న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష‍్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై దర్యాప్తు జరుగుతున్న వేళ విదేశీ ప్రయాణాలు చేపట్టకుండా లుక్‌ఔట్ నోటీసులు జారీ చేయటాన్ని తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ‘ మీరు చేయించిన దాడులు పూర్తిగా విఫలమయ్యాయి. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇప్పుడు నాకు మీరు లుక్‌ఔట్ నోటీసులు ఇచ్చారు. ఈ జిమ్మిక్కులు ఏమిటి మోదీ జీ? నేను ఢిల్లీలోనే ఉన్నాను. నేను ఎక్కడికి రావాలో దయచేసి చెప్పండి.’ అని పేర్కొన్నారు సిసోడియా.
భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీలు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు సిసోడియా. విద్యా, ఆరోగ్య రంగంలో మంచి పనితీరు కనబరుస్తూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న ఆమ్ ఆద్మీ పార్టీపై ఏజెన్సీలను ఉపయోగించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేశారన్నారు. రానున్న 2024 సాదారణ ఎన్నికల్లో భాజపాకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థిగా మారుతున్నారనే కారణంగా ఆయనని అడ్డుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. విదేశాలకు వెళ్లకుండా మనీశ్ సిసోడియాకు లుక్‌ఔట్ సర్క్యూలర్ జారీ చేసినట్లు వస్తున్న వార్తలను సీబీఐ వర్గాలు ఖండించాయి.
ఇదీ చదవండి: లిక్కర్ కుంభకోణంలో అసలు సూత్రధారి కేజ్రీవాల్: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment