Lesbians
-
లెస్బియన్స్‌గా యంగ్ హీరోయిన్స్.. ఓటీటీలో దూసుకెళ్తోన్న మూవీ!
కోలీవుడ్‌లో యంగ్ హీరోయిన్స్ శృతి పెరియస్వామి, నిరంజన నతియార్ జంటగా నటించిన చిత్రం 'వాజ్వు తొడంగుమిడం నీతానే'. అయితే ఈ చిత్రంలో వీరిద్దరు లెస్బియన్లుగా నటించారు. ఈ మూవీలో ముస్లిం, హిందూ యువతులుగా నటించారు. షార్ట్‌ఫ్లిక్స్ అనే ఓటీటీ సంస్థతో కలిసి నటి నీలిమా ఇసై దీన్ని నిర్మించారు. ఈ మూవీకి జయరాజ్ పళని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రస్తుతం షార్ట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజై ఓటీటీలో దూసుకెళ్తోంది. (ఇది చదవండి: లూసిఫర్ సీక్వెల్ రెడీ.. మాలీవుడ్‌లో లైకా ప్రొడక్షన్స్ ప్లాన్) ఈ మూవీకి సక్సెస్ కావడంతో చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈవెంట్‌కు హాజరైన పలువురు ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో లెస్బియన్లుగా నటించడం పట్ల శృతి పెరియస్వామి, నిరంజన నైదియర్ తమ అనుభవాలను వెల్లడించారు. శృతి పెరియస్వామి మాట్లాడుతూ..' ఈ సినిమా కథను డైరెక్టర్ చెప్పిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను మోడలింగ్‌లో అనేక మంది టాలెంట్ చూపించేందుకు కష్టపడుతున్నారు. ఈ రంగంలో ఉండే చాలా మంది లెస్బియన్స్గానే జీవిస్తున్నారు. అందుకే ఈ పాత్రలలో నటించాలని నిర్ణయించుకున్నా' అని అన్నారు. (ఇది చదవండి: వాడుకోవడం అలవాటేగా.. గీతూ ప్రశ్నలకు బిక్కముఖం వేసిన రతిక) నిరంజన నైదియర్ మాట్లాడుతూ... ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాన్నే స్టోరీగా చేశాం. ఒక నటిగా దర్శకుడు చెప్పిందే చేస్తా. నన్ను లెస్బియన్ మద్దతుదారులా? అని చాలామంది ప్రశ్నించారు. ఒక చిత్రంలో నటుడు హంతకుడిగా నటిస్తే అతన్ని హత్యలు చేసే వ్యక్తిగా చిత్రీకరిస్తామా? ఈ చిత్రంలో కేవలం ఒక సమస్యను మాత్రమే దర్శకుడు చూపించారు' అని అన్నారు. కాగా.. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి షార్ట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో అర్షత్ ఫెరాస్, ఆరుముగవేల్, ఆర్జే ప్రదీప్, శంకర్, నిరంజన్, తస్మిక, కన్నన్, మారన్ కార్తికేయన్, మహేష్, శివ శక్తి, సుధ కీలక పాత్రలు పోషించారు. -
ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి కిరాతకంగా హత్య చేసిం'ది'
కులమో మతమో.. ఆస్తో అంతస్తో.. కారణమేమైనా ఇరు కుటుంబాలకు నచ్చని ప్రేమకథల్లో విషాదాంతాలే ఎక్కువ. ఒకరి కోసం ఒకరు బతకలేనప్పుడు.. ఒకరి కోసం ఒకరు చావడమే మేలని తెగించిన సందర్భాలకు సాక్ష్యాలెన్నో చరిత్రలో. అయితే విఫలమైన ప్రేమలోంచి పుట్టుకొచ్చే ఉన్మాదం ఎంతకైనా తెగిస్తుంది. అదే జరిగింది ఎలిస్–ఫ్రీడా జీవితాల్లో. అయితే ప్రేమకు కులమతాలే కాదు లింగబేధాలు కూడా ఉండవని చెప్పిన తొలినాళ్ల కథ ఇది. అది 1892, జనవరి మొదటివారం. అమెరికాలోని టెన్నెసీ, మెంఫిస్‌లోని 17 ఏళ్ల ఫ్రీడా వార్డ్ దారుణ హత్య.. దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. చంపింది ఎవరో కాదు తన ఫియాన్సీ ఎలిస్ మిషెల్. అంతకుముందు ఏడాది.. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ ఎన్నో ప్రేమలేఖలు రాసుకున్నారు. ఎంతో ఇష్టంగా ఉంగరాలు మార్చుకున్నారు. ప్రాణంగా ప్రేమించిన మనిషే తన ప్రాణాలు తీస్తుంటే ఫ్రీడా నిస్సహాయంగా కూలబడిన క్షణాల గురించి.. ఆమె సోదరి.. ప్రత్యక్షసాక్షి.. ఎడా కన్నీటి పర్యంతమవుతూ జరిగిందంతా కళ్లకు కట్టింది. ‘నేను, మా చెల్లి (ఫ్రీడా) మా ఫ్యామిలీ ఫ్రెండ్ మిసెస్ కింబ్రోగ్ని కలవడానికి మెంఫిస్ వెళ్లాం. అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో ఎలిస్, వాళ్ల అక్క లిల్లీ .. ఇద్దరూ కలసి గుర్రపు బగ్గీలో మమ్మల్ని వెంబడించారు. మేము ఉండే గోల్డ్డస్ట్కి వెళ్తున్న దారిలో ఎలిస్.. మా చెల్లిని చేయి పట్టుకుని లాగి.. రేజర్‌తో దాడిచేయడంతో నేను షాక్ అయ్యాను. వెంటనే తేరుకొని ఎలిస్‌ని కాలితో తన్ని కిందకు తోశాను. గొడుగుతో ఎలిస్‌ని ఆపేందుకు ట్రై చేస్తూ.. ఫ్రీడాని పారిపోమని హెచ్చరించాను. క్షణాల్లో నన్ను తోసేసిన ఎలిస్.. ఫ్రీడా వెంట పగబట్టిన తోడేల్లా పరుగుతీయడం కళ్లరా చూశాను. అలా నా చెల్లిని వెంబడించి దొరకబుచ్చుకున్న ఎలిస్.. ఫ్రీడా జుట్టు పట్టుకొని వెనక్కి లాగి రేజర్‌తో కసుక్కున ఆమె మెడ కోయడం నేను చూశాను. ఎడమ చెవి కింద నుంచి కుడి చెవి వరకూ మెడ లోతుగా తెగడంతో క్షణాల్లో ఫ్రీడా కూప్పకూలిపోయింది. ఎలిస్ తనను చంపడమేంటనే అయోమయస్థితిలోనే నేలకొరిగింది. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఫ్రీడా చనిపోయింది.. నా చెల్లి ఫ్రీడా చనిపోయింది’ అంటూ ఎడా కోర్టు బోనులో కుమిలి కుమిలి ఏడుస్తుంటే అక్కడున్న వారందరి కళ్లు చెమర్చాయి. అసలు ఎవరీ ఎలిస్? తనకు ఫ్రీడా ఎలా తెలుసు? అంత ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని.. ఎందుకు వెంబడించి మరీ చంపాల్సి వచ్చింది? వంటి ఎన్నో ప్రశ్నలు చాలామందిని నిలకడగా ఉండనివ్వలేదు. హత్య జరిగిన మరునాడే ఎలిస్, లిల్లీల అరెస్ట్‌తో దర్యాప్తు వేగవంతమైంది. అప్పటి దాకా ఈ కేసుపై దృష్టి పెట్టనివారిని కూడా ఆశ్చర్యపరచే ఒక విషయం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే.. ఎలిస్ అబ్బాయి కాదు. అమ్మాయి అని. నిజమే ఇది ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ. ఎలిస్, ఫ్రీడాలు కలసి చదువుకున్నారు. ఇద్దరూ సంపన్న కుటుంబాలకు చెందిన వారే. ప్రాణస్నేహితులు. ఆ స్నేహబంధం అంతకు మించిన అనుబంధంలా ఎప్పుడు మారిందో వాళ్లకు కూడా తెలియదు. వారి సన్నిహితుల్ని ఆరా తీస్తే.. 1890 నుంచే వారు ప్రేమలో ఉన్నారని తేల్చారు. ‘రెండేళ్ల క్రితమే వారి స్నేహం హద్దులు దాటి.. రొమాన్స్‌గా మారింది. పబ్లిక్‌గానే కౌగిలించుకుంటూ.. ముద్దులు పెట్టుకునేవారు. అయితే అప్పటికే చాలామంది ఆడపిల్లలు తమకు కాబోయే భర్తతో ఎలా ఉండాలో ఇతర ఆడపిల్లలతో రిహార్సల్స్ చేస్తుండటం సాధారణమైపోయేసరికి వాళ్ల వ్యవహారమూ అందులో భాగమే అనుకుని ఎవరం పెద్దగా పట్టించుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చారు స్కూల్ టీచర్స్, స్టూడెంట్స్. అయితే ఫ్రీడా, ఎలిస్ల తీరును ఫ్రీడా ఫ్యామిలీ ముందే పసిగట్టింది. కావాలనే ఎలిస్‌కి దూరంగా అర్కాన్సాస్‌లోని గోల్డ్డస్ట్కి మకాం మార్చింది. ఆ దూరం ఇరువురిలో విరహాన్ని పెంచిందే తప్ప.. ప్రేమని తుంచలేదు. 1891లో ఓ రాత్రి ఫ్రీడా సూట్‌కేస్ సర్దుకుంటూ ఎడా కంటపడింది. వెంటనే ఫ్రీడాని బంధించిన ఎడా.. ఆమె దగ్గరున్న ప్రేమ లేఖలను లాక్కుని చదవడం మొదలుపెట్టింది. ‘డియర్ ఫ్రీడా, ఈ లెటర్‌తో పాటు ఓ రింగ్ పంపిస్తున్నాను. దాన్ని నువ్వు పెట్టుకో.. దీని అర్థం మన పెళ్లి అయిపోయినట్లే. మనం సెయింట్ లూయీస్‌కి పారిపోదాం. అక్కడ నేను ఎల్విన్ జే వార్డ్ అనే అబ్బాయి పేరుతో అందరికీ పరిచయం అవుతాను. నిన్ను నా భార్యగా పరిచయం చేస్తాను. అప్పుడిక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు.. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం’ అంటూ ఎలిస్.. ఫ్రీడాకి రాసిన చివరి లేఖను చదివి.. షాక్ అయింది ఎడా. వెంటనే ఆ లేఖను పెద్దవాళ్లకు చూపించింది. నాటి నుంచి ఫ్రీడాపై ఇంట్లో ఆంక్షలు ఎక్కువయ్యాయి. ఆ ఇరువురి మధ్య ఉత్తరాలు కూడా బంద్ అయ్యాయి. ఇవన్నీ దర్యాప్తులో తేలిన నిజాలు. ఫ్రీడా హత్యతో లిల్లీకి ఎలాంటి సంబంధం లేదని భావించిన కోర్ట్.. పది వేల డాలర్ల ఫైన్ విధించి, ఆమెను విడుదల చేసింది. ఎలిస్‌కి మానసిక స్థితి బాగోలేదని, ఎలిస్ పర్సనాలిటీ అమ్మాయిలానే ఉన్నా.. మనస్తత్వం, లక్షణాలు మాత్రం అబ్బాయివే అన్న వాదన తెరపైకి తెచ్చాడు ఎలిస్ తరపు లాయర్. ఫ్రీడా దూరమయ్యాక తట్టుకోలేని ఎలిస్.. చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కూడా వాదనలో వినిపించారు.పది రోజుల వాదనలో చివరిరోజు.. జడ్జ్ తీర్పు కోసం, ఎలిస్ ఇచ్చే వివరణ కోసం కోర్టుకు వేలాదిమంది తరలి వచ్చారు. ఫ్రీడా కోసం ఆత్మహత్య చేసుకునేంతగా ప్రేమించిన ఎలిస్ ఎందుకు ఆమెనే చంపింది? ఇదే అందరి మనసుల్ని రగిల్చిన ప్రశ్న. ‘నాకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కడానికి వీల్లేదని అనుకున్నాను కానీ చంపాలనే కసి మాత్రం లేదు. ఎప్పుడైతే ఎడా నన్ను అడ్డుకుందో.. అప్పుడు ఫ్రీడాను చంపాలనే కసి కలిగింది. అందుకే వెంబడించి చంపేశాను’ అని కోర్టులో చెప్పింది ఎలిస్. అంతా విన్నాక ఎలిస్‌కి మానసిక పరిస్థితి సరిగా లేదని నమ్మింది కోర్టు. ఎలిస్‌ని టెన్నెసీలోని బొలీవర్ దగ్గరున్న మెంటల్లీ చాలెంజ్డ్ హోమ్‌కు తరలించాలని ఆదేశించింది. దాంతో 1892 నుంచి 1898... చనిపోయే వరకూ ఎలిస్ అక్కడే ఉంది. అయితే ఆమె క్షయ వ్యాధి సోకి చనిపోయిందని కొందరు.. వాటర్ టవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటారు. ఏది ఏమైనా ఫ్రీడా హత్యపై ఎలిస్ సరైన వివరణ ఇవ్వకపోవడంతో చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఎలిస్ కంటే ఫ్రీడా అందగత్తె. చదువుకునే రోజుల్లో కుర్రాళ్లంతా ఫ్రీడా వెంటే పడేవారు. అది చూసినప్పుడల్లా ఎలిస్ అసూయపడేది. ఫ్రీడా తననే ప్రేమిస్తుంది కాబట్టి ఆ ఈర్ష్యని బయటపెట్టేది కాదు. హత్య జరిగిన రోజున ఫ్రీడాను చంపే ఉద్దేశం లేని ఎలిస్.. ఎడా జోక్యంతో రెచ్చిపోయి పాత అసూయనూ బయటపెట్టి అప్పటికప్పుడు ఆమె మెడ కోసి చంపేసింది’ అనేది ఒక పుకారు. ‘హత్య జరిగిన రోజున... ఓ అజ్ఞాత వ్యక్తిని ఎలిస్ గమనించింది. అతడు కచ్చితంగా ఫ్రీడా కోసమే వచ్చి ఉంటాడనే అనుమానంతో ఫ్రీడాను హత్య చేసి ఉంటుంద’ని ఇంకో పుకారు. దాన్ని బలపరచే స్థానిక జానపద గీతం నేటికీ ప్రాచుర్యంలో ఉంది. కానీ వేటికీ ఆధారాల్లేవు. - సంహిత నిమ్మన -
లెస్బియన్స్ డ్యాన్స్.. హోటల్ సిబ్బంది దారుణం..!
చెన్నై : లెస్బియన్స్ అనే కారణంతో ఇద్దరు యువతుల పట్ల ఓ హోటల్ యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించింది. ఇతరులకు అసౌకర్యం కలిగిస్తున్నారని నెపం మోపి బయటకు గెంటేసింది.ఈ ఘటన జూలై 28న చెన్నైలో చోటుచేసుకుంది. తమకు జరిగిన అవమానాన్ని రసికా గోపాలకృష్ణన్, శివంగి సింగ్ ఫేస్బుక్లో వెల్లడించారు. రసికా మాట్లాడుతూ.. ‘తన ప్రెండ్ శివంగితో కలిసి శనివారం అర్ధరాత్రి చెన్నైలోని స్లేట్ హోటల్ కమ్ బార్‌కు వెళ్లాం. మేమిద్దరం కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఏదో తప్పు చేసినట్టుగా మావైపు ఓ నలుగురు యువకులు అదేపనిగా చూశారు. చాలా ఇబ్బందిగా అనిపించింది. మేం వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు హోటల్ బౌన్సర్లు వచ్చి.. లోపల ఏం చేస్తున్నారని, వెంటనే బయటికి రావాలంటూ తలుపులు బాదారు. మీ వల్ల బార్లో ఉన్న ఇతరులు అసౌకర్యంగా ఫీలవుతున్నారని అన్నారు. బార్ నుంచి తక్షణం బయటికి వెళ్లాలని ఒత్తిడి చేశారు. అవమానకర రీతిలో బయటికొచ్చాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బందిగా ఉందన్నారు.. తమను బయటికి ఎందుకు పంపుతున్నారో కారణాలడిగితే.. ‘ మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. అందుకే గెంటేస్తున్నాం. ఈ వెకిలి చర్యలకు సంబంధించిన వీడియో మా దగ్గర ఉంది’ అని సమాధానం చెప్పారని శివంగి వాపోయారు. వీడియో చూపించాలని అడిగితే.. ‘మీకు చూపించాల్సిన అనవసరం లేదు’ అంటూ తప్పించుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి హోటల్ సీఈవో యంగ్యా ప్రకాశ్ చంద్రన్ స్పందించారు. తమ హోటల్‌కు వచ్చే కస్టమర్ల ప్రవర్తనను హోటల్ సిబ్బంది, బౌన్సర్లు పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సదరు యువతుల ప్రవర్తన సరిగా లేనందునే బయటికి పంపివేశామని వెల్లడించారు. -
స్వలింగ సంపర్కం : ఇద్దరు మహిళలకు శిక్ష
కౌలలంపూర్ : స్వలింగ సంపర్కం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ముస్లిం మహిళలను మలేషియాలోని ఓ కోర్టు దోషులుగా తేల్చింది. ఒక్కొక్కరికి ఆరు కొరడా దెబ్బలు, 56 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. న్యాయమూర్తి ఆదేశాలతో కోర్టు ఆవరణలోనే వారిని కొరడాతో దండించారు. ఈ ఘటన తెరంగను రాష్ర్టంలో మంగళవారం చోటుచేసుకుంది. 32, 22 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు గత ఏప్రిల్‌లో స్వలింగ సంపర్కానికి ఒడిగట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముహమద్ ఖాస్మీజాన్ అబ్దుల్లా మీడియాకు వెల్లడించారు. షరియా చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కం నేరమని తెలిపారు. స్వలింగ సంపర్కానికి సంబంధించి తెరంగను రాష్ర్టంలో ఇదే తొలి తీర్పు అని తెలిపారు. కాగా, ఈ తీర్పుపై మలేషియాలోని ఎల్జీబీటీ కమ్యూనిటీ నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇలాంటివి గతంలో చోటుచేసుకున్నా ఎవర్నీ దోషులుగా తేల్చలేదని తిలగా సులాతిరే అనే హక్కుల కార్యకర్త కోర్టు తీర్పుపై మండిపడుతున్నారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం ఎల్జీబీటీ కమ్యూనిటీపై వివక్ష చూపుతున్నారడానికి నిదర్శనమని విమర్శించారు. -
మమ్మల్ని చిన్నచూపు చూడొద్దు
దోమలగూడ: సమాజం తమ పట్ల వివక్ష చూపకుండా అవగాహన కలిగించేందుకు క్వేర్ క్యాంపస్ హైదరాబాదు ఆధ్వర్యంలో లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్స్ (ఎల్జీబీటీ) ఆదివారం సాయంత్రం ఇందిరాపార్కు వద్ద నృత్యప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లెస్బియన్లు, గే, ట్రాన్స్‌జెండర్స్ పట్ల సమాజం చిన్నచూపు చూస్తుందని, ఇది సరికాదని అన్నారు. మేము కూడా సమాజంలో భాగమేనని, అందరిలాగే మాకూ సమాన హక్కులున్నాయని అన్నారు. సత్య, అభిషేక్, నవదీప్, మణికిరణ్, ఆదిత్య, రవికిరణ్, సుధారాణి తదితరులు పాల్గోన్నారు. -
గే, లెస్బియన్ల సంస్కరణకు కేంద్రాలు!
గోవాలో ఉన్న గే, లెస్బియన్ తదితరులను సంస్కరించి, వారిని సాధారణ వ్యక్తులుగా మార్చేందుకు కొన్ని సంస్కరణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని గోవా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రమేష్ తవాద్కర్ తెలిపారు. అయితే.. ఆయన చెప్పిన ఈ విషయం పెను దుమారాన్ని సృష్టించింది. ఎల్జీబీటీ యువతకు శిక్షణ ఇస్తామని, వారికి చికిత్సలు చేయించి, మందులిచ్చి, వాళ్లను సాధారణ వ్యక్తులుగా మార్చే ప్రయత్నం చేస్తామని రమేష్ అన్నారు. రాష్ట్ర యువజన విధానాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాజా యువజన విధానంలో.. గేలు, లెస్బియన్లు తదితరులను బాల నేరస్థులు, డ్రగ్స్ బానిసల తరహాలో ఒక 'టార్గెట్ గ్రూప్'గా చేర్చారు. ఇది తీవ్ర వివాదానికి కారణమైంది. -
హిజ్రాల పెళ్లి సందడి
సాక్షి, చెన్నై: విల్లుపురం జిల్లా ఉలందూరు పేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువుదీరిన కూత్తాండవర్ ఆలయంలో చైత్ర మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక నేపథ్యంతో ముడి పడి ఉన్న ఇక్కడి ఉత్సవాలు చివరి ఘట్టానికి చేరాయి. శ్రీ కృష్ణుడు మోహినీ అవతారం(హిజ్రా)తో ఐరావంతుడిని పెళ్లి చేసుకున్నట్టు పురాణాలు చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుక మంగళవారం అత్యంత కోలాహలంగా కూవాగంలో జరిగింది. హిజ్రాల పెళ్లి సందడితో కూవాగం జాతరను తలపించింది. తరలివచ్చిన హిజ్రాలు: పెళ్లి వేడుక నిమిత్తం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, హిజ్రాల పెళ్లి సందడి మహారాష్ట్ర, ఢిల్లీతోపాటుగా పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హిజ్రాలు తరలి వచ్చారు. ఉదయం నుంచి కూవాగం పరిసరాలు కళకళ లాడాయి. ఆ పరిసర గ్రామాల ప్రజలతోపాటుగా హిజ్రాలు తరలి రావడంతో కూవాగం పెళ్లి వేడుక వాతావరణం మునిగింది. సాయంత్రం ఆలయం ఆవరణలో హిజ్రాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ వధువులకు తీసిపోని విధంగా పట్టు వస్త్రాలు, ఆభరణాల్ని ధరించి తరలిరాగా, మరి కొందరు తమ స్థోమత మేరకు పెళ్లి కూతళ్ల వలే ముస్తాబయ్యారు. ఆలయం వద్ద ఈ హిజ్రాలకు పూజారులు తాళి బొట్లు కట్టే సన్నివేశాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. తాళి బొట్టు కట్టించుకున్న హిజ్రాల ఆనందంలో మునిగిపోయూరు. రాత్రంతా వీరి కోసం కేటాయించిన ప్రత్యేక స్థలంలో సందడి చేశారు. ఆటా, పాటలతో హోరెత్తించారు. ఇక, ఈ ఉత్సవాల్లో చివరి ఘట్టం బుధవారం జరగనుంది. పురాణ గాథ మేరకు పెళ్లి వేడుక అనంతరం ఐరావంతుడు బలి దానం అవుతాడు. దీంతో తమ భర్తను కోల్పోయిన వేదనతో తాళి క ట్టించుకున్న మరుసటి రోజున హిజ్రాలు వితంతువుల అవతారం ఎత్తనున్నారు. ఆలయ పూజారే వారి తాళి బొట్లను తెంచి వేస్తాడు. తమ భర్త చనిపోయాడన్న వేదనతో ఆ సమయంలో హిజ్రాలు విషాదంలో మునుగుతారు. తెల్ల చీర కట్టుకుని ఒకరినొకరు ఓదార్చుకుంటారు. అనంతరం ఎవరికి వారు తమ తమ స్వస్థలాలకు వెళ్లి పోతారు. దీనికి ముందుగా ఉదయం కూత్తాండవర్ రథోత్సవం కనుల పండువగా నిర్వహించనున్నారు. మిస్ కూవాగం సహానా: మిస్ కూవాగం -2014 టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన సహానా దక్కించుకుంది. విల్లుపురం హిజ్రాల సంక్షేమ సంఘం నేతృత్వంలో ప్రతి ఏటా ఉత్సవాల్లో మిస్ కూవాగం పోటీలు నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి జరిగిన ఈ పోటీల్లో 30 మంది హిజ్రాలు ర్యాంప్‌పై వయ్యారాలు ఒలక బోశారు. తమ మేధస్సుకు పదును పెట్టే విధంగా సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. న్యాయ నిర్ణేతలుగా సినీ నటుడు శరత్‌కుమార్, పృథ్విరాజ్, నటి రాధిక వ్యవహరించారు. విజేతగా విజయవాడకు చెందిన సహానా టైటిల్‌ను దక్కించుకుంది. సహానాకు శరత్‌కుమార్ కిరీటం బహుకరించారు. రెండో స్థానాన్ని ఈరోడ్‌కు చెందిన ఐశ్వర్య, మూడో స్థానాన్ని చెన్నైకు చెందిన నమిత దక్కించుకున్నారు. -
బ్రిటన్‌లో నాలుగింతలు పెరిగిన లెస్బియన్లు!
బ్రిటన్‌లో ఆడ స్వలింగ సంప్కరులు(లెస్బియన్లు) సంఖ్య దశాబ్దకాలంలో నాలుగింతలు పెరిగినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పురుష స్వలింగ సంప్కరులు(గే) సంఖ్యలో మాత్రం పెద్దగా మార్పు లేదని లైంగిక ప్రవర్తన, జీవనశైలిపై జరిపిన జాతీయ సర్వేలో వెల్లడయింది. శృంగారం విషయంలో మహిళలు సాహసోపేతంగా వ్యవహరిస్తున్నారని.. ప్రయోగాలకు వెనుకాడడం లేదని.. లైంగిక విజ్ఞానం పట్ల వారికి అవగాహన అధికంగానే ఉందని తేలింది. 1990లో లెస్బియన్లు 4 శాతం ఉండగా 2010 నాటికి ఈ సంఖ్య 16 శాతానికి పెరిగింది. వీరిలో 8 శాతం మంది తమ భాగస్వాములతో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ఇక పురుష స్వలింగ సంప్కరులు సంఖ్య దశాబ్దకాలంలో ఒక శాతం మాత్రమే పెరిగింది.1990లో ఇది 6 శాతంగా ఉంది. బ్రిటన్‌లో లెస్బియన్లు సంఖ్య పెరుగుతుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో స్రీలు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారని కొందరు అంటుంటే, వైవిధ్యం కోరుకుంటున్నారని మరికొందరు అంటున్నారు.