బీచ్‌ల వద్ద ఇక ప్రైవేటు లైఫ్‌గార్డులు! | Soon, 100 lifeguards will man 7 Mumbai beaches | Sakshi
Sakshi News home page

బీచ్‌ల వద్ద ఇక ప్రైవేటు లైఫ్‌గార్డులు!

Published Fri, Jan 2 2015 11:04 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

Soon, 100 lifeguards will man 7 Mumbai beaches

సాక్షి, ముంబై : నగర వ్యాప్తంగా బీచ్‌లలో తక్కువ సంఖ్యలో లైఫ్‌గార్డులు ఉండడంతో చాలా మంది ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రైవేట్ ఏజెన్సీలకు లైఫ్‌గార్డుల బాధ్యతను అప్పగించాలని నిర్ణయించింది. ఈ కంపెనీలు వివిధ బీచ్‌లలో వంద మంది లైఫ్‌గార్డులను మోహరించే బాధ్యతను తీసుకుంటాయి. సెలవులు, ఆదివారాలలో బీచ్‌ల వద్ద సందర్శకుల సంఖ్య అధికంగా ఉంటుంది. ముఖ్యమైన బీచ్‌ల వద్ద సందర్శకులను హెచ్చరించే  లైఫ్‌గార్డులు లేక చాలా మంది ప్రమాదవశత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. మరణాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఒక్కో బీచ్‌లో ఎంతమంది లైఫ్‌గార్డులను నియమించాలో తర్వాత నిర్ణయిస్తామని బీఎంసీ అధికారి తెలిపారు.

ప్రస్తుతం నగరంలో ఏడు బీచ్‌లకు గాను 36 మంది లైఫ్‌గార్డులు ఉన్నారు. అయితే మత్సకారులను లైఫ్‌గార్డులుగా నియమించాలని ఇటీవల అగ్ని మాపక అధికారులు సూచించారు. కానీ ఈ ప్లాన్ ఫలించలేదు. ఈతలో మంచి నైపుణ్యం ప్రదర్శించేవారు కరువు అవడంతో ఈ ప్లాన్‌కు ఆదరణ తగ్గింది. కొన్ని ఏళ్ల క్రితం మహిళా లైఫ్‌గార్డులను నియమించగా ఇది కూడా పలు కారణాల వల్ల విఫలమైంది. ఓ సీనియర్ అగ్ని మాపక అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ప్రైవేట్ కంపెనీల నుంచి లైఫ్ గార్డులను ఎంపిక చేస్తున్నామన్నారు.

కంపెనీ కోసం నిబంధనలు  చివరిదశలో ఉన్నాయన్నారు. ఇవి సిద్దంకాగానే టెండర్లను ఆహ్వానించనున్నట్లు అధికారి తెలిపారు. నియమించిన ఏజెన్సీలు లైఫ్ గార్డులకు శిక్షణ ఇవ్వనున్నారు. మహారాష్ట్ర, గోవాకు లైఫ్ గార్డులను అందజేసే చాలా ఏజెన్సీలు ఉన్నాయన్నారు. దీంతో టెండర్లను ఆహ్వానించగానే ఈ ఏజెన్సీలు కూడా శ్రద్ద వహిస్తాయని అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా ప్రస్తుతం నగర బీచుల్లో 36 మంది లైఫ్‌గార్డులు మోహరించి ఉండగా 23 మంది పర్మినెంట్ లైఫ్‌గార్డులుగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement