Level crossing gate
-
మేడ్చల్– ఉందానగర్ మార్గంలో వాహనదారులకు బ్రేక్‌లు.. అదొక్కటే పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: అది సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మార్గం. మేడ్చల్‌లో రైలు ఎక్కితే నేరుగా ఉందానగర్ వరకు వెళ్లొచ్చు. అక్కడి నుంచి శంషాబాద్ విమానశ్రయానికి మరో ఆరు కిలోమీటర్లు మాత్రమే. ఎంఎంటీఎస్ రెండో దశలో ఈ లైన్‌ను దక్షిణమధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పూర్తి చేసింది. జీఎమ్మార్ సంస్థ అనుమతిస్తే ఉందానగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు కూడా ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలనేది అప్పటి ప్రతిపాదన. ఈ క్రమంలోనే రూ.కోట్లు వెచ్చించి మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ తదితర పనులను పూర్తి చేశారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం వరకు రైల్వేభద్రతా తనిఖీలు కూడా పూర్తయ్యాయి. కానీ.. ఆ మార్గంలో రైళ్లను ప్రారంభించాలంటే అధికారులు హడలెత్తుతున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లను నడిపేందుకు లైన్ క్లియర్‌గా ఉన్నా వెనుకడుగు వేస్తున్నారు. కేవలం 10 కిలోమీటర్ల మార్గంలో కనీసం 10 చోట్ల లెవల్ క్రాసింగ్‌లు ఉండడమే ఇందుకు కారణం. వీటితో నగరవాసులకు తీవ్ర ఆటంకం ఏర్పడనుంది. వాహనదారుల రాకపోకలు స్తంభించిపోనున్నాయి. లెవల్ క్రాసింగ్లను తొలగించేందుకు ఎలాంటి కార్యాచరణ లేకుండానే పట్టాలు పరిచారు. దీంతో ఇప్పుడు ఆ లైన్ ఉన్నా లేనట్లుగానే మారింది. అక్కరకొచ్చేది ఎలా..? ఎంఎంటీఎస్ రెండో దశలో చేపట్టిన రైల్వే లైన్ల విస్తరణతో ఇప్పుడు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమైంది. సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా పూర్తి చేసిన ఫలక్‌నుమా– ఉందానగర్ మార్గంలోనే రైళ్లు నడిపేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకే కనీసం 10 చోట్ల లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. కనీసం ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున లెవల్ క్రాసింగ్ ఉంది. అంటే ట్రైన్ బయలుదేరిన తర్వాత రెండు, మూడు నిమిషాలకోసారి గేట్లు వేసి వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీ నెలకోనుంది. దయానంద్‌నగర్, సఫిల్‌గూడ, తుకారంగేట్, అమ్ముగూడ, మల్కాజిగిరి, అల్వాల్, బొల్లారం తదితర ప్రాంతాల్లో లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. ఈ రూట్ పూర్తిగా కాలనీలు, బస్తీల్లోంచే వెళ్తుంది. దీంతో లెవల్ క్రాసింగ్‌లు తీసివేసేందుకు కొన్ని చోట్ల జనావాసాలను, దుకాణాలను, ఇతర నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. పైగా రైల్ ఓవర్ బ్రిడ్జీల (ఆర్ఓబీ)ను నిర్మించాలంటే చాలా చోట్ల భూమి లభ్యత సమస్యగా మారింది. ఈ క్రమంలో రైల్ అండర్ బ్రిడ్జీలు (ఆర్యూబీ) ఒక్కటే పరిష్కారం. ఇందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం, మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడడంతో నిధుల లేమి ప్రధాన అడ్డంకిగా మారింది. లెవల్ క్రాసింగ్‌లు తొలగిస్తే తప్ప రైళ్లు నడపడం సాధ్యం కాదని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
రైల్వే గేటు.. ధీమాగా దాటు..
సాక్షి,న్యూఢిల్లీ: కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ఇస్రో సహకారంతో రైల్వేలు భద్రతా వ్యవస్థను పటిష్టం చేయనున్నాయి. ఇలాంటి క్రాసింగ్‌ల వద్ద రోడ్డును ఉపయోగించే వారికోసం శాటిలైట్ ఆధారిత వ్యవస్థ అలర్ట్‌లను పంపుతుంది. కాపలాలేని లెవెల్ క్రాసింగ్‌ల వద్దకు రైలు చేరుకునే సమయంలో ఇస్రో సహకారంతో ఏర్పాటు చేసే వ్యవస్థ రోడ్డు ప్రయాణీకులను హెచ్చరిస్తుంది. ఇస్రో అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ చిప్‌లను 10,000 ట్రెయిన్లలో అమర్చేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. ఐసీ చిప్ నుంచి వచ్చే సిగ్నల్ ద్వారా లెవెల్‌క్రాసింగ్‌లకు ఆయా రైళ్లు 500 మీటర్ల దూరంలో ఉండగానే రోడ్డును ఉపయోగించే వారిని సైరన్ ద్వారా అలర్ట్ చేస్తారు. ఢిల్లీ-గౌమతి రాజధాని రూట్లో సొనేపూర్ డివిజన్‌కు చెందిన రెండు లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద పైలట్ ప్రాజెక్టుగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ-ముంబయి రూట్లోనూ త్వరలో కొన్ని గేట్స్ వద్ద ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా దశల వారీగా ఇస్రో శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఈ హెచ్చరిక వ్యవస్థను నెలకొల్పుతామని సీనియర్ రైల్వే ఉన్నతాధికారి వెల్లడించారు. -
ఇంకెప్పుడు కాపలా?
సాక్షి, హైదరాబాద్ : 2014 జూలై 24.. పూర్వపు మెదక్ జిల్లా మాసాయిపేట శివార్లలోని కాపలాలేని లెవల్ క్రాసింగ్ వద్ద పాఠశాల బస్సు పట్టాలు దాటుతోంది.. సికింద్రాబాద్–నాందెడ్ ప్యాసింజర్ రైలు వేగంగా దూసుకొచ్చి బస్సును ఢీకొట్టింది.. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 19 మంది ప్రాణాలు బలైపోయాయి.. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘కాపలా లేని లెవల్ క్రాసింగ్స్ ఇప్పటికీ ఉండటం దురదృష్టం. వీలైనంత త్వరగా కాపలాలేని లెవల్ క్రాసింగ్లను తొలగిస్తాం..’.. అని మాసాయిపేట ప్రమాదంపై అప్పటి రైల్వే మంత్రి ప్రకటించారు. చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయాయి. కానీ రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కాపలా లేని లెవల్ క్రాసింగ్‌లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఇంకా 246 చోట్ల కాపలా లేని లెవల్ క్రాసింగులు ఉన్నాయి. అసలు లెవల్ క్రాసింగ్స్ సమస్యను పరిష్కరిస్తామని ఘనంగా ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. దీనికి పెట్టుకున్న గడువును ఇప్పటికే రెండు సార్లు పొడిగించుకుంది. తాజాగా మరో ఏడాది పెంచుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న రైలు ప్రమాదాల్లో కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద జరుగుతున్నవి - 40% రైలు ప్రమాద మరణాల్లో కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద జరుగుతున్నవి - 68% కాపలాలేని గేట్ల తొలగింపు ఇలా.. 2014 వరకు - 581 2017 సెప్టెంబర్ నాటికి - 355 ఇంకా తొలగించాల్సినవి - 246 సమస్యకు కారణాలెన్నో.. ♦ రైల్వే శాఖకు మానవ వనరుల (సిబ్బంది) కేటాయింపు అధికారం లేదు. రైల్వే గేట్ల వద్ద సిబ్బంది అవసరమంటూ ఆర్థిక శాఖను కోరితే.. అంతే సంఖ్యలో సిబ్బందిని ఎక్కడైనా తగ్గిస్తే కేటాయిస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అంటే ఒకచోట సిబ్బందిని నియమించాలంటే మరో చోట తొలగించాలన్న మాట. దక్షిణమధ్య రైల్వేకు మూడేళ్ల కింద గేట్ల వద్ద ఉండే సిబ్బందికి సంబంధించి 62 పోస్టులు మంజూరయ్యాయి. కానీ అంతమేర వేరే విభాగంలో సిబ్బందిని కుదించాలని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేయడంతో.. ఇప్పటికీ ఆ పోస్టులు మంజూరు కాలేదు. ‘మాసాయిపేట’ప్రమాదం జరిగిన గేటు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ♦ రెండు లైన్లు ఉండటం, గంటకు 80 కిలోమీటర్లు, ఆపైన వేగంతో వెళ్లే రైళ్లు, గణనీయ సంఖ్యలో రైళ్లు తిరిగే మార్గాలను ‘ఏ క్లాస్’రూట్లుగా రైల్వే శాఖ గుర్తిస్తుంది. ఆ మార్గాల్లో మాత్రమే గేట్ల ఏర్పాటుపై శ్రద్ధ చూపుతోంది. కానీ దక్షిణ మధ్య రైల్వేలో ఇలాంటి మార్గాలు కొన్నే. దాంతో ఈ అంశాన్ని గాలికొదిలేసింది. ♦ ప్రస్తుతం గేట్‌మిత్ర పేరుతో సాధారణ వ్యక్తులను కొన్ని ప్రమాదకర రైల్వే క్రాసింగ్‌ల వద్ద నియమిస్తున్నారు. వారు రైలు వచ్చే సమయంలో జనం గేట్లు దాటకుండా చూస్తుంటారు. ఎందుకింత నిర్లక్ష్యం..? అరకొరగా ఇచ్చే నిధులతో రైల్వే ప్రాజెక్టుల విస్తరణే సరిగా ముందుకు సాగని తరుణంలో కాపలా లేని గేట్ల సమస్య పరిష్కారం సాధ్యం కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రైల్వే శాఖ కొత్త లైన్ల నిర్మాణం, అప్‌గ్రెడేషన్, స్టేషన్లలో వసతుల కల్పనకే ప్రాధాన్యమిస్తోందని.. ఫలితంగా కాపలా లేని క్రాసింగ్‌ల తొలగింపు ముందుకు పడటం లేదని చెబుతున్నారు. ప్రాణాలు పోతున్నా నిర్లక్ష్యం మాసాయిపేట గ్రామం రైల్వేట్రాక్‌కు రెండు వైపులా ఉంటుంది. దాంతో తరచూ ట్రాక్ దాటేవారి సంఖ్య ఎక్కువ. ఇలాంటి చోట వెంటనే అండర్ పాస్ నిర్మించాలి. కానీ ఏకంగా 19 మరణించిన ఓ భారీ ప్రమాదం జరిగాక కూడా అక్కడ అండర్‌పాస్ ఏర్పాటుపై రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించాయి. తర్వాత అక్కడే ఓ వృద్ధురాలు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయింది. అయినా తాపీగా ఇటీవల దాదాపు రూ. 1.70 కోట్ల వ్యయ అంచనాతో అండర్‌పాస్ నిర్మించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే.. రైల్వేశాఖ పనులు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంకా మీ తీరు మారదా..? మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా మీ (రైల్వే అధికారుల) తీరు మారదా..? కాపలాలేని లెవల్ క్రాసింగ్స్ లేకుండా చేస్తామంటూ పెట్టుకున్న గడువును ఎన్నిసార్లు మారుస్తారు. ఈ నిర్లక్ష్యం కుదరదు. చివరిగా ఏడాది సమయం తీసుకోండి. వచ్చే ఏడాది సెప్టెంబర్‌కల్లా కాపలా లేని లెవల్ క్రాసింగ్ ఒక్కటి కూడా ఉండొద్దు.. – అధికారులకు రైల్వే నూతన మంత్రి పీయూష్ గోయల్ హెచ్చరిక తొలగించేదెలా..? కాపలాదారును ఏర్పాటు చేయడం, అసలు గేటే లేకుండా అండర్‌పాస్ నిర్మించడం లేదా ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ)/ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మించడం వంటి చర్యల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంది. ♦ ఒక చోట రైల్వే గేటు ఏర్పాటు చేయాలంటే.. గేటు, కాపలాదారులు కూర్చునే గది, ఇతర వస్తువులకు కలిపి సుమారు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చవుతుంది. మూడు షిప్టులలో (8 గంటల చొప్పున) ముగ్గురు కాపలా సిబ్బందికి కలిపి.. నెలకు రూ.60 వేల వరకు వేతనాల భారం ఉంటుంది. దాంతో దీన్ని రైల్వే శాఖ భారంగా భావిస్తోంది. ♦ ఇక ఆర్యూబీ/ఆర్ఓబీ/అండర్‌పాస్‌లు నిర్మించాలంటే ఒక్కోటి రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు ఖర్చవుతుంది. దీంతో మరింతగా ఆర్థిక భారం పడుతుండటంతో రైల్వే శాఖ వెనుకడుగు వేస్తోంది. ♦ వాస్తవానికి క్రాసింగ్‌ల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తేనే.. అక్కడ గేటు ఏర్పాటు చేయాలన్నది రైల్వే శాఖ విధానం. ఇందుకోసం మూడేళ్లకోసారి వాహనాల ట్రాఫిక్ తెలుసుకునేందుకు సెన్సస్ నిర్వహిస్తుంది. అయితే ఆయా చోట్ల వాహనాల సంఖ్య నిర్ధారిత సంఖ్యలో లేదంటూ గేట్లను ఏర్పాటు చేయకుండా.. వదిలేస్తోంది. ఒకవేళ ఎక్కడైనా గేట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే.. అందుకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వాలు కూడా భారం భరించలేక చూస్తూ ఊరుకుంటున్నాయి. -
ఈ గొలుసుకు ఓ కథ ఉంది..
62 మందిని బలిగొన్న చైన్ ఓదెల : మూడు దశాబ్దాల క్రితం కొలనూర్ రైల్వేస్టేషన్ లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 62 మంది మృతిచెందారు. ఇక్కడి రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా గొలుసులు ఉండడంతో ప్రమాదం జరిగింది. 1982 మార్చి 20వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఢీల్లీకి అప్‌లైనులో వెళ్తున్న జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రైవేట్ బస్సును ఢీకొట్టడంతో 62మంది అక్కడిక్కడే మృతిచెందారు. ప్రయాణికుల్లో ఒక చిన్నారి మృత్యుంజయురాలిగా బయటపడింది. మృతులంతా కొలనూర్, పెగడపల్లి, ఊశన్నపల్లి, రాయపేటకు చెందినవారే. అప్పట్లో ఈసంఘటన దేశంలోనే అతిపెద్ద ప్రమాదంగా నిలిచింది. దీంతో రైల్వే శాఖ అధికారులు లెవల్ క్రాసింగ్ గేట్లను నిర్మించారు. గేట్ల సమీపంలో క్యాబిన్లు నిర్మించి ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రధాన లైన్‌లోని లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద కాపలా సిబ్బందిని నియమించిన అధికారులు సింగిల్ లైన్లో మాత్రం విస్మరించారు. 2008లో జమ్మికుంటలో.. జమ్మికుంట : 2008 డిసెంబర్లో జమ్మికుంట మండలం మడిపల్లి బైపాస్ రహదారిలోని రైల్వే గేటు వద్ద రైలు ఓ స్కూల్ బస్సును ఢీకొంది. ఈ సంఘటనలో ఓ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వాహనాలు గేట్దాటే ప్రయత్నంలో ట్రాక్‌పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇదే సమయంలో వచ్చిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు స్కూల్‌బస్సును వెనుక భాగంలో ఢీకొంది. అప్పటికే బస్సులోంచి విద్యార్థులు దిగిపోగా, ఓ విద్యార్థి కిటికీలో నుంచి ప్రయత్నంలో అద్దాల్లో ఇరుక్కుపోయాడు. రైలు బస్సును ఢీకొనడంతో తీవ్రగాయాలైన విద్యార్థి చనిపోయాడు.