పోలీసుల అదుపులో డిప్యూటీ సీఎం, 65 మంది ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీ సర్కార్ ఘర్షణ వైఖరి కొనసాగిస్తోంది. ఎమ్మెల్యే దినేష్ ను అరెస్ట్ చేయడంతో పాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కేసు పెట్టినందుకు నిరసనగా ఆప్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన బాటపట్టారు. ప్రధాని మోదీ ఎదుట సిసోడియా పోలీసులకు లొంగిపోతారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం ఉదయం సిసోడియాతో కలసి ఆప్ ఎమ్మెల్యేలు రేస్కోర్సు రోడ్డులోని ప్రధాని మోదీ అధికార నివాసానికి ర్యాలీగా బయల్దేరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు రేసుకోర్సు రోడ్డులో 144 సెక్షన్ విధించారు. సిసోడియాతో పాటు 65 మంది ఆప్ ఎమ్మెల్యేలు రేసుకోర్సు రోడ్డుకు వెళ్లకుండా తుగ్లక్ రోడ్డు సమీపంలో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
శనివారం సిసోడియా ఘజియాబాద్ మండిలో పర్యటించనపుడు తమను దూషించారంటూ వ్యాపారవేత్తలు ఆయనపై ఫిర్యాదు చేశారు. కాగా తనపై ఫిర్యాదు చేసినవారు మార్కెట్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఈ చర్యలు మానుకోకుంటే లైసెన్స్ రద్దు చేస్తానని వారిని హెచ్చరించినట్టు సిసోడియా చెప్పారు. ఈ కేసు విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. సురేందర్ గోస్వామి నుంచి తాము ఫిర‍్యాదు స్వీకరించామని, అయితే సిసోడియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు.