సూర్యుడు సర్రుమనిపిస్తాడు
పెట్రోలు, డీజిళ్లకు రోజులు దగ్గర పడ్డాయి. ఒకవైపు ఫ్రాన్స్ లాంటి దేశాలు.. ఇంక కొన్నేళ్లలోనే తాము ఈ శిలాజ ఇంధనాల వాడకానికి స్వస్తి చెబుతామని స్పష్టం చేస్తూంటే.. ఇంకోవైపు విద్యుత్‌తోపాటు నేరుగా సౌరశక్తితోనే నడిచే కార్లు, వాహనాలు బోలెడన్ని మార్కెట్లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా ఇప్పటికే విద్యుత్ కార్ల విషయంలో రికార్డులు బద్దలు కొడుతూంటే నెదర్లాండ్స్‌కు చెందిన కంపెనీ లైట్‌ఇయర్ వన్ సౌరశక్తితో నడిచే కార్ల విషయంలో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఫొటోలో కనిపిస్తున్నది లైట్ ఇయర్ వన్ కారే! ఏంటి దీని ప్రత్యేకతలూ అంటే... ఫొటోలు కొంచెం జాగ్రత్తగా గమనించండి. చిన్న ఫొటోలో పలకల్లాంటివి కనిపిస్తున్నాయా? అవన్నీ సోలార్ ప్యానెల్స్.
కారు బాడీలోకి కలగలిసిపోయిన ఈ ప్యానెళ్లతో రోజంతా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో దీన్ని ఏకంగా 750 కిలోమీటర్లు నడిపేయవచ్చు. ఇంకోలా చెప్పాలంటే పెట్రోలు, డీజిళ్ల వంటి ఇంధనాలేవీ లేకుండా కేవలం సూర్యుడి శక్తితోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లపోవచ్చునన్నమాట. ఎండలు బాగా ఉండే మనలాంటి దేశాల్లోనైతే.. ఇలాంటి కార్లను చార్జింగ్ అనేది చేసుకోకుండా నెలలపాటు నడిపేయవచ్చు. విద్యుత్తుతో నడిచే కార్లను అప్పుడప్పుడూ చార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా అక్కడక్కడా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. లైట్ ఇయర్ వన్‌తో ఇలాంటి చిక్కులేవీ ఉండవు. ఏ దశలోనైనా ఎండ అనేది దొరక్క కారు నిలిచిపోతే.. సాధారణ విద్యుత్ ప్లగ్‌ను వాడుకుని చార్జ్ చేసుకునే సౌకర్యమూ ఉంది దీంట్లో! ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ కారు కోసం ఎంతో కాలం వేచి ఉండాల్సిన అవసరమేమీ లేదు. కావాలంటే ఇప్పుడే కొనుక్కోవచ్చు. కాకపోతే బేసిక్ మోడల్ కారు ధరే రూ.87 లక్షల దాకా ఉంది. అంతే!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్