మండుతున్న సిలిండర్ను పట్టుకొని..
బీజింగ్: గ్యాస్ సిలెండర్ లీక్ అవడం ఎంత ప్రమాదకరమో వేరే చెప్పక్కర్లేదు. కిచెన్లో కొంచెం గ్యాస్ లీకైన వాసన తగిలితేనే మనం ఎంతగానో కంగారు పడిపోతాం. అలాంటిది గ్యాస్ లీకై మంటలు వెదజిమ్ముతున్న సిలిండర్ను చేతులతో పట్టుకొని ఐదు ఫ్లోర్లు మెట్లు దిగాడంటే ఎంత దైర్యసాహసాలుండాలి. చైనాలో ఓ ఫైర్మెన్ చేసిన ఈ సాహసం ఇప్పుడు అందరిచేత ఔరా! అనిపిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని కున్మింగ్ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించాయని సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. బిల్డింగ్ ఐదో ఫ్లోర్లోని ఓ కిచెన్లో ఉన్న సిలెండర్ లీకై మంటలు వెలువడుతుండటాన్ని గమనించిన సిబ్బంది దానిని ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సఫలం కాకపోవడంతో ఫైర్మెన్ జియోబిన్ మంటలతో ఉన్న సిలిండర్ను పట్టుకొని చకచకా ఐదు ఫోర్లు దిగి సిలిండర్ను బయటపడేశాడు. అదృష్టవశాత్తు ఆ సిలిండర్ పేలకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మారింది.