ఇంకెప్పుడు కాపలా? | Unfinished level crossing | Sakshi
Sakshi News home page

ఇంకెప్పుడు కాపలా?

Published Tue, Oct 3 2017 1:23 AM | Last Updated on Tue, Oct 3 2017 1:23 AM

Unfinished level crossing

సాక్షి, హైదరాబాద్‌ :  2014 జూలై 24.. పూర్వపు మెదక్‌ జిల్లా మాసాయిపేట శివార్లలోని కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌ వద్ద పాఠశాల బస్సు పట్టాలు దాటుతోంది.. సికింద్రాబాద్‌–నాందెడ్‌ ప్యాసింజర్‌ రైలు వేగంగా దూసుకొచ్చి బస్సును ఢీకొట్టింది.. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 19 మంది ప్రాణాలు బలైపోయాయి.. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘కాపలా లేని లెవల్‌ క్రాసింగ్స్‌ ఇప్పటికీ ఉండటం దురదృష్టం.

వీలైనంత త్వరగా కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌లను తొలగిస్తాం..’.. అని మాసాయిపేట ప్రమాదంపై అప్పటి రైల్వే మంత్రి ప్రకటించారు. చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయాయి. కానీ రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కాపలా లేని లెవల్‌ క్రాసింగ్‌లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఇంకా 246 చోట్ల కాపలా లేని లెవల్‌ క్రాసింగులు ఉన్నాయి. అసలు లెవల్‌ క్రాసింగ్స్‌ సమస్యను పరిష్కరిస్తామని ఘనంగా ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. దీనికి పెట్టుకున్న గడువును ఇప్పటికే రెండు సార్లు పొడిగించుకుంది. తాజాగా మరో ఏడాది పెంచుకుంది.

దేశవ్యాప్తంగా జరుగుతున్న రైలు ప్రమాదాల్లో కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద జరుగుతున్నవి -   40%
రైలు ప్రమాద మరణాల్లో  కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద జరుగుతున్నవి  - 68%
కాపలాలేని గేట్ల తొలగింపు ఇలా.. 2014 వరకు  - 581
2017 సెప్టెంబర్‌ నాటికి  - 355
ఇంకా తొలగించాల్సినవి - 246


సమస్యకు కారణాలెన్నో..
♦  రైల్వే శాఖకు మానవ వనరుల (సిబ్బంది) కేటాయింపు అధికారం లేదు. రైల్వే గేట్ల వద్ద సిబ్బంది అవసరమంటూ ఆర్థిక శాఖను కోరితే.. అంతే సంఖ్యలో సిబ్బందిని ఎక్కడైనా తగ్గిస్తే కేటాయిస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అంటే ఒకచోట సిబ్బందిని నియమించాలంటే మరో చోట తొలగించాలన్న మాట. దక్షిణమధ్య రైల్వేకు మూడేళ్ల కింద గేట్ల వద్ద ఉండే సిబ్బందికి సంబంధించి 62 పోస్టులు మంజూరయ్యాయి. కానీ అంతమేర వేరే విభాగంలో సిబ్బందిని కుదించాలని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేయడంతో.. ఇప్పటికీ ఆ పోస్టులు మంజూరు కాలేదు. ‘మాసాయిపేట’ప్రమాదం జరిగిన గేటు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం.
♦  రెండు లైన్లు ఉండటం, గంటకు 80 కిలోమీటర్లు, ఆపైన వేగంతో వెళ్లే రైళ్లు, గణనీయ సంఖ్యలో రైళ్లు తిరిగే మార్గాలను ‘ఏ క్లాస్‌’రూట్లుగా రైల్వే శాఖ గుర్తిస్తుంది. ఆ మార్గాల్లో మాత్రమే గేట్ల ఏర్పాటుపై శ్రద్ధ చూపుతోంది. కానీ దక్షిణ మధ్య రైల్వేలో ఇలాంటి మార్గాలు కొన్నే. దాంతో ఈ అంశాన్ని గాలికొదిలేసింది.
♦  ప్రస్తుతం గేట్‌మిత్ర పేరుతో సాధారణ వ్యక్తులను కొన్ని ప్రమాదకర రైల్వే క్రాసింగ్‌ల వద్ద నియమిస్తున్నారు. వారు రైలు వచ్చే సమయంలో జనం గేట్లు దాటకుండా చూస్తుంటారు.


ఎందుకింత నిర్లక్ష్యం..?
అరకొరగా ఇచ్చే నిధులతో రైల్వే ప్రాజెక్టుల విస్తరణే సరిగా ముందుకు సాగని తరుణంలో కాపలా లేని గేట్ల సమస్య పరిష్కారం సాధ్యం కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రైల్వే శాఖ కొత్త లైన్ల నిర్మాణం, అప్‌గ్రెడేషన్, స్టేషన్లలో వసతుల కల్పనకే ప్రాధాన్యమిస్తోందని.. ఫలితంగా కాపలా లేని క్రాసింగ్‌ల తొలగింపు ముందుకు పడటం లేదని చెబుతున్నారు.

ప్రాణాలు పోతున్నా నిర్లక్ష్యం
మాసాయిపేట గ్రామం రైల్వేట్రాక్‌కు రెండు వైపులా ఉంటుంది. దాంతో తరచూ ట్రాక్‌ దాటేవారి సంఖ్య ఎక్కువ. ఇలాంటి చోట వెంటనే అండర్‌ పాస్‌ నిర్మించాలి. కానీ ఏకంగా 19 మరణించిన ఓ భారీ ప్రమాదం జరిగాక కూడా అక్కడ అండర్‌పాస్‌ ఏర్పాటుపై రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించాయి. తర్వాత అక్కడే ఓ వృద్ధురాలు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయింది. అయినా తాపీగా ఇటీవల దాదాపు రూ. 1.70 కోట్ల వ్యయ అంచనాతో అండర్‌పాస్‌ నిర్మించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే.. రైల్వేశాఖ పనులు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇంకా మీ తీరు మారదా..?
మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా మీ (రైల్వే అధికారుల) తీరు మారదా..? కాపలాలేని లెవల్‌ క్రాసింగ్స్‌ లేకుండా చేస్తామంటూ పెట్టుకున్న గడువును ఎన్నిసార్లు మారుస్తారు. ఈ నిర్లక్ష్యం కుదరదు. చివరిగా ఏడాది సమయం తీసుకోండి. వచ్చే ఏడాది సెప్టెంబర్‌కల్లా కాపలా లేని లెవల్‌ క్రాసింగ్‌ ఒక్కటి కూడా ఉండొద్దు..
– అధికారులకు రైల్వే నూతన మంత్రి పీయూష్‌ గోయల్‌ హెచ్చరిక


తొలగించేదెలా..?
కాపలాదారును ఏర్పాటు చేయడం, అసలు గేటే లేకుండా అండర్‌పాస్‌ నిర్మించడం లేదా ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ)/ అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మించడం వంటి చర్యల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంది.
♦ ఒక చోట రైల్వే గేటు ఏర్పాటు చేయాలంటే.. గేటు, కాపలాదారులు కూర్చునే గది, ఇతర వస్తువులకు కలిపి సుమారు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చవుతుంది. మూడు షిప్టులలో (8 గంటల చొప్పున) ముగ్గురు కాపలా సిబ్బందికి కలిపి.. నెలకు రూ.60 వేల వరకు వేతనాల భారం ఉంటుంది. దాంతో దీన్ని రైల్వే శాఖ భారంగా భావిస్తోంది.
♦  ఇక ఆర్‌యూబీ/ఆర్‌ఓబీ/అండర్‌పాస్‌లు నిర్మించాలంటే ఒక్కోటి రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు ఖర్చవుతుంది. దీంతో మరింతగా ఆర్థిక భారం పడుతుండటంతో రైల్వే శాఖ వెనుకడుగు వేస్తోంది.
♦ వాస్తవానికి క్రాసింగ్‌ల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తేనే.. అక్కడ గేటు ఏర్పాటు చేయాలన్నది రైల్వే శాఖ విధానం. ఇందుకోసం మూడేళ్లకోసారి వాహనాల ట్రాఫిక్‌ తెలుసుకునేందుకు సెన్సస్‌ నిర్వహిస్తుంది. అయితే ఆయా చోట్ల వాహనాల సంఖ్య నిర్ధారిత సంఖ్యలో లేదంటూ గేట్లను ఏర్పాటు చేయకుండా.. వదిలేస్తోంది. ఒకవేళ ఎక్కడైనా గేట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే.. అందుకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వాలు కూడా భారం భరించలేక చూస్తూ ఊరుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement