Lifeguards
-
సముద్రంలో పడవ బోల్తా.. రుషికొండ బీచ్‌లో తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: రుషికొండ బీచ్‌లో పెను ప్రమాదం తప్పింది. సముద్రం మధ్యలో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో డ్రైవర్, ఇద్దరు టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. సకాలంలో స్పందించిన లైఫ్ గాడ్స్.. వారిని క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. టూరిస్టులను పెందుర్తి, మధురవాడకు చెందిన రవి, సురేష్‌గా గుర్తించారు.. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. చదవండి: వరదలో చిక్కిన కుక్కపిల్లలు.. ఆ తల్లి ఏం చేసిందంటే..? వీడియో వైరల్.. -
లైఫ్ గార్డ్స్..: ఫియర్లెస్ ఫైవ్...
అందరికీ ‘బేవాచ్’ టి.వి. సిరీస్ తెలుసు. కాలిఫోర్నియా బీచ్‌లలో ప్రమాదంలో పడే పర్యాటకులను కాపాడే లైఫ్‌గార్డ్స్ కథలు అవి. మన దగ్గర కూడా తీర ప్రాంతాల్లో లైఫ్‌గార్డ్స్ ఉన్నారు. కాని వారంతా మగవారు. మొదటిసారి గోవాలో ఐదుగురు మహిళా లైఫ్‌గార్డ్స్ చార్జ్ తీసుకున్నారు. టెన్ టు ఫైవ్ ఉద్యోగాలు బోర్ అని పర్యాటకులను కాపాడటంలో మజా ఉంటుందని వారు అంటారు. తీరంలో చిరుతల్లా తిరుగుతూ నీళ్లల్లో చేపల్లా దుమికే వీరిని చూసి తీరాలు చప్పట్లు కొడుతున్నాయి. కొత్త రక్షకులు వచ్చారన్న ధైర్యంతో కెరటాలతో ఆటలాడుతున్నాయి. ఎగిసిపడే కెరటాలతో ఆకర్షించడం సముద్రం వంతు. కొత్త ప్రాంతానికి వచ్చామన్న ఉత్సాహంతో ఉరికురికి దూకడం పర్యాటకుల వంతు. సముద్రం మనకు ముద్దొచ్చినా సముద్రానికి మనం ముద్దొచ్చినా మనకే ప్రమాదం. పైకి కనిపించే కెరటాలు వేరు. లోపల లాగే కరెంట్స్ వేరు. నీళ్లు కప్పిన నేల కింద గుంతలు ఉండొచ్చు. లోతులు ఉండొచ్చు. ఊహించని ప్రమాదం జరిగి మునిగిపోతుంటే కాపాడేదెవరు? ఇదిగో ఈ లైఫ్గార్డ్సే సముద్రానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించేవారి వార్తలు మన తీర ప్రాంతాల నుంచి కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే కేవలం పర్యాటకమే ఆధారంగా ఉండే గోవా వంటి చోట అలాంటి వార్తలు తరచూ వస్తే పర్యాటక రంగమే కుంటు పడుతుంది. జనం భయపడి రారు. అందుకే తీరం వెంట లైఫ్‌గార్డ్స్ ఏర్పాటు చేసింది గోవా టూరిజం శాఖ ‘దృష్టి మెరైన్’ అనే విభాగం ద్వారా. ఈ విభాగం మెరికల్లాంటి ఈతగాళ్లను ఉద్యోగంలో తీసుకుని తీరం వెంట వారిని గస్తీ తిప్పుతూ ఉంటుంది. అయితే ఇదే విభాగం గత కొన్నాళ్లు స్త్రీలను ఈ రంగంలో ప్రోత్సహించేందుకు ప్రకటనలు ఇస్తోంది. మగవారు పాల్గొనే ఈ రిస్కీ జాబ్‌లో స్త్రీలు ఇన్నాళ్లకు ముందుకు వచ్చారు. వారిలో ఐదుగురితో ‘మహిళా లైఫ్‌గార్డ్స్’ దళం ఏర్పాటయ్యింది. ఇంతకూ వారెవరు? సాహసమే జీవితం ఈ ఐదు మందిలో శ్రియ కరేకర్ చిన్నది. వయసు 21. ‘నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు సముద్రంలో ఆటలాడుతూ మునిగిపోబోయాను. దెబ్బకు భయపడి మా అమ్మ నన్ను ఈతలో పడేసింది. చిన్న వయసులోనే బాగా నేర్చుకున్నాను. మా అన్న పర్యాటకులను కాపాడే లైఫ్‌గార్డ్‌గా మారాక నాకూ ఈ రంగంలోకి రావాలనిపించింది. దానికి కారణం వాడిలా నాకూ జెట్ స్కీ(వాటర్ బైక్) నడపాలని ఉండటమే. ఇన్నాళ్లకు నా కల నెర వేరింది’ అంటుంది శ్రియ. ఇంతకు ముందు ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేసేది. అలాగే స్విమ్మింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా. ఇప్పుడు ఆమెకు నిజమైన సంతోషం ఇస్తున్నది ఈ లైఫ్‌గార్డ్ పనే. ఇదే టీమ్‌లో ఉన్న 26 ఏళ్ల అనన్య బాత్ ఇలాంటి ఉద్యోగం ఉందని తెలిసి హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చింది. ‘అక్కడ నేను రెస్టరెంట్ మేనేజర్‌గా పని చేసేదాన్ని. బోర్ కొట్టింది’ అంటుందామె. లైఫ్‌గార్డ్ కావాలంటే కఠినమైన శిక్షణ ఉంటుంది. మునిగిపోతున్నవారిని రక్షించడమే కాదు, బీచ్‌లో జనాన్ని అదుపు చేయడం కూడా వీరి పనే. ఇక ఈ ఐదుగురి టీమ్‌లో అందరికంటే ఎక్కువ వయసు ఉన్న మహిళ చార్మిన్ డిసూజా. ఆమె వయసు 45. ‘నేను పుట్టిన ఆరునెలలకే కాళ్లు సరిగా ఎదగలేదని మా తల్లిదండ్రులు నీటితొట్టెలో ఈత మొదలు పెట్టించారు. ఈత మంచినీళ్ల ప్రాయం నాకు. బేవాచ్ చూస్తూ పెరిగినదాన్ని. కాలిఫోర్నియా వెళ్లి అక్కడి బీచ్‌లలో పని చేయాలని కూడా అనుకున్నాను. కుదర్లేదు’ అంటుంది చార్మిన్. గోవా లైఫ్‌గార్డ్స్‌గా పని చేసేవారి వయసు స్త్రీలైనా పురుషులైనా 30. కాని చార్మిన్ ఈత లాఘవం చూసి ఈ నియమంలో వెసులుబాటు ఇచ్చారు. 27 ఏళ్ల హర్హా నాయక్ కూడా జీవితంలో ఏదైనా థ్రిల్ ఉండాలని ఈ ఉద్యోగాన్ని ఎంచుకుంది. 24 ఏళ్ల పూజా బుడే మహారాష్ట్ర నుంచి వచ్చి ఈ ఉద్యోగంలో చేరింది. ఇలా భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ఐదుగురు ఇప్పుడు ఒక టీమ్‌గా గోవా బీచ్‌లలో గస్తీ తిరుగుతున్నారు. పెళ్లి కాదని... వద్దన్నారు అయితే వీరు ఈ పని ఎంచుకోవడంలో వ్యతిరేకత లేదని కాదు. బంధువులు అభ్యంతరం చెప్పారు. ‘ఈ ఉద్యోగంలో సముద్రం దగ్గర ఎండలో తిరగాలి. చర్మం నల్లబడుతుంది. ఎవరు చేసుకుంటారు పెళ్లి’ అని ఈ వీరిలోని ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకు బంధువులు హితవు చెప్పారు. ఒక కుటుంబంలో అన్న ఈ పని వద్దంటే మరో కుటుంబంలో తండ్రి వద్దన్నాడు. అయినా వీరు ‘మా ఇష్టం. మాకు ఈ పనే ఇష్టం’ అని లైఫ్‌గార్డ్స్‌గా మారారు. పిక్నిక్లకు వెళ్లినప్పుడు మగవాళ్ల బట్టలు, చెప్పులు కాపలా కాస్తూ ఒడ్డున కూచునే గృహిణులనే చూసిన ఈ సమాజం ధైర్యంగా సముద్రం మీదకు లంఘించే ఈ అపర జలవనితలను చూసి సంతోషించక తప్పదు. శహబాష్ అనకా తప్పదు. -
Rushikonda Beach: ఐదుగురిని కాపాడిన లైఫ్‌గార్డ్స్
కొమ్మాది(భీవిులి): రుషికొండ బీచ్‌లో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఇక్కడ బీచ్‌కు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికి చెందిన సోమ రాకేష్‌రెడ్డి, దాసరి అజయ్‌రెడ్డి, ఏనుగ విజయ్‌కుమార్‌రెడ్డి, సోమ రామకృష్ణారెడ్డి, పొన్నాల వంశీకృష్ణారెడ్డి వచ్చారు. వీరు సముద్రంలోకి దిగారు. కెరటాల ఉధృతి ఎక్కువగా ఉండటంతో సముద్రంలోకి కొట్టుకుపోయారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ గద్దిపిల్లి రమేష్, దేవాలు స్పందించి వారిని కాపాడారు. -
బీచ్‌ల వద్ద ఇక ప్రైవేటు లైఫ్‌గార్డులు!
సాక్షి, ముంబై : నగర వ్యాప్తంగా బీచ్‌లలో తక్కువ సంఖ్యలో లైఫ్‌గార్డులు ఉండడంతో చాలా మంది ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రైవేట్ ఏజెన్సీలకు లైఫ్‌గార్డుల బాధ్యతను అప్పగించాలని నిర్ణయించింది. ఈ కంపెనీలు వివిధ బీచ్‌లలో వంద మంది లైఫ్‌గార్డులను మోహరించే బాధ్యతను తీసుకుంటాయి. సెలవులు, ఆదివారాలలో బీచ్‌ల వద్ద సందర్శకుల సంఖ్య అధికంగా ఉంటుంది. ముఖ్యమైన బీచ్‌ల వద్ద సందర్శకులను హెచ్చరించే లైఫ్‌గార్డులు లేక చాలా మంది ప్రమాదవశత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. మరణాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఒక్కో బీచ్‌లో ఎంతమంది లైఫ్‌గార్డులను నియమించాలో తర్వాత నిర్ణయిస్తామని బీఎంసీ అధికారి తెలిపారు. ప్రస్తుతం నగరంలో ఏడు బీచ్‌లకు గాను 36 మంది లైఫ్‌గార్డులు ఉన్నారు. అయితే మత్సకారులను లైఫ్‌గార్డులుగా నియమించాలని ఇటీవల అగ్ని మాపక అధికారులు సూచించారు. కానీ ఈ ప్లాన్ ఫలించలేదు. ఈతలో మంచి నైపుణ్యం ప్రదర్శించేవారు కరువు అవడంతో ఈ ప్లాన్‌కు ఆదరణ తగ్గింది. కొన్ని ఏళ్ల క్రితం మహిళా లైఫ్‌గార్డులను నియమించగా ఇది కూడా పలు కారణాల వల్ల విఫలమైంది. ఓ సీనియర్ అగ్ని మాపక అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ప్రైవేట్ కంపెనీల నుంచి లైఫ్ గార్డులను ఎంపిక చేస్తున్నామన్నారు. కంపెనీ కోసం నిబంధనలు చివరిదశలో ఉన్నాయన్నారు. ఇవి సిద్దంకాగానే టెండర్లను ఆహ్వానించనున్నట్లు అధికారి తెలిపారు. నియమించిన ఏజెన్సీలు లైఫ్ గార్డులకు శిక్షణ ఇవ్వనున్నారు. మహారాష్ట్ర, గోవాకు లైఫ్ గార్డులను అందజేసే చాలా ఏజెన్సీలు ఉన్నాయన్నారు. దీంతో టెండర్లను ఆహ్వానించగానే ఈ ఏజెన్సీలు కూడా శ్రద్ద వహిస్తాయని అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా ప్రస్తుతం నగర బీచుల్లో 36 మంది లైఫ్‌గార్డులు మోహరించి ఉండగా 23 మంది పర్మినెంట్ లైఫ్‌గార్డులుగా ఉన్నారు. -
నేడే నిమజ్జనం
సాక్షి, ముంబై: గణేశ్ నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పా ట్లు పూర్తయ్యాయి. నగర పాలక సంస్థ అధికారులు ఇందుకు సంబంధించి అంతా సిద్ధం చేశారు. 8,263 మంది బీఎంసీ ఇబ్బంది విధుల్లో నిర్వహిం చనున్నారు. అదేవిధంగా 100 నిమజ్జన ఘాట్లను ఏర్పాటు చేశారు. 404 మంది లైఫ్ గార్డులు, 67 ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, 55 అంబులెన్సులు, 71 కంట్రోల్ రూంలు, 55 మోటార్ బోట్లు, 172 డంబ ర్లు, 64 వాచ్ టవర్లు, 278 సీసీ టీవీ కెమెరాలను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు సబంధిత అధికారి ఒకరు తెలిపారు.మరోవైపు భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ట్రాఫిక్ పోలీస్ విభా గం సోమవారం 49 రహదార్లను మూసివేశారు. 55 మార్గాల్లో వన్‌వేకి అనుమతించారు. అదేవిధంగా భారీ వాహనాలను 13 మార్గాల్లో నిషేధించారు. 95 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కూడా నిషేధిం చారు. గిర్గావ్ చౌపాటి, శివాజీ పార్క్ చౌపాటి, బాం ద్రాలోని బడా మసీదు, జూహూ చౌపాటి, పొవైలలో ఐదు ట్రాఫిక్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు నగర వ్యాప్తంగా 37 నిఘా టవర్లను కూడా ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇక దక్షిణ ముంబైలో ముఖ్యమైన రహదార్లను మూసివేయనున్నారు. వీపీ రోడ్ (సీపీ ట్యాంక్ సర్కిల్ నుంచి బాల్ చంద్ర కంపెనీ వరకు), సీపీ ట్యాంక్ రోడ్ (మాధవ్ బాగ్ నుంచి సీపీ ట్యాంక్ సర్కిల్ వరకు), సెకండ్ కుంభార్‌వాడా రోడ్ , వీపీ రోడ్ (కవాస్జీ పటేల్ రోడ్ నుంచి ఎస్వీపీ రోడ్ జంక్షన్, ఈ జంక్షన్ నుంచి డాక్టర్ బద్‌కంకర్ మార్గ్ వరకు), ల్యామింగ్టన్ రోడ్, జగన్నాథ్ శంకర్‌శేఠ్ మార్గ్ (ప్రిన్సెస్ స్ట్రీట్ జంక్షన్‌నుంచి ఎస్వీపీ రోడ్ జంక్షన్-ఒపేరా హౌజ్ వరకు), డాక్టర్ బీఏ రోడ్ (భారత్ మాత ప్రాంతం నుంచి బావల్లా కంపౌండ్ వరకు)ను మూసిఉంచనున్నారు. మధ్యముంబైలోని శివాజీ పార్కు రోడ్డు, క్యాడెల్ రోడ్డుతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని రహదారులను మూసిఉంచనున్నారు. తిలక్ వంతెననుకూడా ఇరువైపులా మూసివేస్తారు.