Lexus car company
-
2035 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే.. నవీన్ సోనీ
సాక్షి, అమరావతి:స్థానిక సంప్రదాయాలు, కళలతో మమేకం అవడం ద్వారా భారతీయ మార్కెట్లో వేగంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జపాన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ప్రకటించింది. ఇందుకోసం కారు కొనుగోలుదారులను అతిథులుగా గౌరవిస్తూ స్థానిక కళలకు ప్రాచుర్యం కల్పించే విధంగా విశాలమైన ప్రాంగణాలను మెరాకీ పేరుతో ఏర్పాటు చేస్తోంది. దేశంలో అయిదో లెక్సస్ మెరాకీని విజయవాడ సమీపంలో మంగళగిరి వద్ద ఏర్పాటు చేసింది. దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, ఇప్పటి వరకు ఈ రంగంలో ఆధిపత్యం ఉన్న జర్మనీ బ్రాండ్లకు జపాన్ బ్రాండ్ గట్టి పోటీనివ్వనుందని లెక్సస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ సోనీ తెలిపారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాటామంతీ.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశీయంగా లగ్జరీ కార్ల అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఏటా జరుగుతున్న కార్ల అమ్మకాల్లో కేవలం ఒక శాతం మాత్రమే లగ్జరీ కార్లు ఉంటున్నాయి. ఏటా సుమారుగా 40 లక్షలకు పైగా కార్లు అమ్ముడవుంతుంటే అన్ని లగ్జరీ బ్రాండ్లు కలిసి ఏటా 40,000 కార్లను విక్రయిస్తున్నాయి. అదే చైనాలో మొత్తం కార్ల అమ్మకాల్లో 15 నుంచి 16 శాతం, యూరప్‌లో 17 శాతం, అమెరికాలో 14 నుంచి 15 శాతం, జపాన్‌లో 3 నుంచి 5 శాతం అమ్మకాలు జరుగుతున్నాయి. దీని ప్రకారం చూస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని 5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జరిగితే తలసరి ఆదాయం ప్రస్తుత స్థాయి నుంచి 6 రెట్లు పెరుగుతుంది. ఇదే దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్‌ను శాసించే ప్రధానాంశం. కోవిడ్ తర్వాత పడిపోయిన లగ్జరీ కార్ల అమ్మకాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? లాక్‌డౌన్‌కు ముందు ఏటా 40 నుంచి 42 వేల లగ్జరీ కార్లు అమ్ముడవుతుంటే అది కోవిడ్ సమయంలో 18,000 యూనిట్లకు పడిపోయింది. ఆ తర్వాత సాధారణ కార్ల అమ్మకాలు పెరిగినంత వేగంగా లగ్జరీ కార్ల అమ్మకాలు పెరగలేదు. 2021లో 26,000కు, 2022లో 36,000కు చేరిన లగ్జరీ కార్ల అమ్మకాలు ఈఏడాది 43,000 మార్కును దాటుతాయని అంచనా వేస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి ఈ రంగం కూడా వేగంగా వృద్ధి చెందే అవకాశాలున్నాయి. దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్లోకి ఆలస్యంగా ప్రవేశించిన లెక్సస్ మార్కెట్ అమ్మకాలను పెంచుకోవడానికి ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళుతోంది? రెండేళ్ల క్రితం కేవలం 4 నగరాల్లో ఉన్న లెక్సస్‌కు ఇప్పుడు 19 నగరాల్లో 26 షోరూమ్‌లు ఉన్నాయి. అమ్మకాల సంఖ్యను చెప్పలేను కానీ, దేశీయ మార్కెట్లో లెక్సస్ వేగంగా విస్తరిస్తోందని మాత్రం చెప్పగలను. కేవలం కొనుగోలుదారులుగా కాకుండా వారిని అతిథులుగా గౌరవిస్తూ దానికి అనుగుణంగా కార్ల డిజైన్లను రూపొందించి విక్రయించనున్నాం. ఇందుకోసం వేగంగా విస్తరించడం కంటే వినియోగదారు, షోరూమ్ భాగస్వాములు ప్రయోజనం పొందే విధంగా అడుగులు వేస్తున్నాం. గతంలో హైదరాబాద్‌కు పరిమితమైన లెక్సస్ ఇప్పుడు విజయవాడలో అడుగుపెడుతోంది. రానున్న కాలంలో విశాఖ, నెల్లూరు వంటి నగరాలకు విస్తరణ అవకాశాలను పరిశీలిస్తాం. వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల రంగంలో లెక్సస్ భవిష్యత్తు ప్రణాళికలేంటి? ప్రస్తుతం హైబ్రీడ్ మోడల్స్‌లో ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్నాం. ఇప్పటికే సింగిల్ చార్జీతో 1000 కి.మీ ప్రయాణించే విధంగా కాన్సెప్ట్ కారును విడుదల చేశాం. వాణిజ్యపరంగా ఈ కారును 2026 నాటికి విడుదల చేయనున్నాం. 2035 నాటికి లెక్సన్‌ను పూర్తి ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. -
భారత్‌లో లెక్సస్ ఇండియా లగ్జరీ కార్ డెలవరీ ప్రారంభం
జపాన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ తాజాగా భారత్‌లో కొత్త ఐదవ తరం ఐదు సీట్ల ఆర్ఎక్స్ 350 హెచ్ (RX 350H) లగ్జరీ ఎస్యూవీ డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త మోడల్‌ను జపాన్ సంస్థ లెక్సస్ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్పో - 2023 ఈవెంట్లో ప్రదర్శనకు పెట్టింది. తాజాగా ఈ లగ్జరీ కార్లను కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు లెక్సస్ ఇండియా తెలిపింది. ఇక, చూపరులను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడంలో లెక్సస్ ప్రసిద్ధి చెందింది. ఆ అంచనాలతో ఎక్స్ 350 కారును సైతం డిజైన్ చేసింది. ముఖ్యంగా స్కల్ప్టెడ్ లైన్, ఎల్ఈడీ ఇల్యూమినేషన్, బోల్డ్, ఐకానిక్ యాక్సెంట్లతో మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇందులో అత్యాధునికమైన ఎలక్ట్రిఫైడ్ టెక్నాలజీని దాని అసాధారణమైన ఫీచర్లతో భారత ఆటోమొబైల్ రంగంలో ఉన్న విదేశీ ఆటోమొబైల్ కంపెనీల జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. లెక్సస్ ఆర్ఎక్స్ డ్రైవర్ కాక్‌పిట్ డిజైన్‌తో హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, మల్టీమీడియా డిస్ప్లే సౌలభ్యాన్ని కలిగి ఉంది.ఈ కార్ ధర రూ.95.80లక్షలు. లెక్సస్ ఇండియా మొత్తం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్ఎక్స్ డిమాండ్‌ని సాధించింది. -
టయోటా దూకుడు.. లైనప్‌లో 30 ఎలక్ట్రిక్ మోడళ్లు
టోక్యో: భవిష్యత్‌లో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు జపనీస్ ఆటో దిగ్గజం టయోటా మోటార్ కార్పొరేషన్ తాజాగా వెల్లడించింది. 2030కల్లా 30 పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ మోడళ్లను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ అకియో టయోడా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పదేళ్ల కాలంలో 3.5 మిలియన్ ఈవీలను విక్రయించాలని కంపెనీ ప్రణాళికలు వేసినట్లు తెలియజేశారు. తొలుత వేసిన 2 మిలియన్ వాహనాలతో పోలిస్తే లక్ష్యాన్ని పెంచినట్లు తెలియజేశారు. బియాండ్ జీరో(బీజెడ్) సిరీస్ పేరుతో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ మోడళ్ల తయారీకి తెరతీసినట్లు టయోడా వెల్లడించారు. తద్వారా మరికొన్నేళ్లలో అన్ని రకాల ఎస్యూవీ, పికప్ ట్రక్కులు, స్పోర్ట్స్ కార్లను ఈవీ మోడళ్లలో రూపొందించనున్నట్లు వివరించారు. లెక్సస్ లగ్జరీపై దృష్టి ప్రియస్ హైబ్రిడ్, లెక్సస్ లగ్జరీ మోడళ్లతోపాటు.. మిరాయి ఫ్యూయల్ సెల్ కారును రూపొందించిన కంపెనీ ఇకపై మరిన్ని వేరియంట్లను విడుదల చేయనున్నుట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో 2035కల్లా లెక్సస్ లగ్జరీ బ్రాండును పూర్తిఎలక్ట్రిక్గా అందించనున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో 2030కల్లా వీటిని యూఎస్, యూరోపియన్, చైనీస్ మార్కెట్లలో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. బ్యాటరీ అభివృద్ధి కోసం ఈ ఏడాది మొదట్లో ప్రకటించిన 13.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తాజాగా 17.6 బిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. హైబ్రిడ్స్ తదితర గ్రీన్ టెక్నాలజీలపై కంపెనీ మొత్తం 70 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. చదవండి: బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ -
లిమిటెడ్ ఎడిషన్‌లో ఎల్సీ 500హెచ్
ముంబై: టయోటా అనుబంధ సంస్థ లెక్సెస్ లిమిటెడ్ బుధవారం లిమిటెడ్ ఎడిషన్‌గా ఎల్సీ 500హెచ్ మోడల్ కారును విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.2.15 కోట్లుగా ఉంది. ఎయిర్ రేస్ పైలెట్ యోషిహిడే మురోయా, లెక్సెస్ ఇంజనీర్ల భాగసామ్యంలో ఈ కారు రూపకల్పన జరిగింది. ఏవియేషన్ డిజైన్ ప్రేరణతో వస్తున్న ఈ మోడల్‌ను కస్టమర్లు ఆదరిస్తారని భారత ప్రెసిడెంట్ పీబీ వేణుగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో ఈ లెక్సస్ కార్లు అమ్ముడవుతున్నాయి. -
లెక్సస్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ@ రూ.99 లక్షలు
న్యూఢిల్లీ: టయోటా గ్రూప్‌నకు చెందిన లగ్జరీ వాహనాల తయారీ కంపెనీ ‘లెక్సస్’ తాజాగా తన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఆర్ఎక్స్ 450హెచ్ఎల్’ కారును భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.99 లక్షలు (ఎక్స్‌షోరూం, ఢిల్లీ). అదనపు మూడవ వరుస సీటింగ్‌తో వచ్చిన ఈ మోడల్.. బీఎస్–6 ప్రమాణాలతో విడుదలైంది. 3.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన ధరతో ఈ కారు విడుదలైంది’ అని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ పీబీ వేణుగోపాల్ చెప్పారు. -
ఐస్ చక్రాలు...
లండన్‌లోని లెక్సస్ కారు కంపెనీలో పనిచేసే ఔత్సాహికులకు ఓ ఆలోచన వచ్చింది. మంచు బాగా కురుస్తున్నపుడు రోడ్లపై కార్లు పట్టుతప్పి పక్కకు జారిపోవడం లేదా మంచులో కూరుకుపోవడం చూస్తుంటాం. అలాంటపుడు అదే మంచుతో చక్రాలను తయారు చేసి చూస్తే... అని సరదాగా అనిపించింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఓ నలుగురు సుమారు 36 గంటల పాటు శ్రమించి నాలుగు మంచు చక్రాలను తయారు చేశారు. లెక్సస్ ఎన్ఎక్స్ హైబ్రిడ్ కారును డీప్ ఫ్రీజర్‌ను పోలిన వాతావరణం ఉండే రూములో ఉంచి మంచు చక్రాలను బిగించారు. తర్వాత మెల్లిగా మైదానంలోకి తీసుకొచ్చి నడిపారు. ఎంతదూరం నడిపారు... ఈ చక్రాలు ఎంతవరకు కరిగిపోకుండా ఉన్నాయనే వివరాలేమీ వీరు బయటపెట్టలేదు. సరదాగా చేసిన ప్రయత్నమని చెప్పుకొచ్చారు.