త్వరలో ‘వందే సాధారణ్’ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లు విజయవంతం కావడంతో రైల్వే శాఖ సాధారణ ప్రజలకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకునే పూర్తి ఏసీతో ఉండే వందేభారత్ రైలు ఎక్కాలని సామాన్య జనానికి కోరిక ఉన్నా, రూ.1,600 టికెట్ ధర చూసి వారు వెనకడుగు వేస్తున్నా రు. మరింత సౌకర్యవంతంగా ఉండే ఎగ్జిక్యూటివ్ కోచ్ టికెట్ ధర ఏకంగా రూ.2,550 ఉండటంతో మామూలు ప్రయాణికులు అటు వైపు చూసే పరిస్థితి కూడా లేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అతి సాధారణ జనానికి కూడా కొంతమేర వందేభారత్ రైలు అనుభూతిని కలిగించేందుకు రైల్వే శాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మరో మూడు నెలల్లో నాన్ ఏసీ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. ‘వందే సాధారణ్’నాన్ ఏసీ రైలు కోచ్‌లను రైల్వే శాఖ వేగంగా సిద్ధం చేస్తోంది.
జనవరి నాటికి తొలి రైలు..
వందేభారత్ రైళ్లు విజయవంతం కావటంతో వాటిని మరింత అప్‌గ్రేడ్ చేసే పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రైళ్లు ఉదయం బయలుదేరి, మళ్లీ రాత్రి 12 వరకు తిరిగి వస్తున్నాయి. తాజాగా దూరప్రాంతాలకు కూడా తిరిగేలా స్లీపర్ వందేభారత్ రైళ్ల తయారీ ప్రారంభించిన రైల్వే, సమాంతరంగా నాన్ ఏసీ సాధారణ రైళ్లను కూడా తయారు చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో వచ్చే జనవరి నాటికి తొలి రైలు సిద్ధమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
మామూలు రైళ్లు తెరమరుగు..
శతాబ్ది రైళ్లను క్రమంగా తొలగించి వాటి స్థానంలో వందేభారత్ రైళ్లు నడుపుతారని సమాచారం. అలాగే కొత్తగా వచ్చే స్లీపర్ వందేభారత్ రైళ్లు రాజధాని రైళ్ల స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఇక సాధారణ సంప్రదాయ రైళ్లను దశలవారీగా తొలగిస్తూ వాటి స్థానంలో వందే సాధారణ్ రైళ్లను తిప్పే అవకాశం ఉందని చెపుతున్నారు.
వందే సాధారణ్ ప్రత్యేకతలు ఇవే..
♦ సంప్రదాయ నాన్ ఏసీ రైళ్లకు ఇవి కొంత భిన్నంగా ఉంటాయి. వందేభారత్ తరహాలో పుష్పుల్ పద్ధతిలో ముందు, వెనక ఇంజిన్లు ఉంటాయి.
♦ గరిష్టంగా 24 చొప్పున లింక్ హాఫ్మాన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లు ఉంటాయి.
♦ సంప్రదాయ రైళ్లలోని సీట్లతో పోలిస్తే వీటిల్లో మెరుగ్గా ఉంటాయి. ప్రతి బెర్త్ వద్ద చార్జింగ్ పాయింట్లు కూడా ఉంటాయి.
♦ వందేభారత్ రైళ్లలో ఉన్నట్టుగానే ప్రయాణికులకు కోచ్‌లలో అనౌన్స్మెంట్ స్క్రీన్లు, ఆడియో వ్యవస్థ ఉంటాయి.
♦ ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు. వందేభారత్ రైళ్ల లో ఉన్నట్టు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి.
♦ శుభ్రంగా ఉండేలా చూడటంతోపాటు చెడు వాసన రాకుండా బయో వాక్యుమ్ టాయి లెట్లు ఏర్పాటు చేస్తారు.