ఆర్టీసీలో స్మార్ట్‌కార్డులు
సాక్షి, హైదరాబాద్: సిటీబస్సుల్లో స్మార్టుకార్డులను ప్రవేశపెట్టేందుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రణాళిక లను సిద్ధం చేసింది. రోజువారీ టికెట్లు, నెలవారీ బస్‌పాస్‌లను కూడా ఇక నుంచి స్మార్ట్‌కార్డుల రూపంలో అందజేయనున్నారు. ప్రయాణికులు తమ అవసరం మేరకు కార్డులను కొనుగోలు చేయవచ్చు. జేబులో నగదు లేకపోయినా సరే ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా సిటీబస్సుల్లో పయనించేందుకు స్మార్టుకార్డులు ప్రీపెయిడ్ తరహాలో ఉపయోగపడతాయి. జీపీఎస్ విధానంతో బస్సుల ట్రాకింగ్, బస్స్టేషన్లలో వైఫై ఐటీ ఆధారిత సేవలను ఏర్పాటు చేసిన ఆర్టీసీ.. ప్రస్తుతం మరో అడుగు ముందుకేసి టికెట్లెస్, క్యాష్‌లెస్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ముంబైలో బస్‌పాస్‌లకు మాత్రమే పరిమితమైన స్మార్ట్‌కార్డు సదుపాయాన్ని గ్రేటర్లో బస్‌పాస్‌లతో పాటు డైలీ టికెట్లకు కూడా విస్తరించనున్నారు.
నగరంలోని మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు, మెట్రో డీలక్స్‌లు, మెట్రో ఎక్స్ప్రెస్ల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి ఆ తరువాత అన్ని బస్సుల్లో ఈ సదుపాయాన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. ఈ మేరకు స్మార్ట్‌కార్డుల పనితీరును త్వరలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా పరిశీలించి, ప్రయాణికులకు అందుబాటులోకి తేవడానికి కొంత సమయం పట్టవచ్చునని ఆయన తెలిపారు. అలాగే నగరానికి వచ్చే పర్యాటకులు, సందర్శకులు సైతం తమ ప్రయాణ అవసరాన్ని బట్టి రూ.50, రూ.100 మొదలుకొని రూ.1,000 ల విలువైన కార్డులను కూడా కొనుగోలు చేయవచ్చు.
కండక్టర్ వద్ద కొనుక్కోవచ్చు
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే స్మార్ట్‌కార్డులలో మైక్రో చిప్‌లు ఏర్పాటు చేస్తారు. ఆ కార్డు విలువ అందులో నమోదై ఉంటుంది. ప్రస్తుతం కండ క్టర్ల వద్ద ఉన్న టికెట్ ఇష్యూయింగ్ (టిమ్స్) మిషన్లకు స్మార్ట్‌కార్డులను కూడా స్వీకరించే మరో ఆప్షన్‌ను ఇస్తారు. ప్రయాణికులు పయనించిన దూరానికి చెల్లించవలసిన చార్జీలు స్మార్ట్‌కార్డు నుంచి నేరుగా ఆర్టీసీ ఖాతాలో జమ అయ్యే విధంగా ఈ టిమ్స్ యంత్రాలను అనుసంధానం చేస్తారు. నగరంలోని బస్‌పాస్ కౌంటర్లతో పాటు, కండక్టర్ల వద్ద కూడా స్మార్ట్‌కార్డులు లభిస్తాయి. స్మార్ట్‌కార్డులు వద్దనుకున్నవాళ్లు సాధారణ టికెట్లపైన ప్రయాణం చేయవచ్చు.ప్రస్తుతం బస్‌పాస్‌ల కోసం కౌంటర్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. రద్దీ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్మార్ట్‌కార్డులు అందుబాటులోకి వస్తే ఇలాంటి పడిగాపులు ఉండవు. క్షణాల్లో డబ్బులు చెల్లించి కార్డులు కొనుగోలు చేయవచ్చు.