ప్రసంగం రచ్చ
ముదిరిన వివాదం
కిరణ్‌కు స్పీకర్ ఆహ్వానం
ఆసక్తికరంగా పుదుచ్చేరి రాజకీయం
సాక్షి, చెన్నై: సీఎం నారాయణస్వామి, గవర్నర్ కిరణ్ బేడీల మధ్య వివాదం పుదుచ్చేరి రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో ప్రసంగించేందుకు తాను సిద్ధం అన్నట్టుగా, స్వయంగా ప్రసంగం జాబితాను కిరణ్ సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు ఆ రాష్ట్ర స్పీకర్ వైద్యలింగం ఆహ్వానిండం గమనార్హం. పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ మారారు. తనకు ఉన్న అధికారాల మేరకు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. కిరణ్ చర్యల్ని తిప్పికొట్టే విధంగా ఆ రాష్ట్ర సీఎం నారాయణ స్వామి వ్యవహరిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదంటూ అధికారులకు సూచించి ఉన్నారు. దీంతో సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య వివాదం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో వివాదం రోజురోజుకు ముదురుతుండడంతో పుదుచ్చేరిలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశానికి సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఈ ఏడాదిలో జరిగే తొలి సమావేశంలో తనకు ప్రసంగించే అవకాశం ఇవ్వాలని కిరణ్‌బేడీ స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే, బడ్జెట్ సమావేశాల్లో మాత్రమే కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గవర్నర్లకు సభలో ప్రసంగించేందుకు అవకాశం ఉంది. అయితే తొలి సమావేశంలో తన ప్రసంగం తప్పనిసరి అన్నట్టుగా కిరణ్ బేడీ చర్యలు ఉండడాన్ని సీఎం నారాయణ స్వామి తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరోమారు ఆ రాష్ట్ర స్పీకర్‌కు కిరణ్‌బేడీ లేఖ రాసి ఉన్నారు. ఇందుకు స్పీకర్ వైద్యలింగం ఆహ్వానం పలికి ఉండడం చర్చకు దారి తీసింది. సీఎం నారాయణ స్వామి వ్యతిరేకిస్తుంటే, స్పీకర్ ఆహ్వానించి ఉండడం అక్కడి కాంగ్రెస్ గ్రూపు వివాదాలు మళ్లీ తెరమీదకు వచ్చి ఉన్నట్టుగా పరిస్థితులు మారి ఉన్నాయి.
ప్రసంగం రచ్చ: లెఫ్టినెంట్ గవర్నర్‌ను స్పీకర్ ఆహ్వానించడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించి ఉన్నారు. గవర్నర్ ప్రసంగం జాబితాను స్పీకర్ కార్యాలయం తయారు చేయడం ఆనవాయితీ. దీనికి సీఎం ఆమోద ముద్ర వేసినానంతరం గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు విరుద్ధంగా కిరణ్ అడుగులు సాగుతుండడంతో పుదుచ్చేరిలో వివాదం ముదిరి ఉన్నది. స్వయంగా తానే ప్రసంగాన్ని సిద్ధం చేసుకునే పనిలో కిరణ్ ఉన్నట్టు సమాచారం. కొందరు అధికారులు ఇందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు రావడంతో ఆగమేఘాలపై అసెంబ్లీ వ్యవహారాల కమిటీని సమావేశ పరిచేందుకు సీఎం నారాయణస్వామి నిర్ణయించి ఉన్నారు. ఈ నెల 18వ తేదీ బుధవారం అసెంబ్లీ వ్యవహారాల కమిటీని సమావేశ పరచి, అందులో గవర్నర్‌కు వ్యతిరేకంగా ఏదేని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో సీఎం, గవర్నర్ల వార్‌లో అధికారులతో పాటుగా స్పీకర్ కూడా నలిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉన్నది. ఈ పరిణామాలు కాస్త పుదుచ్చేరి రాజకీయాల్లో ఓ వైపు ఆసక్తికరంగా మారి ఉంటే, మరో వైపు ఈ ఇద్దరి కుమ్ములాటలపై విమర్శలు గుప్పించే పనిలో ప్రజలు నిమగ్నం కావడం గమనార్హం.