రాహుల్ అజేయ సెంచరీ
ఆధిక్యంలో సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్
న్యూఢిల్లీ: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (205 బంతుల్లో 168 బ్యాటింగ్; 18 ఫోర్లు; 2 సిక్సర్లు) అజేయ శతకంతో అదరగొట్టగా... మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (97 బంతుల్లో 80; 13 ఫోర్లు; 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 308 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం 32 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓపెనర్లు రాహుల్, ఉతప్ప చెలరేగడంతో తొలి వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.
ప్రస్తుతం క్రీజులో రాహుల్‌తో పాటు హైదరాబాద్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి (48 బంతుల్లో 38 బ్యాటింగ్; 7 ఫోర్లు) ఉన్నాడు. పంకజ్ సింగ్‌కు మూడు వికెట్లు పడ్డాయి. అంతకుముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 100 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వినయ్, ఓజా, అపరాజిత్లకు రెండేసి వికెట్లు దక్కాయి.