‘రేపిస్టు’ మంత్రిపై నాన్‌బెయిలబుల్ వారెంట్
లక్నో: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ వివాదాస్పద మంత్రి గాయత్రి ప్రజాపతి, మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు జారీచేసింది. ఆయన పాస్ పోర్టును నాలుగు వారాలపాటు ఆయన పాస్‌పోర్టుపై నాలుగువారాలపాటు నిషేధం విధించింది. మరోపక్క, అజ్ఞాతంలో వెళ్లిన ఆయనకోసం లుక్ ఔట్ నోటీసులు వేయాలని కూడా సర్క్యులర్ విడుదల చేశారు. తనపై, తన మైనర్ కూతురుపై ప్రజాపతి ఆయన సమూహం లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ కేసులు పెట్టిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆమె కూతురు ఆస్పత్రిలో కోలుకుంటోంది. తొలుత ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసులు పెట్టేందుకు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ కేసులో కదలిక ఏర్పడింది. సుప్రీం చెప్పిన అనంతరం కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమేథిలోని మంత్రి ఇంట్లో సోదాలు చేశారు. ఆయన అంతకుముందే లక్నో వెళ్లినట్టు తెలుసుకున్న పోలీసులు లక్నోలోని మంత్రి బంగ్లాకు వెళ్లగా అక్కడ కూడా ఆయన లేరు. మంత్రి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు లక్నో ఎస్పీ చెప్పారు. ఆయనను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఇప్పటికీ ఆయన జాడ తెలియకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది.
యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రజాపతిని మంత్రివర్గం నుంచి తొలగించారు. ములాయం విధేయుడైన ప్రజాపతిని ఆయన సూచన మేరకు అఖిలేష్ మళ్లీ కేబినెట్లో చేర్చుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపతి ఎస్పీ తరఫున అమేథి నుంచి పోటీ చేస్తున్నారు. అఖిలేష్ ఇటీవల అమేథికి ప్రచారానికి వెళ్లినపుడు ప్రజాపతిని వేదికపైకి అనుమతించలేదు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాపతిని అఖిలేష్ మంత్రివర్గంలో కొనసాగించడంపై ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.