బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ... ఓ మద్యం కుంభకోణం | The story behind this liquor scam | Sakshi
Sakshi News home page

బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ... ఓ మద్యం కుంభకోణం

Published Mon, Feb 27 2023 3:54 AM | Last Updated on Mon, Feb 27 2023 8:07 AM

The story behind this liquor scam - Sakshi

ఢిల్లీ మద్యం కుంభకోణం. దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన వ్యవహారమిది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కి, కేంద్రంలోని అధికార బీజేపీకి మధ్య రగడ మరింత పెరగడానికి కారణమైన కేసు. దీనికి సంబంధించిన  అరెస్టుల పరంపరలో భాగంగా తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా పేరూ చేరింది. అంతేగాక ఈడీ తన రెండో చార్జిషీట్‌లో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరును కూడా ప్రస్తావించింది! ఇంతకీ ఈ మద్యం కుంభకోణం కథా కమామిషు ఏమిటి...?

ఢిల్లీలో మద్యం దుకాణాలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేది. అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2020లో నూతన మద్యం విధానాన్ని రూపొందించింది. 2021 నవంబర్‌లో దాన్ని అమల్లోకి తెచ్చింది. నూ తన విధానంలో పలు మార్పులు చేశారు. మద్యం అమ్మకాలను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించి, ప్రైవేట్‌ రిటైల్‌ వ్యాపారులకు కట్టబెట్టారు.

ఢిల్లీని 32 జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్‌లో 27 దుకాణాలున్నాయి. ఒక్కో మున్సిపల్‌ వార్డులో 2–3 చొప్పున దుకాణాలు ఏర్పాటు చేశారు. కొత్త పాలసీ ప్రకారం మద్యాన్ని వినియోగదారులకు ‘హోం డెలివరీ’ చేయొచ్చు. తెల్లవారుజామున 3 గంటల వరకూ దుకాణాలు తెరిచి ఉంచొచ్చు. వినియోగదారులకు అపరిమితంగా డిస్కౌంట్లు ఇవ్వొచ్చు. అలాగే గరిష్ట అమ్మకం ధర కూడా ఉండదు. డిమాండ్‌ను బట్టి ఏ ధరకైనా అమ్ముకోవచ్చు. 

ఇలా బయటపడింది... 
2022 ఏప్రిల్‌లో ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వచ్ఛిన నరేశ్‌ కుమార్‌ కొత్త మద్యం విధానం ఫైళ్లను క్షుణ్నంగా అధ్యయనం చేశారు. ‘‘విధానం రూపకల్పన, అమల్లో అక్రమా లు చోటుచేసుకున్నాయి. ప్రైవేట్‌ వ్యక్తులకు అనుచిత లబ్ధి చేకూర్చారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది’’ అని తేల్చారు.

ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక రూపొందించారు. విషయాన్ని అప్పట్లో ఎక్సైజ్‌తో పాటు 19 శాఖలను నిర్వహిస్తున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, మనీశ్‌ సిసోడియా దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్‌ నివేదికపై అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్పందించారు. మద్యం విధానంపై సీబీఐ విచారణకు 2022 జూలైలో ఆదేశాలు జారీ చేశారు. తర్వాత కొన్ని రోజులకే కొత్త విధానాన్ని రద్దు చేస్తున్నామని, పాత మద్యం విధానాన్నే అమలు చేస్తామని కేజ్రీవాల్‌ సర్కారు ప్రకటించింది.

సీబీఐ దర్యాప్తు మాత్రం కొనసాగింది. సిసోడియాతో పాటు ఢిల్లీ ఎక్సైజ్‌ అధికారులు, ప్రైవేట్‌ మద్యం వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. 2022 ఆగస్టు 19న ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ చేర్చింది. తర్వాత కేసు దర్యాప్తును ఈడీ చేపట్టింది. 

సీఎస్‌ నివేదికలో ఏముందంటే... 
కొత్త మద్యం విధానం పేరిట మద్యం వ్యాపారంలో గుత్తాధిపత్యానికి తెరతీశారు. కొత్త విధానంలోని నిబంధనలనూ ఉల్లంఘించి కొన్ని కంపెనీలకు మద్యం లైసెన్సులు కట్టబెట్టారు. ఎల్‌జీ అనుమతి లేకుండానే విధానంలో సిసోడియా మార్పులు చేశారు.

కరోనా వ్యాప్తి సాకుతో ప్రైవేట్‌ వ్యాపారులు చెల్లించాల్సిన రూ.144.36 కోట్ల లైసెన్స్‌ ఫీజును ఆయన మాఫీ చేశారు. పైగా ఒక్కో బీర్‌ కేసుపై చెల్లించాల్సిన రూ.50 ఇంపోర్ట్‌ పాస్‌ ఫీజునూ తొలగించారు. పైగా ప్రైవేట్‌ వ్యక్తులకు మేలు చేయడమే లక్ష్యంగా విదేశీ మద్యం ధరలను ఇష్టారాజ్యంగా సవరించారు. 

ఎఫ్‌ఐఆర్‌లో ఏముందంటే... 
మద్యం వ్యాపారుల నుంచి లంచాలు తీసుకొని అక్రమంగా ఎల్‌–1 లైసెన్సులు జారీ చేశారు. సిసోడియా సన్నిహితుడైన దినేశ్‌ అరోరాకు చెందిన రాధా ఇండస్ట్రీస్‌ బ్యాంకు ఖాతాకు ఇండో స్పిరిట్స్‌ సంస్థ ఎండీ సమీర్‌ మహేంద్రు కోటి రూపాయలు బదిలీ చేశారు. ఎల్‌–1 లైసెన్సులు పొందినవారు రిటైల్‌ వ్యాపారులకు క్రెడిట్‌ నోట్లు జారీ చేశారు. వీటిద్వారా ప్రజాప్రతినిధులకు ముడుపులు చేరవేయడమే వారి ఉద్దేశం.

ఈ అక్రమాలు, లంచాల బాగోతం బయటపడకుండా లైసెన్స్‌దారులు తమ ఖాతా పుస్తకాల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారు. మద్యం వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేసి ప్రజాప్రతినిధులకు చేరవేయడంలో సిసోడియా సన్నిహితులు అమిత్‌ అరోరా, దినేశ్‌ అరోరా, అర్జున్‌ పాండే కీలకంగా వ్యవహరించారు. సమీర్‌ మహేంద్రు నుంచి అర్జున్‌ పాండే 2 నుంచి 4 కోట్ల దాకా వసూలు చేశారు.

ఎల్‌–1 లైసెన్స్‌ పొందిన మహాదేవ్‌ లిక్కర్స్‌ ప్రతినిధి సన్నీ మార్వాకు ఢిల్లీ ప్రభుత్వాధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. వారికి తరచుగా లంచాలు ఇస్తుంటాడని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. కొత్త మద్యం విధానం వల్ల ఢిల్లీ ఖజానాకు రూ.8,000 మేర నష్టం వాటిల్లిందని బీజేపీ ఎంపీ మనోజ్‌ ఆరోపించారు. కుంభకోణం విలువ రూ.10,000 కోట్లకు పైగానే ఉంటుందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా ఆరోపించడం తెలిసిందే. 


– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement