ఐసిస్‌ను ఊడ్చిపారేశారు!
లిబియా: ఉగ్రవాదుల చెరు నుంచి లిబియా ఊపిరి పీల్చుకుంది. తమ దేశంలో పాగా వేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను దాదాపు పూర్తిగా ఊడ్చిపారేసింది. అమెరికా సేనల సహాయంతో సిర్టీలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చివరి బేస్ క్యాంపుపై విజయవంతంగా లిబియా సేనలు వైమానిక దాడులు నిర్వహించాయి. దీంతో ఆ ప్రాంతంలోని ఉగ్రవాదుల నివాసాలు, బంకర్లు ధ్వంసమయ్యాయి. అక్కడ ఉన్న ఉగ్రవాదులంతా పరారై పోయారు. దీంతో సిర్టీ, గిజి బరియా జిల్లాలపై లిబియా సైన్యం పూర్తి స్థాయిలో పట్టు సంపాధించినట్లయింది. ఈ దాడులకు ముందు పలువురు మహిళలను, చిన్నపిల్లలను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. అయితే, దాడులు చేసిన వెంటనే వారిని విడిచిపెట్టి పారిపోయారు.
ఈ విజయంతో లిబియా సేనలు అమెరికా సేనలతో కలిసి సంబురాల్లో మునిగిపోయాయి. తమ వీర జవానుల త్యాగం వృధా కాలేదంటూ సైనికులు నినాదాలు చేశారు. సిర్టీలో పట్టు కోల్పోవడం ఇస్లామిక్ స్టేట్ కు పెద్ద ఎదురుదెబ్బ అయింది. ఇతర దేశాల్లో ఆ సంస్థ హవా ఉన్నప్పటికీ లిబియాలో ఎక్కడా కూడా తనకంటూ ప్రత్యేక స్థావరం లేకుండా పోయింది. 2015లో సిర్టీలో చొరబడిన ఉగ్రవాదులు అక్కడే తిష్టవేసి ఆ ప్రాంతంపై పట్టు సాధించి ముప్పు తిప్పలు పెట్టారు. ఈ నేపథ్యంలో లిబియా అమెరికా సంయుక్త సేనలు దాడులకు దిగి విజయం సాధించాయి. ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్ వెస్ లీ డ్రియాన్ ఈ సందర్భంగా సైనికులకు అభినందనలు చెప్పారు. ఇది నిజంగా ఓ శుభవార్త, ఉగ్రవాదులను దెబ్బకొట్టడం చాలా గొప్ప చర్య అని, సైనికులను అభినందించకుండా ఉండలేకపోతున్నాని చెప్పారు.