విషాదం.. ఆస్కార్ విజేత లూయిస్ గోసెట్ కన్నుమూత
హాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. అమెరికన్ ప్రముఖ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత లూయిస్ గోసెట్ జూనియర్ (87) కాలిఫోర్నియాలో కన్నుమూశారు. లూయిస్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించినట్లుగా హాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇక 1936లో లూయిస్ గోసెట్ సీనియర్, హెలెన్ రెబక్కా దంపతులకు మే 27న న్యూయార్క్‌లో జన్మించారు లూయిస్ గోసెట్ జూనియర్. చిన్నతనంలోనే లూయిస్‌కు నటన పట్ల ఆసక్తి ఉండేది. అలా 17ఏళ్ల వయసులోనే రంగస్థల నటుడిగా మారాడు లూయిస్. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు.
‘ఎ రైసిన్ ఇన్ ది సన్, ది బ్లాక్స్, ది పనిషర్, స్కిన్గేమ్’ వంటి సినిమాల్లో నటించారు. ‘ది బుక్ ఆఫ్ నీగ్రోస్’ వంటి టెలివిజన్ సిరీస్‌లలో కూడా నటించారు లూయిస్. ఇక 1982లో వచ్చిన ‘యాన్ ఆఫీసర్ అండ్ ఏ జెంటిల్‌మేన్’ సినిమాలోని నటనకుగాను 55వ ఆస్కార్ అవార్డ్స్‌లో లూయిస్ ఉత్తమ సహాయనటుడు విభాగంలో అవార్డు అందుకున్నారు. కాగా ఈ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి నల్లజాతి నటుడు లూయిస్నే అని హాలీవుడ్ సమాచారం. అలాగే ఇదే సినిమాకు ఉత్తమ సహాయ నటుడు విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా దక్కించుకున్నారు. 1977లో వచ్చిన మినీ సిరీస్ ‘రూట్స్’లోని నటన లూయిస్‌కి మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు ఎమ్మీ అవార్డు కూడా అందుకునేలా చేసింది.