Lingaraju Agraharam
-
వ్యక్తిపై మారణాయుధాలతో దాడి
జలదంకి : మండలంలోని లింగరాజు అగ్రహారంలో ఆదివారం పాతకక్షల నేపథ్యంలో కూకటి ప్రసాద్‌పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ప్రసాద్ తన గొర్రెలను చెరువు సమీపంలో మేపుకుంటుండగా అదే గ్రామానికి చెందిన మట్టెపు వెంకటేశ్వర్లు, తిరుమలరావు, రమేష్ విచక్షణ రహితంగా మారణాయుధాలతో ప్రసాద్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రసాద్‌కు తీవ్రగాయాలు కావడంతో ప్రత్యర్థులు పరారీ అయ్యారు. పక్కన పొలంలో ట్రాక్టర్‌తో పనిచేసుకుంటున్న వారు ప్రసాద్ పరిస్థితిని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రసాద్‌ను చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు, అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. దీనిపై జలదంకి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగలు హల్చల్... గ్రామస్తులు దేహశుద్ధి
నెల్లూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం లింగరాజు అగ్రహారంలో గత ఆర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలో పలు ఇళ్లలో వరుసగా చోరీలు చేసి పరారవుతున్న దొంగలను గ్రామస్తులు వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో దొంగలు.... గ్రామస్తులపై ఆయుధాలతో దాడి చేశారు. అక్కడి నుంచి వారు పరారైయ్యారు. గ్రామస్తులు వారిని వెంబడించి ఓ దొంగను పట్టుకున్నారు. మరో ముగ్గురు దొంగలు పరారైయ్యారు. దొరికిన దొంగను గ్రామస్తులు గ్రామంలోకి తీసుకువచ్చి చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన దొంగల సమాచారం కోసం పోలీసులు పట్టుబడిన దొంగను తమదైనశైలిలో విచారిస్తున్నారు.