lookout
-
భాయ్ ముంబైలో అడుగుపెట్టారు!
రజనీకాంత్ కెరీర్లో గుర్తుంచుకోదగ్గ చిత్రాల్లో ‘బాషా’ ఒకటి. పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ముంబైలో ‘మాణిక్ బాషా’గా కనిపించారు రజనీకాంత్. బాషా భాయ్‌గా రజనీ నటన, స్టయిల్ని మరచిపొలేం. ఇప్పుడు మొయుద్దీన్ భాయ్‌గా రజనీ కనిపించనున్న చిత్రం ‘లాల్ సలామ్’. ముంబై బ్యాక్‌డ్రాప్ ఉన్న ఈ చిత్రాన్ని రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రజనీ చేస్తున్న మొయుద్దీన్ భాయ్ పాత్ర కీలకం. ‘అందరి ఫేవరెట్ అయిన భాయ్ మళ్లీ ముంబైలో అడుగుపెట్టారు’ అంటూ ఆయన లుక్‌ని సోమవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ చిత్రంలో రజనీకాంత్ రాకింగ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించనున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: విష్ణు రామస్వామి. -
దీర్ఘాలోచనలో శ్రద్ధా శ్రీనాథ్.. డిసెంబర్ 22న తెలుస్తుంది
క్యాబ్‌లో వెళుతోంది మనోజ్ఞ. కారులోనే లంచ్ ముగించాలనుకుంది. బాక్స్ ఓపెన్ చేసింది కానీ ఏదో దీర్ఘాలోచనలో పడింది. ఏ విషయం గురించి మనోజ్ఞ ఆలోచిస్తోందో ‘సైంధవ్’ చిత్రంలో తెలుస్తుంది. వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు మనోజ్ఞ. ఈ పాత్రను పరిచయం చేస్తూ, శనివారం లుక్‌ని విడుదల చేశారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. ‘‘ఇప్పటివరకూ శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్రల్లో మనోజ్ఞ బెస్ట్ అని చెప్పొచ్చు. నటనకు పూర్తిగా అవకాశం ఉన్న పాత్ర ఆమెది’’ అని చిత్రబృందం పేర్కొంది. హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగు తెరకు పరిచయంకానున్న ఈ చిత్రం దక్షిణాది భాషల్లోను, హిందీలోనూ డిసెంబర్ 22న విడుదల కానుంది. -
వాట్సాప్ చాట్ విడుదల, మూత్ర విసర్జన ఘటనలో శంకర్ మిశ్రాను ఇరికించారా?
ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు శంకర్ మిశ్రాపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు ఎయిరిండియా విమానం చెల్లించే నష్టపరిహారం కోసమే సదరు వృద్ధ మహిళ ఇలా చేస్తున్నట్లు మిశ్రా ఆరోపిస్తున్నారు. అందుకు ఆధారాలు ఉన్నాయంటూ శంకర్ మిశ్రా - వృద్ధ మహిళ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను మిశ్రా తరుపు వాదిస్తున్న లాయర్లు విడుదల చేశారు. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ కంపెనీ వెల్స్ ఫార్గోలో శంకర్ మిశ్రా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే విదేశాల్లో స్థిరపడ్డ మిశ్రా భారత్‌కు వచ్చేందుకు న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఎక్కాడు. అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న మిశ్రా విచక్షణ కోల్పోయి పక్కసీట్లో ఉన్న వృద్ధ మహిళ దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. అనంతరం తాను చేసింది క్షమించరాని నేరమని, పోలీసులకు ఫిర్యాదు చేయొద్దంటూ బాధితురాల్ని వేడుకున్నాడు. ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. డబ్బుల కోసమే ఇదంతా కానీ జనవరి 4న ఎయిరిండియా సంస్థ మిశ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పీ-గేట్ వ్యవహారంలో శంకర్ మిశ్రా సైతం తన లాయర్లు ఇషానీ శర్మ, అక్షత్ బాజ్‌పాయ్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. శంకర్ మిశ్రా - మహిళ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను బహిర్ఘతం చేశారు. ఆ వాట్సాప్ చాట్ వివరాల మేరకు.. నవంబర్ 28న నిందితుడు బాధితురాల్ని బట్టలు, ఇతర బ్యాగ్‌లను శుభ్రం చేసి నవంబర్ 30న డెలివరీ చేసినట్లు చెప్పారు. అంతేకాదు సదరు మహిళ ప్రయాణికురాలు మిశ్రా మూత్ర విసర్జన చేశాడనే కారణం కాదని, కేవలం ఎయిరిండియా ఎయిర్‌లైన్ చెల్లించే నష్టపరిహారం కోసమే డిసెంబర్ 20న ఫిర్యాదు చేసినట్లు మిశ్రా లాయర్లు ఆరోపిస్తున్నారు. డబ్బు కూడా పంపించాడు తాను చేసిన తప్పును సరిద్దిద్దుకునేందుకు..మహిళ కోరినట్లుగా అంటే నవంబర్ 28న మిశ్రా పేటీఎమ్ ద్వారా డబ్బు చెల్లించాడు. అయితే దాదాపు నెల రోజుల తర్వాత డిసెంబర్ 19న ఆ మహిళ కుమార్తె డబ్బును తిరిగి ఇచ్చిందని లాయర్లు పేర్కొన్నారు. ఎయిరిండియా క్యాబిన్ సిబ్బంది సమర్పించిన వాంగ్మూలాల్లో కూడా ఇద్దరి మధ్య రాజీ కుదిరిందన్న విషయాన్ని ధృవీకరించినట్లు గుర్తు చేశారు. నా ఇష్టానికి విరుద్దంగా మూత్ర విసర్జన సంఘటన తర్వాత ఎయిరిండియా సిబ్బంది మిశ్రాను తన వద్దు తీసుకువచ్చారని విమానయాన సంస్థకు చేసిన ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. శంకర్ మిశ్రాను ల్యాండింగ్‌లో వెంటనే అరెస్టు చేయాలని తాను డిమాండ్ చేసినప్పటికీ, అతనితో క్షమాపణలు చెప్పించేలా క్రూ సిబ్బంది నా ఇష్టానికి విరుద్ధంగా అతనిని నా వద్దకు తీసుకొచ్చారని మహిళ ఫిర్యాదులో రాసింది. ఏడ్చాడు.. ప్రాధేయ పడ్డాడు మూత్ర విసర్జన చేసిన వెంటనే మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని కాళ్లపై పడ్డాడు. మీరు చేసింది క్షమించరాని నేరం అని మిశ్రాను అనడంతో ఏడుస్తూ ప్రాధేయపడ్డాడని, మిశ్రా చర్యతో షాక్ గురైనట్లు ఎయిరిండియాకు చేసిన ఫిర్యాదులో వెల్లడించింది. అతనిని అరెస్టు చేయాలని పట్టుబట్టడం, విమర్శలు చేయడం నాకు కష్టంగా అనిపించిందని తెలిపింది. ఇక ఆమె షూస్, డ్రైక్లీనింగ్ కోసం డబ్బులు తీసుకునేలా ఎయిర్‌లైన్ సిబ్బంది ఆమె ఫోన్ నంబర్‌ను శంకర్ మిశ్రాకు పంపింది. మిశ్రాకు ఇచ్చే డబ్బుల్ని సైతం తిరిగి వద్దని చెప్పినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
అందాల మోహిని
బాలీవుడ్ బ్యూటీ రుహీ సింగ్ ‘మోసగాళ్లు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ఇది. ఇందులో విష్ణు సరసన రుహీ సింగ్ నటించారు. ఆమె పాత్ర పేరు మోహిని. ఈ సినిమాలో రుహీ గ్లామరస్‌గా కనిపిస్తారని గురువారం విడుదల చేసిన మోహిని లుక్ స్పష్టం చేస్తోంది. హాలీవుడ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ (2012)తో కెరీర్‌ను ప్రారంభించిన రుహీ సింగ్ తర్వాత హిందీలో ‘క్యాలండర్ గర్ల్స్’, ‘ఇష్క్ ఫరెవర్’ చిత్రాల్లో నటించారు. ‘మోసగాళ్లు’తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న రుహీ సింగ్ ‘ఈ సినిమాలో నటించడం చాలా కిక్ ఇచ్చింది. మోహిని పాత్ర చేయడం చాలా సరదాగా అనిపించింది’ అన్నారు. -
ఏకాంబరం
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’. కిశోర్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తోన్న రెండో చిత్రమిది. సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సోమవారం (జూలై 27) సాయికుమార్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ఆయన పాత్ర ఏకాంబరం లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: జె. యువరాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. -
సేద్యానికి శ్రీకారం
గళ్ల లుంగీ కట్టి తువ్వాలు భుజాన వేసి ఉదయాన్నే పొలానికి బయలుదేరి సేద్యానికి శ్రీకారం చుట్టారు శర్వానంద్. మరి ఏం పండించబోతున్నారో స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో శర్వానంద్ రైతు పాత్రలో నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. ముందుగా శర్వానంద్ లుక్‌ను విడుదల చేశారు. గ్రామీణ యువకుడిగా లుంగీ గెటప్‌లో శర్వానంద్ కొత్తగా కనిపిస్తున్నారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, మాటలు: సాయి మాధవ్ బుర్రా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. -
మా ప్రపంచంలోకి రండి
సాహో ప్రపంచం ఎలా ఉండబోతోందో చూపించడానికి మేం రెడీ అయ్యాం అంటోంది చిత్రబృందం. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయిక. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను ఈనెల 13న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. సినిమాలోని శ్రద్ధా కపూర్ లుక్‌ను విడుదల చేశారు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, ఎవలిన్ శర్మ, లాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. -
హత్యకేసులో నటి శృతి చంద్రలేఖ కోసం గాలింపు
తిరువొత్తియూరు : నటుడు పీటర్ ప్రిన్స్ హత్య కేసులో నటి శృతి చంద్రలేఖ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ కేసులో పోలీసులు ముఖ్య నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. నెల్లై జిల్లా పరప్పాడికి చెందిన రొనాల్డ్ పీటర్ ప్రిన్స్ (35) కొన్ని సినిమాల్లో సహాయ నటుడిగా నటించాడు. ఇతనికి బెంగళూరుకు చెందిన నటి శృతి చంద్రలేఖతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు చెన్నై మదురవాయల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. జనవరి 13న నెల్లైకి వచ్చి అక్కడి నుంచి చెన్నైకి వస్తున్న పీటర్ ప్రిన్స్ హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. ఫిబ్రవరి 1వ తేదీ ఆయన కనబడలేదని శృతి మదురవాయల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాగే తన తమ్ముడు కనబడలేదని పీటర్ ప్రిన్స్ సోదరుడు జస్టిన్ పాళయంకోట్టై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీ సులు జరిపిన విచారణలో శృతి, కిరాయి ముఠా ద్వారా పీటర్‌ను హత్య చేసి పాళయంకోటైలో పాతిపెట్టినట్లు తెలిసింది. దీనికి సంబంధించి కిరాయి ముఠాకు చెందిన ఆన్సట్రాజ్, గాంధిమదినాథన్ రబీక్ ఉస్మాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారు అందించిన సమాచారం మేరకు ఆశీర్వాద నగర్లో పాతిపెట్టిన పీటర్ ప్రాన్సెస్ మృతదేహాన్ని తవ్వి బయటకు తీసి శవ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఈ కేసులో ముఖ్య నిందితుడైన జాన్ ప్రిన్సెస్‌ను పాళయంకోట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జాన్‌ప్రిన్సెస్ పోలీసులకు అం దించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాను, పీటర్, ఉమాచంద్రన్ కలిసి ఆన్లైన్ వ్యాపారంలో నగదు డిపాజిట్ చేశామని, అయితే అందులో నష్టం రావడంతో పీటర్ తమని వదలి బెంగళూరుకు వెళ్లి కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలిపాడు. అనంతరం నటి శృతితో పీటర్‌కు పరిచయం ఏర్పడి మదురవాయల్‌లో కాపురం పెట్టారు. ఈ క్రమంలో పీటర్‌కు మరికొంతమంది యువతులతో పరిచయం ఏర్పడింది. దాంతో పీటర్, శృతిల మధ్య విభేదాలు వచ్చాయి. పీటర్‌కు చెందిన కోట్ల రూపాయలు దక్కించుకోవాలని శృతి పథకం వేసింది. దీనికి శృతి తమను ఆశ్రయించినట్లు జాన్ ప్రిన్సెస్ తెలిపాడు. తాముకూడా పీటర్ వల్ల నష్టపోవడంతో అతన్ని కిడ్నాప్ చేసి పాలులో విషం కలిపి ఇచ్చి తరువాత విషం కలిపిన ఇంజెక్షన్ వేసినట్లు వెల్లడించాడు. అనంతరం అతని గొంతును నైలాన్ దారంతో బిగించి హత్య చేశామన్నాడు. ఆ తర్వాత ఉమాచంద్రన్, ఆన్‌స్టడ్ రాజ్ సాయంతో పీటర్ మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి ఆశీర్వాదం అనే ప్రాంతంలో పాతి పెట్టినట్టు తెలిపాడు. కాగా ఈ కేసులో పరారీలో వున్న ఉమాచంద్రన్, నటి శృతి చంద్రలేఖ, నిర్మల తదితరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.