సర్కారీ గ‘మత్తు’
సర్కారీ గ‘మత్తు’
Published Sat, Mar 18 2017 10:41 PM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM
’సుప్రీం’ ఉత్తర్వుల నేపథ్యంలో మద్యం దుకాణాల తరలింపుపై దృష్టి
షిఫ్టింగ్ చార్జీల వసూలుకు కసరత్తు
20న నూతన మద్యం విధానం విడుదల
22 నుంచి మద్యం దుకాణాలకు నోటిఫికేషన్
తాడేపల్లిగూడెం :
ప్రజల అవసరాలను తీర్చడంలో వెనుక వరుసలో ఉండే ప్రభుత్వం కాసులు వచ్చే మార్గాలను వెతకడంలో మాత్రం ముందుంటోంది. జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండకూడదన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను సైతం ఆదాయ వనరుగా మార్చుకునే పనిలో సర్కారు నిమగ్నమైంది. జిల్లాలో మొత్తంగా 458 మద్యం దుకాణాలు ఉండగా.. వాటిలో 375 దుకాణాలను జాతీయ, ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వీటిని ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంగా మార్చాల్సి ఉంది. ఎక్సైజ్ శాఖ నిబంధనలను అనుసరించి ఆయా దుకాణాల యజమానులపై దుకాణం తరలింపు (షిఫ్టింగ్) చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పరిస్థితుల్లో మద్యం దుకాణానికి సంబంధించిన లైసెన్స్‌దారు దుకాణాన్ని మరో చిరునామాకు మార్చాల్సి వస్తే.. ఆ విషయాన్ని ఎక్సైజ్ శాఖకు తెలియజేసి వార్షిక లైసెన్స్ ఫీజుపై 1 శాతం మొత్తాన్ని షిఫ్టింగ్ చార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న 375 దుకాణాలను ఈ నెలాఖరులోగా దూరంగా తరలించడంతోపాటు వాటి నిర్వాహకుల నుంచి షిఫ్టింగ్ చార్జీల వసూలుకు ఏర్పాట్లు చేస్తోంది. కేటగిరీని బట్టి ఒక్కొక్క మద్యం షాపు నుంచి రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వార్షిక లైసెన్స్ ఫీజును ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఈ లెక్కన ప్రధాన రహదారి నుంచి తరలించాల్సిన ప్రతి మద్యం దుకాణ లైసెన్స్‌దారు నుంచి సగటున రూ.40 వేల వరకు వసూలు చేసే అవకాశం ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
మూడు నెలల ముందే ముచ్చట
మరోవైపు ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగియనుంది. అయితే.. ఇందుకు భిన్నంగా కొత్త లైసెన్స్‌లు ఇవ్వడానికి మూడు నెలల ముందుగానే ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈనెల 20న ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని విడుదల చేయనుంది. ఆ రోజు రాత్రికి మార్గదర్శకాలు విడుదల అవుతాయని సమాచారం. కొత్త విధానంలోనూ 24 నెలలకే లైసెన్స్‌లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు భోగట్టా. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త మద్యం దుకాణాలను జాతీయ రహదారి, రాష్ట్ర రహదార్లకు 500 మీటర్ల అవతల ఏర్పాటు చేస్తామని లైసెన్స్‌దారులు ప్రభుత్వానికి హామీ పత్రాలు రాసివ్వాల్సి ఉంటుంది. నూతన మద్యం పాలసీలో జిల్లావ్యాప్తంగా బార్లు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
వ్యాపారుల్లో గుబులు
లైసెన్స్ గడువు ముగియనున్న చివరి త్రైమాసికంలో మద్యం వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాక్‌ను వదిలించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో అమ్మకాలకు సంబంధించి లైసెన్స్‌దారులకు ఇబ్బడిముబ్బడిగా లక్ష్యాలను నిర్దేశించి ఆ మేరకు మద్యాన్ని సరఫరా చేసింది. అమ్మకాలను పెంచే బాధ్యతను ఎక్సైజ్ అధికారులు, సిబ్బందిపై ఉంచింది. దీంతో అమ్మకాలు ఉన్నా లేకున్నా అధికారుల ఒత్తిడి మేరకు దుకాణదారులు పెద్దఎత్తున మద్యం నిల్వలు ఉంచారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు మద్యం దుకాణదారులకు చెంపపెట్టులా మారింది. చివరి మూడు నెలల పాటు వచ్చే కష్టనష్టాల నుంచి ప్రభుత్వం తమను ఒడ్డున పడేస్తుందని మద్యం వ్యాపారులు భావించారు. లైసెన్సుల కాలపరిమితి మరో మూడు నెలలు ఉండటంతో అప్పటివరకు వ్యాపారం చేయించుకోనిస్తారని ఆశించారు. వ్యాపారుల తరపున రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పోరాడుతుందని భావించారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. చివరి మూడు నెలలు ఎలాగోలా గడుపుకొద్దామని, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తారని భావించగా ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటోందని దుకాణదారులు వాపోతున్నారు. ఇదే తరుణంలో ఉరమని ఉరుముగా కొత్త లైసెన్స్‌లకు నోటిఫికేషన్ ఇచ్చే తేదీలను ప్రభుత్వం అనధికారికంగా తెలియచేసింది.
Advertisement