సీఎం గారూ.. లొంగిపోతే చర్యలుండవు: హైకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగు వారాల్లోగా అమేథి జిల్లాలోని కోర్టులో లొంగిపోవాలని, అలా చేస్తే ఆయనపై కఠిన చర్యలు ఉండబోవని అలహాబాద్ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. అమేథి జిల్లాలోని ఓ దిగువ కోర్టులో కేజ్రీవాల్ మీద క్రిమినల్ కేసు పెండింగులో ఉంది. ఈ కేసులో హాజరు కావాలంటూ ఆ కోర్టు ఈనెల 12న ఇచ్చిన ఉత్తర్వులను కేజ్రీవాల్ హైకోర్టులో సవాలు చేశారు. దానిపై జస్టిస్ ఏఎన్ మిట్టల్ నేతృత్వంలోని లక్నో బెంచి తాజా ఆదేశాలు జారీచేసింది. ఈ పిటిషన్ మీద గురువారమే విచారణ ముగియగా, శుక్రవారం నాడు కోర్టు తన రూలింగ్ వెలువరించింది. అసలు అమేథీ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలని కేజ్రీవాల్ కోరారు. తొలుత అమేథీ కోర్టులో వ్యక్తిగత హాజరును మినహాయించాలని అక్కడే కోరగా, ఆ కోర్టు దాన్ని డిస్మిస్ చేసింది.
అయితే.. నాలుగు వారాల్లోగా ముఖ్యమంత్రి కోర్టు ఎదుట లొంగిపోయి, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే, దాన్ని పరిగణనలోకి తీసుకుంటారని, చట్టప్రకారం ఆ కేసును విచారిస్తారని హైకోర్టు లక్నో బెంచి తెలిపింది. అమేథీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో చట్టాన్ని ఉల్లంఘించినట్లు అసలెక్కడా లేదని వ్యాఖ్యానించింది. అసలు మొత్తం కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరరాని, అయితే అలా స్టే ఇచ్చేందుకు తగిన కారణాలు ఏవీ ఆ కోర్టుకు కనిపించలేదని హైకోర్టు చెప్పింది.