ఈ పురుగుతో జాగ్రత్త సుమీ!
అనకాపల్లి (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్ని తొలకరి జల్లులు పలకరిస్తున్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు అనేక చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. వడగాలులు వీస్తూనే ఉన్నాయి. వాతావరణంలో చోటుచేసుకునే ఇలాంటి మార్పులు పంటలపై ప్రభావం చూపడం సహజమే అయినప్పటికీ దీర్ఘకాలిక పంటలపై ఆ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జనవరిలో నీటి వసతి కింద వేసిన చెరకు పంటలో కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ పురుగు నివారణకు రైతులు ఎప్పటికప్పుడు సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త (చెరకు) డాక్టర్ ఎం.భరతలక్ష్మి.
ఆ వివరాలు...
బెడద పెరుగుతోంది
చెరకు పంటను సుమారు 100 రకాల కీటకాలు ఆశిస్తున్నప్పటికీ కొన్ని మాత్రమే అధిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది పీక/కాండం తొలుచు పురుగు. ఇటీవలి కాలంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పుల కారణంగా ఈ పురుగుల తాకిడి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఈ పురుగుపై రైతులు సరైన అవగాహన ఏర్పరచుకుని, సమగ్ర చర్యల ద్వారా వాటిని నివారించగలిగితే దిగుబడి, రస నాణ్యతలో ఏర్పడే నష్టాన్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. పైరు తొలి దశలో ఉన్నప్పుడు దీనిని పీక పురుగు అంటారు. పైరు కణుపులు వేసిన తర్వాత ఆశిస్తే దానిని కాండం తొలుచు పురుగు అంటారు. గత 3-4 సంవత్సరాలుగా ఈ పురుగు జూలై నుంచి చెరకు పైరుపై దాడి చేస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తూనే ఉంది.
ఎలా నష్టపరుస్తుంది?
తల్లి పురుగు 3-4 రోజుల పాటు జీవిస్తుంది. ఒక్కో పురుగు ఆకుల అడుగు భాగాన, మధ్య ఈనెకు సమాంతరంగా, 2-3 వరుసల్లో 400కు పైగా తెల్లని గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుంచి బయటికి వచ్చే పిల్ల పురుగులు ఐదారు రోజుల్లో ఆకులు, ఆకు తొడిమల్ని ఆశిస్తాయి. వాటిపై ఉండే పచ్చని పదార్థాన్ని గోకి తింటాయి. ఆ తర్వాత అవి క్రమేపీ లేత కణుపుల్లోకి చొచ్చుకుపోయి లోపలి పదార్థాన్ని తినేస్తాయి. దీనివల్ల కణుపులపై రంధ్రాలు ఏర్పడతాయి. పురుగు ఆశించిన కణుపులు గట్టిపడి, లోపలి కణజాలం ఎర్రబడుతుంది.
గొంగళి పురుగులు కింది భాగం నుండి పై భాగం వరకు గడను తొలుచుకుంటూ పోవడం వల్ల మొవ్వులు ఎండిపోతాయి. గొంగళి పురుగులు కోశస్థ దశలోకి ప్రవేశించే ముందు కాండం నుంచి బయటికి వస్తాయి. అవి ఆకు తొడిమల దగ్గర కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత 7-10 రోజుల్లో రెక్కల పురుగులు బయటికి వస్తాయి. పురుగు ఆశించిన చెరకు తోటలో దిగుబడి, రసంలో పంచదార శాతం తగ్గిపోతాయి.
ఏం చేయాలి?
పీక/కాండం తొలుచు పురుగుల నివారణకు సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైన తోటల నుంచి మాత్రమే విత్తన ముచ్చెలు సేకరించాలి. నత్రజని ఎరువును సిఫార్సు చేసిన మోతాదులో, సకాలంలో వాడాలి. సమయం దాటితే నత్రజనిని వాడకూడదు. ఆలస్యంగా వచ్చిన పిలకల్ని (వాటర్ షూట్స్) తీసేయాలి. ఈదురుగాలులకు పడిపోకుండా మొక్కలకు జడచుట్లు వేసి నిలగట్టాలి. తోటలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మురుగు నీటిని ఎప్పటికప్పుడు బయటికి పంపాలి. చెరకు తోటలో కాండం తొలుచు పురుగుల్ని నిర్మూలించడానికి ఎకరానికి 10 చొప్పున లింగాకర్షక బుట్టల్ని అమర్చాలి.
పైరు 120 రోజుల దశలో ఉన్నప్పటి నుంచి వాటిని గాలి వీచే దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి 30 రోజులకు ఒకసారి వాటిలోని ఎరల్ని మార్చాలి. గడల కింది ఆకుల్ని రెలవాలి. ఆ తర్వాత లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ చొప్పున కలిపి 15 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. లేకుంటే ఎకరానికి 20 వేల చొప్పున ట్రైకోగామా ఖిలోనిస్ గుడ్ల పరాన్నజీవుల్ని తోటలో వదలాలి. పైరు 120 రోజుల దశకు చేరుకున్నప్పటి నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి చొప్పున ఆరుసార్లు వీటిని తోటలో వదలాల్సి ఉంటుంది.