్యవహరిస్తున్నారు. ► వీరు తమ ఆకాంక్షలకు ప్రతీకగా తరచూ ఆరు రంగులతో కూడిన జెండాను ప్రదర్శిస్తుంటారు. కొన్నేళ్లుగా ఈ జెండా ఒకరకంగా ఎల్జీబీటీక్యూఐ హక్కుల ఉద్యమానికి ప్రతీకగా మారిపోయింది. అమెరికాలో స్వలింగ వివాహాలు ఇక చట్టబద్ధం బిల్లుపై సంతకం చేసిన అధ్యక్షుడు జో బైడెన్ వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మంగళవారం మధ్యాహ్నం వేలాది మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. స్వలింగ వివాహాలకు వీలు కల్పించే బిల్లు చట్టరూపం దాల్చడమే వారి ఆనందానికి కారణం. అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ఉభయ సభల్లో ఇప్పటికే ఆమోదం పొందిన స్వలింగ వివాహాల(గే, లెస్బియన్ మ్యారేజెస్) బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో బిల్లు ఇక చట్టంగా మారింది. ఈ చట్టం సమాజంలో పలు రూపాల్లో ఉన్న ద్వేషాలకు ఒక ఎదురుదెబ్బ అని బైడెన్ అభివర్ణించారు. ప్రతి ఒక్క అమెరికన్‌కు ఇది చాలా ప్రాధాన్యం అంశమని అన్నారు. బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేసే కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని పోరాటం చేసిన వారికి ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కృతజ్ఞతలు తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తండ్రి రెండో పెళ్లిని కూతురు ప్రశ్నించొచ్చు: హై కోర్టు
ముంబై : తండ్రి రెండో పెళ్లి చెల్లుబాటుపై కోర్టులో ప్రశ్నించే అధికారం కూతురుకి ఉందని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులకు చెందిన కాబట్టి భార్య, లేదా భర్త మాత్రమే కోర్టులో దాని చెల్లుబాటుని ప్రశ్నించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని జస్టిస్ ఆర్డి ధనూక, జస్టిస్ విజీ బిషత్‌లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం కొట్టేసింది. 66 ఏళ్ల మహిళ మరణించిన తన తండ్రి రెండో వివాహం చెల్లుబాటుపై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కోర్టుకెక్కారు. ఆ పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు కన్న కూతురిగా తండ్రి రెండో పెళ్లిని ప్రశ్నించే అధికారం ఆమెకు ఉందని తేల్చి చెప్పింది. 2016లో ఒక మహిళ తన తండ్రి రెండో వివాహం చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఫ్యామిలీ కోర్టుకెక్కారు. 2003లో ఆమె తల్లి మరణించాక తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. 2016లో తండ్రి మరణించాక తన సవితి తల్లి మొదటి భర్తతో విడాకులు తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నట్టుగా ఆమెకి తెలిసింది. తన తండ్రి ఆస్తులన్నీ సవితి తల్లే అనుభవిస్తూ ఉండడంతో విడాకులు తీసుకోకుండా ఆమె చేసుకున్న పెళ్లి ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నిస్తూ ఫ్యామిలీ కోర్టుకెక్కారు. అయితే ఫ్యామిలీ కోర్టులో సవితి తల్లి.. వివాహం అనేది ఇద్దరి వ్యక్తులకు సంబంధించినదని, దాని చెల్లుబాటును కుమార్తె ఎలా ప్రశ్నిస్తారని వాదించారు. ఫ్యామిలీ కోర్టు సవితి తల్లికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ ఆ కూతురు బాంబే హైకోర్టుకి వెళ్లగా అక్కడ ఆమెకి ఊరట లభించింది. చదవండి: భార్య.. భర్త ఆస్తికాదు: హైకోర్టు ఆమె చావుకు అంత పబ్లిసిటీ వద్దు: హైకోర్టు -
మీ పెళ్లి చట్టబద్ధమేనా?
ఇల్లు కొంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కానీ.. పెళ్లి చేసుకుంటే కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా..? వివాహానికీ చట్టబద్ధత ఉంటుందా..? ఇలా.. ఈ విషయంపై నిరక్షరాస్యులకే కాదు.. అక్షరాస్యులకూ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అధికారులు సరైన ప్రచారం చేపట్టక పోవడంతోనే వివాహ రిజిస్ట్రేషన్లపై ప్రజలకు అవగాహన లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఏటా వేల సంఖ్యల్లో వివాహాలు జరుగుతున్నా ఇందులో పట్టుమని పది కూడా రిజిస్ట్రేషన్‌కు నోచుకోవడం లేదు. దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడం.. అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో వివాహాలకు చట్టభద్రత కొరవడుతోంది. పెళ్లికి చట్టబద్ధత కల్పించడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎవరికీ తెలియకపోవడం కూడా దీనికి కారణమవుతోంది. ఫలితంగా పలు పథకాల వర్తింపులో చాలామంది అనర్హులుగా మిగిలిపోతున్నారు. అసలు వివాహాలను ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. ఎలా చేసుకోవాలి.. చేసుకుంటే ఉపయోగాలేమిటి.. తదితర వంటి అంశాలపై కథనం. మన సంప్రదాయంలో వివాహానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లంటే నూరేళ్ల పంట అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇటీవల వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం పరిపాటిగా మారింది. లక్షలు ఖర్చు పెట్టి వివాహం చేసుకుంటున్న వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను అధికారులూ పట్టించుకోకపోవడంతో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు నమోదు కావడం లేదు. చట్ట ప్రకారం హిందూ వివాహ చట్టం ప్రకారం హిందువుల్లో వివాహం చేసుకున్న ప్రతి జంట రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాని దీనికి తగిన ప్రచారం కల్పించకపోవటంతో ఆ దిశగా పెళ్లిళ్లు నమోదు కావడం లేదు. వివాహాలు అధికంగా జరుగుతున్నా రిజిస్ట్రేషన్ సంఖ్య మాత్రం అంతకంతకూ దిగజారుతోంది. ఇదే కాకుండా కులాంతర, మతాంతర వివాహాలు రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతాయి. అండర్ స్పెషల్ మ్యారేజెస్ చట్టం ప్రకారం రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహమైన రోజున వీరికి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. ఇలా జరిగినవి కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఒక్కటి కూడా నమోదు కాలేదు ఏటా వివాహాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే చట్టబద్ధత పొందుతున్నాయి. వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అంతంత మాత్రంగానే అమలవుతోంది. వేలల్లో వివాహాలు జరుగుతున్నా వివాహాల రిజిస్ట్రేషన్ నమోదు పెరగటం లేదు. వివాహాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ పదకొండేళ్ల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి తగిన యంత్రాంగం లేకపోవటంతో అమలుకు నోచుకోలేదు. దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడం, అధికారులు ప్రచారం చేయకపోవటం ప్రధానం కారణం. దరఖాస్తు చేసుకుంటేనే ఫంక్షన్‌హాళ్లు వివాహా నమోదు చట్టాన్ని అమలు చేసేందుకు ఫంక్షన్‌హాళ్లు, మ్యారేజ్‌హాల్స్, దేవాలయాలకు నగరపాలక సంస్థ కమిషనర్ పేరుతో నోటీసు లు అందజేయాలి. వివాహ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ధ్రు వీకరణ పత్రం అందజేస్తేనే వివాహం చేసుకునే వారికి ఫంక్షన్ హాళ్లు అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. అధికారులు దీన్ని అమలు చేయడం లేదు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇక ఇళ్ల వద్ద పెళ్లిళ్లు చేసుకునే వారిలో చాలామందికి అసలు ఈ విషయమే తెలియదు. అవగాహన కల్పించాలి వివాహ రిజిస్ట్రేషన్ విషయంలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టబద్ధత వల కలిగే ప్రయోజనాలను వివరించటం ద్వారా వివాహాల నమోదు సంఖ్య పెరుగుతుంది. జిల్లా కేంద్రంలో జరిగే ప్రతి వివాహం నగరపాలక సంస్థలో తప్పని సరిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న విషయం ఇప్పటికి ప్రజలకు తెలియదంటే దీనిపై ప్రచారం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు విధాలుగా దరఖాస్తు పెండ్లికి నెల ముందు నగరపాలక సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి ముందే సమాచారం ఇవ్వటం వల్ల తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వధువు, వరుడి పాస్‌పోర్టు సైజు ఫొటోలు, లగ్న పత్రికను విధిగా ధరఖాస్తు ఫారంతో జతపర్చాలి. ముందుగా దరఖాస్తు చేసుకోనివారు వివాహం చేసుకున్న నెల రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పెండ్లి ఫొటోలు, వధువు, వరుడి రెండు పాస్ ఫొటోలు, లగ్న పత్రికను దరఖాస్తుతో జతపర్చాలి. నగరపాలక సంస్థ సిబ్బంది విచారణ చేపట్టి.. క్లియరెన్స్ ఇవ్వగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రయోజనాలు *వివాహానికి చట్టబద్ధత ఉంటుంది. *కుటుంబానికి సంబంధించిన అన్ని పథకాల వర్తింపునకు ఇది చాలా అవసరం. *వరకట్న వేధింపుల సందర్భాలలో నేరాలు రుజువు కావడానికి ముఖ్య ఆధారం. *హింసకు గురైన లేదా గురవుతున్న స్త్రీ, పురుషులిద్దరికి ఇది సౌకర్యమే. *బాల్య వివాహాలు నివారించవచ్చు. *విదేశాలకు వెళ్లే జంటలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.