2021లో కొత్త విధానాన్ని తెచ్చిన ఢిల్లీ సర్కారు
మద్యం షాపుల లైసెన్సులు, ఎక్సైజ్, వ్యాట్‌లలో భారీగా రాయితీలు... ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఇప్పుడు కల్వకుంట్ల కవిత వంటి ప్రముఖుల అరెస్టులతో ఢిల్లీ లిక్కర్ విధానం కేసు కలకలం రేపుతోంది. అసలు ఈ కేసు ఏమిటన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది.
అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్‌సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్‌ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది.
దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి.
రూపకల్పన నుంచే అక్రమాలంటూ..
ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్ నేతలకు రూ.వందల కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషిట్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ.. తాజాగా అరెస్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment