likkar shop
-
వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో!
Comedian Raghu Karumanchi Sales Liquor Video Goes Viral: తనదైన కామెడీతో ఇటూ వెండితెర, అటూ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ రఘు కారుమంచి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా. కొంతకాలంగా తెరకు దూరమైన రఘు కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన రఘు షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని పాటించడం ఎంత అవసరమో లాక్డౌన్లో చాలా మంది నటీనటులకు తెలిసోచ్చింది. ఇటూ అవకాశాలు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు క్యారెక్టర్ అర్టిస్టులు. చదవండి: బాలయ్య ఫ్యాన్స్‌కు చేదు అనుభవం, థియేటర్లో అగ్ని ప్రమాదం అయితే అలాంటి కోవలోకి రాకుండా రఘు ముందు జాగ్రత్త పడుతున్నాడు. అందుకే అది ఏ వ్యాపారం అని కూడా చూడకుండా తాజాగా లిక్కర్ బిజినెస్ స్టార్ట్ చేశాడు రఘు. సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన రఘు ‘అదుర్స్’ చిత్రంలో తనదైన కామెడీతో అందరిని మెప్పించాడు. అలా కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకొని సినిమాల్లో తన ప్రయాణం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ప్రముఖ కామెడీ షోలో రఘు పేరుతో టీం కూడా నడిపించాడు. కొద్ది రోజులకు ఆ షో నుంచి బయటకు వచ్చిన రఘు పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టాడు. చదవండి: వెడ్డింగ్ యానివర్సరి, భర్త విషయంలో ప్రియాంక కీలక నిర్ణయం.. కరోనా కారణంగా అవకాశాలు లేకపోవడంతో లాక్డౌన్లో సొంతూరికి వెళ్లిన రఘు కూరగాయలు పండించాడు. అవి మంచి ఆదాయం తీసుకురావడంతో మరో పది ఎకరాల పొలం లీజుకు తీసుకొని భారీ స్థాయిలో కూరగాయలు పండించాడట. ఈ బిజినెస్‌లో మంచి లాభాలు రావడంతో ఆ డబ్బుతో లిక్కర్ బిజినెస్ మొదలు పెట్టాడట రఘు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో రఘుతో పాటు అతని ముగ్గురు స్నేహితులు కలిసి టెండర్స్ వేశారు. అందులో రెండు టెండర్స్ రఘు పేరు మీద వచ్చాయి. చదవండి: కూకట్పల్లి మాల్లో సల్మాన్ సందడి, వీడియో వైరల్ దీంతో నల్గొండ పట్టణ శివారులో మర్రిగూడ బైపాస్ వద్ద రెండు దుకాణాలను రఘు దక్కించుకున్నాడు. ఇటీవలే ఈ షాపులను ఓపెన్ చేసి మద్యం అమ్మడం మొదలు పెట్టాడు. రఘు స్వయంగా షాప్‌లో ఉండి మద్యం అమ్ముతుండటంతో అక్కడికి వచ్చిన వాళ్ళు షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది రఘుతో సెల్ఫీ తీసుకోవడంతో పాటు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. అది చూసిన నెటిజన్లు అవకాశాలు లేకపోయిన లైఫ్‌ని బాగా సెట్ చేసుకున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. -
పదిళ్లకో బెల్టు షాపు..
ఈయన పేరు మల్లేశం. భార్య పేరు సాయమ్మ. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. రోజువారీ కూలీనే వీరి జీవనాధారం. వీరి ఇంటి పక్కనే బెల్ట్‌షాప్ ఉంది. మల్లేశం ప్రతిరోజూ తాగుడుకు రూ.250 నుంచి రూ.300 దాకా ఖర్చు చేయడం మొదలెట్టాడు. మెల్లమెల్లగా కూలీకి వెళ్లడమే మానేశాడు. సాయమ్మ ఒక్కతే కూలీకి వెళ్లి భర్త, పిల్లలను సాకాల్సిన దుస్థితి. తాగుడు మానేయాలని భర్తతో సాయమ్మ తరచూ గొడవపడేది. పది రోజుల కింద ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పట్టపగలే తాగిన మత్తులో ఉన్న మల్లేశం.. సాయమ్మను కత్తితో పొడిచి చంపాడు. తర్వాత తాను పొడుచుకుని ఆసుపత్రి పాలయ్యాడు! కోరుట్ల : ఇలాంటి అఘాయిత్యాలు ఒకట్రెండు కాదు.. పది రోజులకో నేరం.. నెలకో ఘోరం అక్కడ కామన్‌గా మారిపోయాయి. మద్యం ఏరులై పారుతుండటంతో ఆ మత్తులో చిక్కి కూలీలు చిత్తయిపోతున్నారు. ఇదెక్కడో అడవుల్లోని తండాలోనో, మారుమూల ఊరిలోనో జరుగుతున్న తంతు కాదు.. జగిత్యాల జిల్లా కోరుట్ల పరిధిలోని అల్లమయ్యగుట్టలో లిక్కర్ సృష్టిస్తున్న బీభత్సం! పది ఇళ్లకో బెల్ట్ షాపు: అల్లమయ్యగుట్ట కాలనీలో సుమారు 300 ఇళ్లు ఉండగా.. బెల్టు షాపులు 30 ఉన్నాయి. జనాభా 1,200 నుంచి 1,500 వరకు ఉంటుంది. కాలనీలో ఉన్నవారంతా రోజువారీ కూలీలే. ఉదయం లేచింది.. మొదలు సాయంత్రం వరకు అంతా పనిచేసి రాత్రి వేళ ఇంటికి చేరుకుంటారు. కాయకష్టం మరిచిపోవడానికి కూలీలు మద్యానికి అలవాటు పడ్డారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకున్న కొందరు బెల్ట్‌షాపులు ఇబ్బడిముబ్బడిగా తెరిచారు. గల్లీకో బెల్ట్‌షాపులు ఏర్పాటయ్యాయి. చిన్నచిన్న కిరాణా షాపుల్లో.. టేలల్లో.. ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ 24 గంటలు మద్యం(చీప్ లిక్కర్) అందుబాటులో ఉంటుంది. అది తాగి కూలీలు మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. తాగి గొడవలు పడటం.. పొద్దంతా కష్టించి సంపాదించిన డబ్బులు మద్యానికి ఖర్చు చేస్తుండటంతో కాలనీవాసుల బతుకులు చితికిపోతున్నాయి. మూడొంతుల కూలి మద్యానికే.. అల్లమయ్యగుట్ట కాలనీవాసులు రోజువారీ సంపాదించే కూలి డబ్బులో మూడొంతులు మద్యం కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. ఒక్కో బెల్ట్ షాపుకు మద్యం అమ్మకాలతో రోజుకు కనీసం రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు ఆదాయం ఉంటోంది. ఈ లెక్కన 30 బెల్ట్ షాపులకు కాలనీ వాసులు కూలీనాలి చేసి సంపాదించిన డబ్బుల్లోంచి ప్రతీరోజు రూ.60 వేల దాకా చేరుతోంది. ఇలా కాలనీవాసులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. అనేక నేరాలు జరుగుతున్నాయి. ‘మామూళ్ల’.. మత్తు! అల్లమయ్యగుట్ట కాలనీలో సగానికిపైగా జనం మద్యం మత్తులో మునిగి తేలుతుండగా.. అడ్డగోలుగా వెలిసిన బెల్ట్ షాపులను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మాముళ్ల మత్తులో జోగుతోంది. ఈ కాలనీని ఆనుకుని ఉన్న వేములవాడ ప్రధాన రహదారి వెంట దాదాపు నాలుగు బెల్ట్‌షాపులు ఉన్నాయి. కాలనీలో సుమారు 14 వీధులు ఉండగా వీధికి రెండు చొప్పున బెల్ట్‌షాపులు వెలిశాయి. వీటన్నింటికీ కోరుట్లలోని వైన్ షాపుల నుంచి మద్యం సరాఫరా అవుతోంది. ఈ విషయం తెలిసినా వైన్ షాపుల నుంచి నెలవారీ మాముళ్లు అందుతుండటంతో ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలనీకి చెందిన యువకులే అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించిన దాఖలాలు లేవు. ఆడోళ్లకు భద్రత లేదు మా కాలనీలో ఎక్కడపడితే అక్కడ మందు దొరుకుతంది. మొగోళ్లు పనులు బంద్ చేసి చీప్ లిక్కర్ తాగుతున్నరు. పొద్దస్తమానం తాగడంతో ఆడోళ్లు పరేషాన్ అవుతున్నరు. ఎప్పుడు ఆడోళ్ల మీద ఏం ఘోరం జరుగుతుందోనని భయపడుతున్నం. – ఎల్లవ్వ, అల్లమయ్యగుట్ట కాలనీ 24 గంటలు మందు.. కాలనీలో అంతా కూలీనాలి చేసుకునేటోళ్లమే. పెళ్లాం.. మెగుడు కలిసి పనిచేస్తే వచ్చేది రూ.500. అందులో తాగుడుకే సగం డబ్బులు పోతున్నయ్. కాలనీలో ఎక్కడపడితే అక్కడ లిక్కర్ అమ్ముతున్నరు. - వీరభద్ర నగేశ్, అల్లమయ్యగుట్ట కాలనీ -
సర్కారీ గ‘మత్తు’
’సుప్రీం’ ఉత్తర్వుల నేపథ్యంలో మద్యం దుకాణాల తరలింపుపై దృష్టి షిఫ్టింగ్ చార్జీల వసూలుకు కసరత్తు 20న నూతన మద్యం విధానం విడుదల 22 నుంచి మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ తాడేపల్లిగూడెం : ప్రజల అవసరాలను తీర్చడంలో వెనుక వరుసలో ఉండే ప్రభుత్వం కాసులు వచ్చే మార్గాలను వెతకడంలో మాత్రం ముందుంటోంది. జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండకూడదన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను సైతం ఆదాయ వనరుగా మార్చుకునే పనిలో సర్కారు నిమగ్నమైంది. జిల్లాలో మొత్తంగా 458 మద్యం దుకాణాలు ఉండగా.. వాటిలో 375 దుకాణాలను జాతీయ, ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వీటిని ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంగా మార్చాల్సి ఉంది. ఎక్సైజ్ శాఖ నిబంధనలను అనుసరించి ఆయా దుకాణాల యజమానులపై దుకాణం తరలింపు (షిఫ్టింగ్) చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పరిస్థితుల్లో మద్యం దుకాణానికి సంబంధించిన లైసెన్స్‌దారు దుకాణాన్ని మరో చిరునామాకు మార్చాల్సి వస్తే.. ఆ విషయాన్ని ఎక్సైజ్ శాఖకు తెలియజేసి వార్షిక లైసెన్స్ ఫీజుపై 1 శాతం మొత్తాన్ని షిఫ్టింగ్ చార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న 375 దుకాణాలను ఈ నెలాఖరులోగా దూరంగా తరలించడంతోపాటు వాటి నిర్వాహకుల నుంచి షిఫ్టింగ్ చార్జీల వసూలుకు ఏర్పాట్లు చేస్తోంది. కేటగిరీని బట్టి ఒక్కొక్క మద్యం షాపు నుంచి రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వార్షిక లైసెన్స్ ఫీజును ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఈ లెక్కన ప్రధాన రహదారి నుంచి తరలించాల్సిన ప్రతి మద్యం దుకాణ లైసెన్స్‌దారు నుంచి సగటున రూ.40 వేల వరకు వసూలు చేసే అవకాశం ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మూడు నెలల ముందే ముచ్చట మరోవైపు ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగియనుంది. అయితే.. ఇందుకు భిన్నంగా కొత్త లైసెన్స్‌లు ఇవ్వడానికి మూడు నెలల ముందుగానే ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈనెల 20న ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని విడుదల చేయనుంది. ఆ రోజు రాత్రికి మార్గదర్శకాలు విడుదల అవుతాయని సమాచారం. కొత్త విధానంలోనూ 24 నెలలకే లైసెన్స్‌లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు భోగట్టా. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త మద్యం దుకాణాలను జాతీయ రహదారి, రాష్ట్ర రహదార్లకు 500 మీటర్ల అవతల ఏర్పాటు చేస్తామని లైసెన్స్‌దారులు ప్రభుత్వానికి హామీ పత్రాలు రాసివ్వాల్సి ఉంటుంది. నూతన మద్యం పాలసీలో జిల్లావ్యాప్తంగా బార్లు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వ్యాపారుల్లో గుబులు లైసెన్స్ గడువు ముగియనున్న చివరి త్రైమాసికంలో మద్యం వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాక్‌ను వదిలించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో అమ్మకాలకు సంబంధించి లైసెన్స్‌దారులకు ఇబ్బడిముబ్బడిగా లక్ష్యాలను నిర్దేశించి ఆ మేరకు మద్యాన్ని సరఫరా చేసింది. అమ్మకాలను పెంచే బాధ్యతను ఎక్సైజ్ అధికారులు, సిబ్బందిపై ఉంచింది. దీంతో అమ్మకాలు ఉన్నా లేకున్నా అధికారుల ఒత్తిడి మేరకు దుకాణదారులు పెద్దఎత్తున మద్యం నిల్వలు ఉంచారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు మద్యం దుకాణదారులకు చెంపపెట్టులా మారింది. చివరి మూడు నెలల పాటు వచ్చే కష్టనష్టాల నుంచి ప్రభుత్వం తమను ఒడ్డున పడేస్తుందని మద్యం వ్యాపారులు భావించారు. లైసెన్సుల కాలపరిమితి మరో మూడు నెలలు ఉండటంతో అప్పటివరకు వ్యాపారం చేయించుకోనిస్తారని ఆశించారు. వ్యాపారుల తరపున రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పోరాడుతుందని భావించారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. చివరి మూడు నెలలు ఎలాగోలా గడుపుకొద్దామని, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తారని భావించగా ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటోందని దుకాణదారులు వాపోతున్నారు. ఇదే తరుణంలో ఉరమని ఉరుముగా కొత్త లైసెన్స్‌లకు నోటిఫికేషన్ ఇచ్చే తేదీలను ప్రభుత్వం అనధికారికంగా తెలియచేసింది.