వైఫై స్థానంలో లైఫై
హైదరాబాద్: ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగానికి మనం వాడుతున్న వైఫై (వైర్లెస్ ఫిడిలిటీ) స్థానంలో లైఫై అందుబాటులోకి రానుందని ఏపీ రాష్ట్ర సహకార, రిజిస్ట్రేషన్ల విభాగం ప్రత్యేక కమిషనర్ ఎంవీ శేషగిరి బాబు చెప్పారు. వైర్లెస్ విధానంలో వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు రేడియో తరంగాలను ఉపయోగించుకునే నెట్ వర్కింగ్ టెక్నాలజీని వైఫై అంటుంటారు. లైఫైలో కాంతి తరంగాల ద్వారా మరింత వేగంగా సమాచార మార్పిడి జరుగుతుంది.
ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ (ఇ-గవర్నెన్స్) లీడర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా దేశ వ్యాప్తంగా 15 మంది ఐఏఎస్ అధికారులు యూరప్‌లోని ఇస్తోనియాలో శిక్షణ పొంది వచ్చారు. ప్రపంచంలో నూటికి నూరు శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించిన దేశంగా గుర్తింపు పొందిన ఇస్తోనియాలో పదేళ్ల కిందటే ప్రభుత్వంలోని అన్ని లావాదేవీలు, ఉత్తరప్రత్యుత్త్తరాలు కంప్యూటర్ల ద్వారానే సాగుతున్నాయి. భూమి రికార్డులు, రిజిస్ట్రేషన్లు అన్నీ కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. ప్రతి పౌరునికీ రెండు రకాల గుర్తింపు కార్డులు ఇస్తారు. ఒకటి మొబైల్ ఫోన్ ఐడీ, రెండోది స్మార్ట్‌కార్డు ఐడీ. ఈ రెండింటితోనే అన్ని పనులూ జరుగుతాయి.
చివరకు ఓటు కూడా ఇంటినుంచే వేయవచ్చు. ప్రభుత్వ శాఖల్లోని ఫైళ్ల కదలికలు సైతం కంప్యూటర్ల ద్వారానే నిర్వహిస్తున్నారు. దీనివల్ల అవినీతి మాసిపోయింది. సేవల్లో వేగం పెరిగింది. పారదర్శకత పెరిగింది. ఇ-డెమోక్రసీ ద్వారా జనం తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలుపవచ్చు. దీంతోపాటు వ్యక్తిగత సమాచారాన్నీ ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో కూడా నిర్ణయించే హక్కు పౌరునికి ఉంటుందని’ శేషగిరిబాబు వివరించారు. తన శిక్షణకు సంబంధించి ప్రభుత్వానికి ఓ సమగ్ర నివేదిక సమర్పించనున్నట్టు తెలిపారు