M. Ramesh Kumar
-
అతడు - ఆమె... ఇతడు - ఈమె
కథ ఎనిమిది గంటలప్పుడు ఎవడో ఎదురుగా వున్న స్టాల్లో న్యూస్‌పేపర్ కొంటున్నాడు. ఇంటికెళ్ళేవరకూ ఆగలేను అన్నట్టు అక్కడే పేపర్ విప్పి చదివేస్తున్నాడు. నిన్నటికీ ఇవాళ్టికీ మధ్య దేశమేమైపోయిందా అన్న ఆతృత కాబోలు. ఎదురుగా వస్తున్నవాడు సెల్ఫోన్లో మాట్లాడుతూ పెద్దగా నవ్వుతున్నాడు. అంతగా నవ్వే విషయం ఏవుందో మరి..!? ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి వున్నారు. చూడబోతే నేను తప్ప అందరూ ఆనందంగానే వున్నట్టున్నారు. ఛీ.. వెధవ జీవితం..! నేనే ఎందుకిలా ఉసూరంటూ ఏడుస్తున్నానో అర్థంకావడం లేదు. అజంతా హోటల్లోకి దారితీశాను. ఆహా..! ఇక్కడ ఇడ్లీ తినేసింతర్వాత చచ్చిపోయినా ఫర్లేదనిపించింది. టిఫిన్ ముగించి బైటికొచ్చాను. ఇప్పుడేం చేద్దాం..? ఆలోచించాను. కాసేపు ఒంటరిగా వుండాలి. ఒంటరిగా.. ప్రశాంతంగా.. ఏ వెధవా పలకరించకుండా వుండాలి. ఆటో ఎక్కి పార్క్‌కి చేరుకున్నాను. ఉదయం ఫూట గాబట్టి నేననుకున్నట్టే పార్క్‌లో జనం లేరు. ఏవేవో గుర్తుకొస్తున్నాయి. శరత్గాడు వాడి భార్య అంజలి.. ఆ జంటని తల్చుకుంటే ఆశ్చర్యంగా వుంటుంది. ఎలాంటి అరమరికలు, భేదాభిప్రాయాలు లేకుండా అంత అన్యోన్యంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఎలా వుండగలుగుతున్నారో..?! నాకెందుకు ఇలా అయింది? లోపం ఎక్కడుంది..? ఇంకెక్కడ.. కచ్చితంగా నాలోనే! నేనే అంతటికీ కారణం. ఎవరో సైకాలజిస్టు చెప్పాడట. భార్య కాఫీ ఇచ్చినప్పుడు ‘థాంక్స్’ అనే చిన్నమాట ఉపయోగిస్తే చాలు.. ఆమె ఎంతో సంతోషిస్తుందట. మంచి భోజనం పెట్టినప్పుడు ‘ఈరోజు నీ చేతి వంట అద్భుతం’ అంటే ఆమె పడిన కష్టాన్నంతా మర్చిపోయి ఉప్పొంగిపోతుందట. భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న విషయాలే వారి బంధం గట్టిపడ్డానికి ఎంతో సహకరిస్తాయట. మరి నేనెప్పుైడనా మా ఆవిడకి థాంక్స్ చెప్పానా..? చెప్పినట్టు గుర్తులేదు. అదలా వుంచితే ఒకరి పుట్టినరోజుకి మరొకరు హేపీ బర్త్ డే చెప్పుకోవడం, చిన్న చిన్న గిఫ్టులు ఇచ్చుకోవడం లాంటివి చెయ్యాలట. ఇవన్నీ శరత్ గాడే చెప్పాడు. మరి నేనేం చేశాను..? పెళ్ళయిన తర్వాత మొదటి పుట్టినరోజుకు శ్రావణికి హేపీ బర్త్ డే అయితే చెప్పాను గానీ తనకేదో బహుమతి ఇవ్వాలన్న ఆలోచనే రాలేదు. ఇక రెండో సంవత్సరం మరీ ఘోరం.. పని ఒత్తిడిలో పడి ఆరోజు ఆమె పుట్టినరోజన్న సంగతే మర్చిపోయాను. అవన్నీ అలా వుంచితే ఆరోజు జరిగిన విషయం.. అది గుర్తుకొస్తే గుండెల్లో ముల్లు గుచ్చుకుంటున్నట్టే వుంటుంది. శ్రావణి నన్ను విడిచి వెళ్ళిపోతుందని నేను ఊహించలేదు. ఏదో కోపంలో వెళ్ళిపోయినా తిరిగి వచ్చేస్తుందిలే అనుకున్నాను. కానీ నిన్న తెలిసిన వార్త.. మనిషిని మనిషిలా వుంచడం లేదు.. గుండెల్లో మంట రేపుతోంది. శ్రావణి నామీద గృహ హింస కేసు పెట్టబోతోందిట. మా అత్తగారి వూళ్ళో వున్న ఓ చుట్టం ద్వారా విషయం తెలిసింది. అప్పట్నుంచి ఒకటే ఆలోచన.. ఏం కాదులే అని సర్దిచెప్పుకొని మనసు మళ్ళించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మళ్ళీ ఆలోచనలు అటే వెళ్తున్నాయి. లోపలెక్కడో వున్న ఆశ మళ్ళీ బైటికొచ్చింది. పోనీ శ్రావణికి ఒకసారి ఫోన్ చేస్తే..? ఆత్మాభిమానం వున్న ఏ ఆడదీ మీ దగ్గిర వుండలేదు.. మళ్ళీ నాకు ఫోన్ చెయ్యడానికి గానీ, నన్ను కలవడానికి గానీ ప్రయత్నించకండి.. శ్రావణి వెళ్ళిపోతూ నిప్పులు కురిపిస్తూ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఛ.. ఛ.. ఫోన్ చెయ్యడానికి నాకైనా సిగ్గుండాలి. ఫోన్ చేసి ప్రాధేయపడి.. తప్పైపోయిందని ఒప్పుకొని... ఆమెని రమ్మని బ్రతిమాలుకొని.. వద్దు.. వద్దు.. ఇక జీవితాంతం ఆమె ముందు వెధైవపోతాడు. అదీ ఒక బతుకేనా..? ఏం చెయ్యాలిప్పుడు..? సమస్యల్ని తట్టుకోవడానికి ముందు మానసికంగా సిద్ధపడాలట. ఏం జరిగిపోదు అని మనకి మనవే ధైర్యం చెప్పుకోవాలట. ఒకరకంగా సెల్ఫ్ హిప్నాసిస్ లాంటిదన్నమాట. తర్వాత అసలు సమస్య మూలం ఏమిటి? దాన్ని పరిష్కరించుకోవడానికి ఏయే మార్గాలున్నాయి.. అని అన్వేషించాలట. అప్పటికి ఆ సమస్య కొంత తేలికైపోతుందట. ఇవన్నీ మొన్న ఓ వ్యాసంలో చదివాను. నేననుకునేదేమిటంటే ఒడ్డున నిలబడి ఇలాంటి ప్రవచనాలు ఎన్నయినా చెప్పొచ్చు.. సమస్యలో మునిగినోడికే దాని తీవ్రత తెలుస్తుంది. అయినా ఆ రోజెందుకు అలా జరిగిందో అర్థంకావడం లేదు.. ఇప్పుడు తల్చుకుంటే విధి లిఖితం అలా వుందేమో అన్పిస్తోంది. లేకపోతే నేనెందుకంత కోపం తెచ్చుకోవాలి..? జరిగింది మరోసారి నా కళ్ళముందు మెదిలింది. ఆరోజు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆనంద్గాడు పార్టీ ఇచ్చాడు. నిజానికి మందుకొట్టడం అనేది నాకేమాత్రం ఆసక్తి లేని విషయం. కానీ ఎప్పుడో ఇలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సరిగ్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ మధ్య కూర్చున్నప్పుడు కాదంటే వాళ్ళెలాగూ విడిచిపెట్టరు కాబట్టి ఏదో కొంచెం అలా సిప్ చేస్తానంతే..! అయితే ఆరోజు మాటల్లో సిప్‌లు కొంచెం ఎక్కువయ్యాయి. ఇంటికొచ్చేసరికే శ్రావణి కోపంగా వుంది. అప్పటికే చాలాసార్లు నా సెల్‌కు ఫోన్ చేసిందట. కానీ నా సెల్ ఛార్జింగ్ అయిపోవడం నేను గమనించనే లేదు. మాటల్లోనూ మత్తులోనూ పడి ఇంటికి రావడం ఆలస్యమవుతుందని కూడా శ్రావణికి చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడో ఒకసారి తాగే నాలాంటి వాడికి మేనేజ్ చెయ్యడం చేతకాదు.. శ్రావణి వెంటనే పసిగట్టేసింది. తాగొచ్చారా..? అడిగింది. అసలు ఆ విషయం నేనే తనకి నెమ్మదిగా చెప్దామనుకున్నాను. పరిస్థితి చెప్తే ఆమె అర్థం చేసుకుంటుందనే నా నమ్మకం. అర్థం చేసుకునేదేమో కూడా.. కానీ శ్రావణి అలా ఫోర్స్‌గా ఒకేసారి అడిగేసరికి నా ఇగో దెబ్బతింది. అవును.. తాగే వచ్చాను. ఇప్పుడేంటి..? అసహనంగా అన్నాను. సాయంత్రం నుంచి ఫోన్లు చేస్తున్నాను. కనెక్ట్ కావడం లేదు.. కనీసం ఆలస్యమౌతుందని చెప్పాలని కూడా అనిపించలేదా..? అనిపించలేదు.. ఓహొ.. ఇంటికెందుకు వచ్చారయితే..? తెల్లార్లూ అక్కడే వుండాల్సింది.. తీవ్రంగా అంది. సరే.. ఈసారి అలాగే చేస్తాన్లే.. వాదన పెరిగిపోయింది. ఒక స్థాయిలో నేనేం చేస్తున్నానో నాకే తెలీలేదు. ఫలితం.. నా చేయి విసురుగా ఆమె చెంపను తాకింది. శ్రావణి నిర్ఘాంతపడి చూస్తుండిపోయింది. అప్పుడు చూశాను వెనక్కి.. శ్రావణి మేనత్త, మావయ్య! వెనక గది ద్వారం దగ్గర నిలబడి వున్నారు..! వాళ్ళొచ్చారన్న సంగతి నాకప్పటివరకూ తెలీదు. శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చి మా ఇల్లు కూడా దగ్గరే కాబట్టి చూసి పోదామని ఇక్కడికి వచ్చారట. తర్వాత్తెలిసింది నాకు. మా గలాటాకు నిద్రాభంగమై లేచినట్టున్నారు. ఒక్కసారిగా నా మత్తు దిగిపోయింది. కానీ అప్పటికే ఆలస్యమైంది..! శ్రావణి మనసు ముక్కలైంది. తర్వాత ఏం జరగాలో అదే జరిగింది.. నేను ఒంటరిగా మిగిలిపోయాను. పిచ్చెక్కేటట్టు వుంది.. ఏదయితే అదవుతుందని శ్రావణికి ఫోన్ చేశాను. ఆమె కోపంగా ఏమైనా అన్నా సహనంగా వుండాలి అనుకున్నాను. అట్నుంచి హలో.. ఎవరూ..? అని వినిపించింది. అది శ్రావణి గొంతు కాదు. నేను.. సురేష్‌ను మాట్లాడుతున్నాను.. శ్రావణి లేదా..? అడిగాను. నువ్వా బాబూ.. శ్రావణిని రమ్మని చెప్పడానికి చేశావా..? ఎందుకూ..? కొట్టి చంపెయ్యడానికా..? అది రాదులే బాబూ.. కోర్టు నుంచి నోటీసొస్తుంది.. అందుకో.. ఫోన్ కట్టయింది. ఆ గొంతు శ్రావణి మేనత్తది..! శ్రావణికి నా మీద కోపం తగ్గలేదన్న మాట.. కేసు పెట్టడానికే సిద్ధమైందన్న మాట..! అయిపోయింది.. అంతా అయిపోయింది.. సర్వనాశనం..! పరువు పోయినట్టే..! ‘వీడి మీదేరా.. పెళ్ళాం గృహహింస కేసు పెట్టింది.. స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు’ నాకు వినిపించేలా ఎవరూ అనరు.. నేను వెళ్తుంటే వెనక మాట్లాడుకుంటారంతే..! విరిగిన మనసులు అతకవన్నట్టు శ్రావణితో కలిసుండడం కూడా ఇక అసాధ్యమే అవుతుంది. ఇప్పుడేం చెయ్యాలి..? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? మధ్యాహ్నం రెండు గంటలు.. గది తలుపులు దగ్గరికి వేశాను. మనసంతా బరువుగా అయిపోయింది. ఎన్ని రకాలుగా ఆలోచించినా నేను చేస్తున్న పని కరక్టే అనిపించింది. వేరే దారి లేదు. నేనంటే వీధిలో.. ఆఫీసులో.. మా ఏరియాలో.. ఓ గుర్తింపు వుంది. మంచివాడు.. ఎవరి జోలికీ వెళ్ళడు.. అని. ఈరోజు.. ఇలాంటి మచ్చతో కాలనీలో నలుగురిలో తిరగడం అంటే.. లేదు.. లేదు.. అంతకంటే చావడం మంచిది. నా సమస్యా సమసిపోతుంది.. శ్రావణి మీద రివెంజ్ తీర్చుకున్నట్టు కూడా వుంటుంది.. అవును.. అదే కరెక్ట్..! జేబులో నుంచి బైటికి తీశాను.. విషం..! పంటలకు వాడేది.. పెస్టిైసడ్..! గేరంటీగా ఛస్తాను.. ఎంతసేపట్లో చస్తానో..? కడుపులో నొప్పేమైనా వస్తుందా..? సెల్ మోగింది. ఇప్పుడెవడు..? విసుగ్గా తీసి చూశాను. శరత్ గాడు.. ఇప్పుడెందుకు చేస్తున్నట్టో..? కట్టెయ్యబోయి మళ్ళీ మనసు మార్చుకుని పచ్చ బటన్ నొక్కాను. ఎక్కడున్నావ్ రా..? అర్జెంటుగా ఇంటికొచ్చేయ్.. పార్టీ చేసుకుందాం.. అన్నాడు. పార్టీయా..? అవును.. నీలాంటి ఆదర్శదాంపత్యం వున్నవాడికి ప్రతిరోజూ పండగే.. నాలాంటోడి బాధెవడికి చెప్పుకోను..? ఏం పార్టీ..? ఇప్పుడేంటి..? చెల్లెమ్మ ఇంట్లో లేదా..? అయినా నేనిప్పుడు రాలేను.. సహనంగా చెప్పాను. ఏం..? సెలవేగా ఈరోజు..? ఇంకేం చెప్పకు.. నువ్వు రావాల్సిందే.. లేదంటే నేనే మీ ఇంటికొచ్చేస్తాను. వాడి సంగతి నాకు తెలుసు. పట్టుపడితే వదిలే రకం కాదు.. వాడింటి నుంచి మా ఇంటికి రావడానికి ఐదు నిముషాలు కూడా పట్టదు. వస్తున్నాను.. ఇంకేమనాలో తోచక చెప్పాను. ఎందుకిలా జరుగుతోంది..? ఇది కూడా విధి లిఖితమేనా..? సరే.. కానీ.. ఒకసారి నిర్ణయించుకున్నాక నన్నెవడు ఆపగలడు..? కాకపోతే ఓ రెండు మూడుగంటల ఆలస్యం...బాటిల్‌ని కప్ బోర్డ్ లో పెట్టేసి శరత్ దగ్గరికి బెల్దైరాను. ఆలోచించకు.. కాస్ట్లీ సరుకు.. వేసేయ్.. గ్లాసులో మందు నింపి నావైపు తోసి అన్నాడు. అప్పటికే వాడు గుర్రం ఎక్కి వున్నాడు. మందా..? ఇప్పుడా..? నా గొంతు ఏదోలా ధ్వనించింది. మందేన్రా.. ఏదో విషమన్నట్టు మాట్లాడతావేంటి..? విషం అన్న మాట వినగానే ఉలిక్కిపడ్డాను. ఇప్పుడెందుకీ పార్టీ ఇస్తున్నావో చెప్పనే లేదు.. కంగారును కప్పి పుచ్చుకుంటూ అన్నాను. ఓహో... చెప్తేగానీ తాగవా..? సరే.. అంజలి వూరికెళ్ళింది. మీ ఆవిడ వూరికెళ్ళినప్పుడెప్పుడూ నువ్వు పార్టీ ఇచ్చిన గుర్తు లేదే..?! కరెక్ట్.. ఇప్పుడు కూడా అందుకివ్వడం లేదు.. ఇదసలు పార్టీ కూడా కాదు.. నీతో కొన్ని విషయాలు చెప్పాలి. ఏం చెప్పాలి..? ముందు తాగు.. గద్దించినట్టు అన్నాడు. గ్లాస్ తీసుకొని గడగడా గొంతులో వొంపేసుకున్నాను. ఇప్పుడు చెప్పు.. అయినా భార్య వూరికెళితే విరహంలో మునిగి గంటకోసారి ఆమెకు ఫోన్ చేస్తూ నీ ప్రేమను గుర్తు చెయ్యాల్సినోడివి.. అదే గదా నీ ఫిలాసఫీ.. ఇప్పుడీ దుకాణం ఎందుకు పెట్టావో అర్థం కావడం లేదు.. విసుగ్గా అన్నాను. ట్రాష్.. అదే..నే చెప్పాలనుకుంటున్నది.. ప్రతీ చిన్న విషయంలో భార్యకు థాంక్స్ చెప్పడం, ఎప్పటికప్పుడు ఏదో రకంగా మన ప్రేమను వ్యక్తపరచడం.. అన్నీ ట్రాష్.. అరిచాడు వాడు. ఏమైంది వీడికి..? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావ్..? కాస్త భయంగా అన్నాను. నరకం.. నరకం చూస్తున్నాన్రా.. ప్రతీ విషయంలో ఆవిడ చెప్పినట్టే వినాలి. నాకంటే పెద్ద జాబ్‌లో వుంది. ఎందుకులే అని ఎంతగానో కంట్రోల్ చేసుకుంటూనే వున్నాను.. అదేంట్రా.. భార్యాభర్తలు ఎలా వుంటే వారి బంధం బలపడుతుందని సైకాలజిస్టులు చెప్పారో అదే పాటిస్తుంటావ్.. నాక్కూడా పదే పదే చెప్తుంటావ్.. ఈరోజు నువ్వేమిటి ఇలా..?! నా గొంతులో ఎడతెగని ఆశ్చర్యం! నీ మొహం సైకాలజీ.. అవన్నీ నా పద్ధతులు కావు.. తనవి.. ఎమ్మే సైకాలజీ చదివింది నేను కాదు తను..! అక్కడికీ తను చెప్పినట్టు నడుచుకుంటూనే వున్నాను. కానీ నా సహనానికి కూడా ఓ హద్దుంటుంది కదా..! అయినా నిజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ వున్నవాళ్ళు దాన్ని ప్రతిసారీ ఏవో పదాల్లోనో లేక మరో రకంగానో వ్యక్తం చేసుకోవాలా..? అలా చేసుకుంటే అది రాన్రాను కృత్రిమంగా తయారౌతుంది. ఏం.. మీ ఆవిడ కాఫీ ఇచ్చినప్పుడల్లా నువ్వు థాంక్స్ చెబుతావా..? చెప్పకపోతే నీ ప్రేమ మీ ఆవిడకి అర్థం కాదా..? నీ కళ్ళు, నీ మాట తీరు, నీ బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ.. అసలివి కూడా అక్కర్లేదురా.. వైబ్రేషన్.. అవును.. ఇద్దరి మధ్య కనిపించని ఒక వైబ్రేషన్.. అది చాలు.. భార్యాభర్తల మధ్య అనురాగం నిలిచి వుండడానికి. అసలేమైందిరా..? గొంతు తగ్గించి నెమ్మదిగానే అడిగాను. నటన.. ముసుగు తగిలించుకొని నటించడం నా వల్ల కావట్లేదురా.. మొన్న.. తన పుట్టినరోజు నాడు అలిగింది.. ఉదయాన్నే హేపీ బర్త్ డే చెప్పాన్రా.. మంచి చీర కూడా ముందే కొనేసి వుంచాను. ‘ఎప్పుడూ అర్ధరాత్రి పన్నెండు దాటాక లేపి మరీ చెప్పేవాడివి.. ఈసారి తెల్లారాక తీరిగ్గా చెబుతున్నావ్.. నా మీద ప్రేమ అంతకంతకూ తగ్గిపోతోంది..’ అంది. ఓ వెర్రినవ్వు నవ్వేసి వూరుకున్నాను. అక్కడితో ఆపలేదు.. ఆ సొద కంటిన్యూ అవుతూనే వుంది. నేను బరస్ట్ అయ్యాను. ఇలా వుంటే మరీ కృత్రిమంగా అన్పిస్తోందని చెప్పాను. నా బర్త్ డే రోజు కూడా అర్ధరాత్రి లేపి చెప్పకు... చిరాగ్గా వుంటోంది.. ఇంక ఈ పిచ్చి పనులు చాలు.. ఈసారి మళ్ళీ ఇలా సైకలాజికల్ విషయాలు చెప్తే దవడ పగుల్తుందన్నాను.. అంతే..! యుద్ధం జరిగింది. ఆమె వెళ్ళిపోయింది. నాకంతా ఆశ్చర్యంగా వుంది.. అయినా బాధపడకురా.. ఏదో కోపం మీద వెళ్ళిపోయుంటుంది.. మళ్ళీ వచ్చేస్తుందిలే.. నాకు చేతైననట్టు ఓదార్చాను. రాదు.. మళ్ళీ రాదు.. ఆవిడ సంగతి నీకు తెలీదు.. ఆత్మ.. ఆత్మా.. అదేమిటది..? నాలిక తడబడింది వాడికి. ఆత్మాభిమానం.. అందించాను. అవును అదే.. ఆవిడకి టన్నులకొద్దీ వుందది.. అంచేత ఆవిడ రాదు.. నేను మనసులో విషం పెట్టుకుని ఇంతకాలం నటించానట.. విడాకుల పత్రాలు పంపిస్తుందట.. జీవితాంతం ఒంటరిగా బతికే ధైర్యం తనకి వుందట. మళ్ళీ నాదగ్గరికొచ్చేంత నీచమైన పని చెయ్యదట.. పోయింది.. అంతా పోయింది.. పరువూ మర్యాదా అంతా పోయింది.. నేను పిరికివాణ్ణి.. చాలా పిరికివాణ్ణి.. ఎలాగోలా బతికెయ్యగల గట్టి గుండె నాకు లేదు.. పెళ్ళాం వదిలేసి పోయిందని నలుగురూ అనుకుంటుంటే ఆ అవమానం తట్టుకొని మామూలుగా తిరిగే ధైర్యం అసలే లేదు.. అందుకే తాగాను.. విషం తాగాను.. నువ్వు రాకముందే.. నేను.. విషం.. వాడు టేబుల్ మీద తల వాల్చేశాడు. నా గుండెలు అదిరిపోయాయి.. విషం.. విషం తాగాడా వీడు..?! ఇప్పుడేం చెయ్యాలి..? కాళ్ళు చేతులు ఆడ్డం లేదు.. అంబులెన్స్.. అవును.. అంబులెన్స్‌కి ఫోన్ చెయ్యాలి.. నెంబరెంత..? చేతులు వొణుకుతున్నాయి.. నెంబర్ నొక్కాను. ఎమర్జెన్సీ వార్డ్ బైట కూర్చున్నాను.. సమయం ముళ్ళ మీద వున్నట్టుగా గడుస్తోంది.. ఎట్టకేలకు కొన్ని యుగాల తర్వాత శరత్ వున్న ఆ గది తలుపు తెరుచుకుంది. నా గుండె శబ్దం నాకే వినిపిస్తోంది. నేనేమీ అడక్కమునుపే మీవాడు సేఫ్.. సరైన సమయంలో తీసుకొచ్చారు.. ఇంకాస్త లేటైతే కష్టమయ్యేది.. అన్నాడు లోపల్నుంచి వచ్చిన డాక్టర్. హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్నాను. నేను మరో ఇద్దరు ఫ్రెండ్స్‌కు మాత్రమే ఫోన్ చేశాను. వార్త అలా అలా పాకిపోయింది. గంట గడిచేసరికి అక్కడకి చాలామంది చేరుకున్నారు. సెల్ మోగుతోంది.. చూశాను.. శ్రావణి చేస్తోంది.. నమ్మలేకపోయాను.. ఆన్సర్ చేశాను..ఉదయం మీరు ఫోన్ చేశారా..? అడుగుతోంది. అవును.. మీ మేనత్త మాట్లాడింది.. చెప్పాను. ఆవిడ నాకు చెప్పనే లేదు.. ఇప్పుడే కాల్ లిస్టులో చూశాను.. అడిగితే చెప్పింది. ఆవిడ కోర్టు నోటీసు అదీ ఇదీ అంటోందేమిటి..? ఎంత వొద్దనుకున్నా నా గొంతు కొంచెం వణికింది. అదా.. ఆవిడ కొంచెం ఫెమినిస్టు భావాలున్నావిడ.. మీకు తెలీదా ఏంటి..? అబ్బాయిని కొంచెం జడిపిస్తే గానీ దార్లోకి రాడంది. అక్కడికీ నేను వొద్దని చెప్తూనే వున్నాను.. మరి మీ పెదనాన్న కొడుక్కి నిన్న ఫోన్ చేస్తే అతను కూడా అలాగే అన్నాడు..?! వాడే కదా మీకు బాగా దోస్తు.. వాడికి మీరు చేస్తారని ఆవిడకి తెలుసు. అందుకే ఒకవేళ మీరు ఫోన్ చేస్తే అలాగే చెప్పమని గట్టిగా ఆర్డరేసింది.. నిజమా.. అంతేనా.. నామీద కోపం లేదా నీకు..? ఆశ్చర్యంగా అడిగాను. ఎందుకు లేదు..? మనింటి కెళ్ళాక చూసుకుందాం.. చెప్పింది శ్రావణి. ఆ గొంతులో కోపం లేదు. నా మనసు దూదిపింజలా తేలిైకపోయింది. సారీ శ్రావణి.. ఏదో మత్తులో.. కోపంలో చెయ్యి చేసుకున్నాను.. తప్పే..! ఇంటికెప్పుడొస్తున్నావ్..? ఇప్పుడు బయల్దేరుతున్నాను.. మీరు ఇంటి దగ్గరే వున్నారు కదా.. అడిగింది. నేనెక్కడున్నదీ చెప్పి.. శరత్ విషం తాగిన సంగతి చెప్పాను. అలా ఎలా జరిగింది..? ఆశ్చర్యంగా అడిగింది శ్రావణి. అదంతా నువ్వొచ్చాక చెప్తాన్లే.. అన్నాను. సరేనంటూ ఫోన్ కట్ చేసింది. లోపలికెళ్ళాను. శరత్ గాడు కొంచెంగా తేరుకున్నాడు. బలహీనంగా మాట్లాడుతున్నాడు. నన్నెందుకు బతికించావంటూ అడిగాడు. ఆ మాత్రం మాట్లాడుతున్నాడంటే ఇంక వాడికి ఫర్వాలేదనుకున్నాను. అక్కడ మిగతా వాళ్ళకి చూసుకోమని చెప్పి కాసేపట్లో వస్తానని బయటకొచ్చాను. రోడ్డు మీద కొచ్చి కనిపించిన ఆటో ఎక్కి మా ఇంటి అడ్రస్ చెప్పి పొమ్మన్నాను. శ్రావణికి వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి రావడానికి అరగంట కూడా పట్టదు. నేను విషం బాటిల్ పెట్టిన కప్ బోర్డ్ శ్రావణిది.. తనొచ్చేలోగా ఆ బాటిల్‌ని తీసి పారెయ్యాలి..! - ఎం. రమేష్ కుమార్ -
అడవి దారిలో...
కథ రోడ్డు మీద కారు మెత్తగా సాగిపోవడం లేదు... ఎందుకంటే మేం ప్రయాణిస్తున్నది గతుకుల మట్టిరోడ్డు. రాత్రి పదిగంటలు దాటింది... కానీ అర్ధరాత్రి అయిన ఫీలింగ్ కలుగుతోంది. దానిక్కారణం మేం ప్రయాణిస్తున్న దారి...! అది అడవిదారి లాగా ఉంది. నేను, రాఘవ, కిరణ్, శంకర్... మా నలుగురు స్నేహితులం ఉదయం ఐదున్నరకు విజయనగరం నుంచి అరకు వెళ్ళడానికి బయల్దేరాం. రొటీన్ లైఫ్ నుండి బైటపడ్డానికి అప్పుడప్పుడూ ఇలాంటి చిన్న చిన్న ట్రిప్పులు వేయడం మాకలవాటు. శంకర్గాడి సెకండ్ హ్యాండ్ కారులో ప్రయాణం. తిరిగి రాత్రికి ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో బయల్దేరాం. అయితే బొర్రాగుహల దగ్గర ఎక్కువ సమయం గడపడం, అరకులో మ్యూజియం, గార్డెన్స్ లాంటివి చూశాక చాపరాయి దగ్గర కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోవడం తదితర కారణాల వల్ల మేం అట్నుంచి బయల్దేరడం బాగా ఆలస్యమైంది. తిరిగి వచ్చేదారిలో బొర్రాగుహలు దాటాక ఓ అడ్డదారి ఉందంటే తొందరగా ఇల్లు చేరుకోవచ్చన్న ఆశతో అటువైపు కారు మళ్ళించాం. మాకు అడ్డదారిలో వెళ్ళొచ్చని చెప్పిన ఒక తాత తనను కూడా అటువైపు మెయిన్ రోడ్డు వరకూ దిగబెట్టమని అభ్యర్థించడంతో అతణ్ణి కూడా కార్లో ఎక్కించుకున్నాం. పది నిమిషాలు గడిచేసరికి ఆ దార్లోకి వచ్చి పొరపాటు చేశామని అర్థమైంది. కానీ వెనక్కు వెళ్ళిపోదామన్న మాట అంటే పలచనైపోతామన్న ఊహతో ఎవరికి వారే బింకంగా ఉండిపోయాం. శంకర్ ఏకాగ్రతతో బండి నడుపుతున్నాడు. పక్కనే కూర్చున్నాను నేను. చుట్టూ చెట్లు... మధ్యలో మట్టిదారి... ముందూవెనకా ఏ వాహనం లేదు. మనిషన్న వాడెవడూ ఎదురవడం లేదు. విండో అద్దం కొద్దిగా దించితే చాలు చలిగాలి ఈడ్చి కొడుతోంది. చలి సంగతి అలా ఉంచితే చెట్ల మధ్య నుంచి గాలి చేస్తోన్న శబ్దం ఒక రకమైన భయాన్ని కలిగిస్తోంది. దానికి తోడు కీచురాళ్ళ శబ్దం కారు చేస్తున్న శబ్దాన్ని అధిగమించి వినిపిస్తూ ఆ భయాన్ని అధికం చేస్తోంది. ఇలాంటి దారిలో వెళ్ళమని సలహా చెప్పిన వ్యక్తి మీద కంటే ముందూ వెనకా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే బండిని ఇటువైపు తిప్పించిన రాఘవ మీద నాకు కోపం వచ్చింది. కాస్త ఆలస్యమైతే ఏవుంది, అర్ధరాత్రికైనా ఇంటికి చేరుకునేవాళ్ళమే కదా! ఆ మాత్రం దానికి ఈ అడ్డదారిలో ప్రయాణం చేయడం అవసరమా? అనిపించింది. ఆ మాటే బైటికి అన్నాను. మిగతా ఇద్దరు కూడా నన్ను సపోర్టు చేస్తూ మాట్లాడారు. రాఘవ నవ్వి వూరుకొన్నాడు. ఏమైనా వాడికి ధైర్యం ఎక్కువ! నేను వెనక్కి తిరిగి మాతో పాటు వస్తున్న తాత వైపు చూశాను. బహుశా అతడికి దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళు ఉండొచ్చు. పంచె కట్టుకుని బనీనులాంటి చొక్కా ధరించి ఉన్నాడు. ఆ బట్టలు ఒకప్పుడు తెల్లగా ఉండేవేమో! ఉతికి ఎన్నాళ్ళయిందో గానీ ఇప్పుడు మాత్రం బూడిద రంగులోకి మారి ఉన్నాయి. పూర్తిగా తెల్లబడ్డ పల్చటి జుట్టు, మొహం మీద వదులుగా వేలాడుతున్న చర్మం, కాంతి లేని కళ్ళు, బక్క పల్చటి శరీరం... జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినట్టుగా ఒక రకమైన నిశ్చలత అతని మొహంలో కనబడుతోంది. నేను తనవైపు చూడ్డం చూసి చిన్నగా నవ్వి... ‘‘తవరు బయంపడతన్నట్టుందండి... రాత్రి మీద ఈ దార్లో ఎవరూ రారు గానండీ... పగటిపూట గొర్లు మేపుకునే పిలగాళ్ళు, అడపాదడపా అటూఇటూ వచ్చిపోయే మనుసుల్తో బానే వుంటదండి...’’ అన్నాడు. ‘‘ఏం బావుండడమో ఏంటో... ఇది దెయ్యాలు తిరిగే దారిలాగా ఉంది తప్ప మనుషులు నడిచే మార్గంలా లేదు...’’ కొద్దిగా విసుగ్గా అన్నాడు కిరణ్. వాడి మాటల్లో విసుగుతో పాటు అంతర్లీనంగా భయం తొంగి చూడడం మాకర్థమౌతూనే ఉంది. వాడికి మామూలుగానే భయం ఎక్కువన్నది మా అందరికీ తెలిసిన సంగతే! తాత ఈసారి కాస్త గట్టిగానే నవ్వాడు. మా భయం అతనికి నవ్వులాటగా ఉన్నట్టుంది. ‘‘ఎందుకు తాతా నవ్వుతున్నావ్?’’ అడిగాడు రాఘవ. ‘‘ఏం లేదు బాబూ... మన బయ్యమే దెయ్యవండి... అంతకంటే ఏవుందండి? దెయ్యం అనగానే ఓ సిన్న సంగతి గాపకానికొచ్చిందండి... అందుకే నవ్వినాను’’ అన్నాడు తాత. ‘‘ఏంటా సంగతి... మాక్కూడా చెప్పు తాతా’’ అన్నాడు శంకర్ డ్రైవింగ్ చేస్తూనే. ‘‘అవునవును... ఏంటో చెప్పు. కాలక్షేపంగా ఉంటుంది’’ సమర్థించాడు కిరణ్. ‘‘చాన్నాళ్ళ కిందట సంగతండి... ఇలాగే నలుగురు పెద్దమనుసులు కార్లో ఈ దారంట ఎల్తన్నారటండి. రాత్రి పదకొండు దాటుంటాది. అప్పుడే రోడ్డుకడ్డంగా ఓ పిల్ల కనబడిందటండి. ఆపమని సేతులూపుతందట. సరే ఎవురో ఆడకూతురు ఇక్కడ సిక్కుబడిపోయినట్టుందని కారాపేరటండి. ఆయమ్మ కారెక్కింది. ఈయేళప్పుడు ఇక్కడెందుకున్నా వనడిగితే ‘మా తాత పసరు వైద్యంసేస్తాడు. నాను పసరు మొక్కల కోసం ఎదుక్కుంటూ ఎళ్ళి తప్పొడిపోన్ను. తిరిగి తిరిగి ఇక్కడికెలాగో వొచ్చేనుగానీ ఇంత రాత్రి పూట ముందుకెల్నానికి బయవేసి చాంచేపట్నుంచి ఇక్కడే వుండిపోన్ను’ అందటండి. సరే కానీ అని అటుపక్క దిగబెట్టేత్తావని సెప్పేరట. కానీ వొయసులో ఉన్న పిల్లని సూసేసరికి ఆళ్ళకి దుర్భుద్ధి పుట్టింది. ఇంకేటుంది? ఆళ్ళ కామానికి ఆ పిల్ల బలైపోయింది. ఆళ్ళు కార్లోంచి దించీశాక అక్కడే దగ్గిర్లోని పాడుపడిన బావిలో దూకి పేణం తీసుకుందట ఆ పిల్ల. పాపం... ఆళ్ళ తాత ఆ కార్లోని మనుసుల కోసం చాన్నాళ్ళు యెతికాడని అంటారు. ఆ పిల్ల కూడా దెయ్యవై ఆళ్ళని యెతుకుతూ అప్పుడప్పుడూ ఇటేపు ఎళ్ళే కార్లని ఆపి యెక్కుతుంటుందని ఇప్పటికీ సాలామంది అంటుంటారండి’’ అన్నాడు. అతడు చెప్పడం పూర్తయ్యాక కొద్ది క్షణాల పాటు ఎవరూ మాట్లాళ్ళేదు. అనవసరంగా ఈ టైమ్‌లో ముసలాణ్ణి కదిపామేమో అనిపించింది. ‘‘ఇదంతా నిజమే అని నమ్ముతున్నావా తాతా?’’ అడిగాడు రాఘవ. ‘‘చాన్నాళ్ళ కిందట మా గూడెంలో ఈ ఇసయం పొగలాగా పుట్టిపోయింది బాబూ. అప్పున్నుంచీ ఎవరినోట ఆలకించినా ఇదేసంగతి. మరి నిజవేనా అంటే నాను మాత్రం ఏటి సెప్పగల్ను బాబూ!’’ అన్నాడు తాత. అది నిజమైనా కాకపోయినా తాత చెప్పింది విన్నాక మా మనసుల్లో మాత్రం భయం మరింతగా వ్యాపించిదన్న మాట మాత్రం వాస్తవం! కాసేపు మళ్ళీ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో కీచురాళ్ళ రొద మరింత గట్టిగా వినబడుతున్నట్టుగా ఉంది. చల్లటి వాతావరణంలో కూడా నాకు చెమటలు పడుతున్నట్టుగా అనిపిస్తోంది. రాఘవ సంగతేమో గానీ మిగతావారి పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పగలను. ‘‘ఇలాంటి కథలను నమ్మడానికి లేదులే..’’ కిరణ్ వాతావరణాన్ని తేలిక చెయ్యడానికే అన్నా వాడి గొంతులో భయం స్పష్టంగానే ధ్వనించింది. ‘‘నిజమైనా కావచ్చు. ఇలాంటివి చాలాచోట్ల జరిగాయని మనం చదివాం కదా. దెయ్యం ఉనికిని గుర్తించినవాళ్ళు కూడా ఉన్నారు కదా...’’ అదేదో మామూలు విషయం అన్నట్టుగా అన్నాడు రాఘవ. కానీ ఆ మాటలు కిరణ్‌ని మరింత టీజ్ చెయ్యడానికే అన్నాడని మాకు అర్థమైంది. ‘‘చాల్చాల్లే... నిన్నే అడగాలి ఇలాంటి సంగతులు!’’ అన్నాడు కిరణ్. ‘‘సరే... ఇంకా విషయం వదిలేయండి. ఇంకేదైనా మాట్లాడండి’’ అన్నాడు శంకర్. మా మనసుల నిండా అప్పటికే భయం ఆవరించింది. ఎవరూ కొద్ది క్షణాల పాటు ఏమీ మాట్లాడలేదు. అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఏర్పడుతున్న ఈ నిశ్శబ్దాన్ని ఎదుర్కోవడం మరింత కష్టంగా ఉంది. చివరికి రాఘవే చొరవ తీసుకొని ఆర్నెల్ల క్రితం మేమందరం దేవీపురానికి వెళ్ళినప్పటి సంగతుల గురించి మాట్లాడ్డం మొదలుపెట్టాడు. క్రమంగా ఆ సంభాషణలో అందరం పాల్గొంటూ తలో సంగతి గుర్తు చేసుకోసాగాం. ఈ సూత్రం బానే పనిచేసినట్టుంది. కాసేపటికి మేమంతా నార్మల్ మూడ్‌లోకి వచ్చే సూచనలు కనిపించాయి. సరిగ్గా అప్పుడు జరిగింది అది...! రోడ్డుకడ్డంగా ఓ అమ్మాయి నిలుచుని ఆపమని చేతులూపుతోంది. కాస్త దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూడగానే పోయిన భయం ఒక్కసారిగా రెట్టింపు ప్రభావంతో తిరిగొచ్చింది. ఈ టైమ్‌లో ఈ దారిలో నిలుచున్న ఆ అమ్మాయి ఎవరు? అసలు ఆమె మనిషేనా? లేక...? నా గుండె చప్పుడు స్పష్టంగా నాకే వినిపిస్తోంది. వెనక్కి తిరిగి రాఘవ వైపు చూశాను. వాడి మొహంలో ప్రశ్నార్థకం. కిరణ్ సంగతి చెప్పక్కర్లేదు. కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. అసంకల్పితంగా శంకర్ కారు స్లో చేశాడు. ‘‘పోనియ్ నీకేమైనా పిచ్చా? వేగంగా పోనియ్... ఆపకు...’’ అరిచాడు కిరణ్. వెంటనే కారు వేగం పుంజుకుంది. ఆ అమ్మాయికి దూరం జరిగేటట్లుగా కుడివైపు సర్రున కోసి ఆమె దాటిపోగానే తిరిగి మెయిన్ రూట్లోకి వచ్చి దూసుకుపోయింది. ‘‘ఆపు... కారాపు...’’ గట్టిగా అన్నాడు రాఘవ. ‘‘ఎందుకురా ఆపమంటున్నావ్? కారు పోనీ శంకర్... ఆపొద్దు...’’ కిరణ్ కూడా గట్టిగానే అన్నాడు. ‘‘మీ మొహం... కొద్దిగానైనా ఆలోచించరేంట్రా...? తాత చెప్పిన కట్టుకథ విని ఆ మూడ్‌లోకి వెళ్ళిపోయి మీరేం చేస్తున్నారో మీకే తెలీడం లేదు. ఆ అమ్మాయి దెయ్యమేవిటి! దెయ్యమయితే కారాపకుండా వెళ్ళినంతమాత్రాన మనల్ని వదిలేస్తుందా? ఎగురుకుంటూ అయినా కార్లోకి వచ్చెయ్యదా? పాపం... ఆ అమ్మాయి ఏదో ఆపదలో వుందేమో? ఇలా వచ్చెయ్యడానికి మీకు మనసెలా ఒప్పుతోందిరా... దయచేసి నా మాట విని కారు వెనక్కి తిప్పిండి...’’ గుక్క తిప్పుకోకుండా అన్నాడు రాఘవ. ఎవరూ మాట్లాళ్ళేదు. ‘‘అవును బాబూ... నాను కాటికాపరి పంజేశాను. శవాల మద్దిన, దెయ్యాల మద్దిన తిరిగినోణ్ణి. ఆ పిల్ల దెయ్యం కాదు బాబూ... పాపం... ఏడుత్తున్నట్టుంది... ఎవరో, ఎంచేత ఇక్కడుండిపోయిందో... కారు ఎనక్కి తిప్పి ఎక్కించుకోండి బాబూ... ఈ ముసిలాడికున్న ధయిర్యం కూడా మీకు నేదా బాబూ...’’ అంతవరకూ మౌనంగా ఉన్న తాత మాట్లాడాడు. మిగతా ముగ్గురం ఆలోచన్లో పడ్డాం. ‘‘ఒరేయ్.... దయచేసి వెనక్కి తిప్పండ్రా. మనం కాపాడకపోతే ఆ అమ్మాయికేదైనా ప్రమాదం జరగొచ్చు. ఆ ఉసురు మనకు తగులుతుందిరా...’’ మమ్మల్ని కన్విన్స్ చేస్తూ అన్నాడు రాఘవ. కారు వెనక్కి తిరిగింది. అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి మోకాళ్ళ మీద కూర్చుని మొహం కప్పుకొని ఉంది. బహుశా ఏడుస్తోంది. కారు ఆగగానే ముందు రాఘవే దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆమె మొహం పెకైత్తి వాణ్ణి చూడగానే భోరున ఏడ్చింది. వాడు ఆ అమ్మాయిని సముదాయిస్తూ తీసుకొచ్చి కార్లోకి ఎక్కించాడు. వెనక సీట్లోనే నలుగురూ ఇరుక్కొని కూర్చున్నారు. కారు తిప్పి ముందుకు పోనిచ్చాడు శంకర్. ఆ అమ్మాయికి పదహారు, పదిహేడేళ్ళుండొచ్చు. రాఘవ నెమ్మదిగా ఆమె దగ్గర్నుంచి విషయం రాబట్టాడు. ఆ అమ్మాయి వైజాగ్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. విహారయాత్రకి వాళ్ళ క్లాసు పిల్లలంతా బస్సు మీద అరకు, బొర్రా గుహలకొచ్చారు. తిరిగి బైల్దేరేసరికి మాలాగే ఆలస్యం కావడంతో ఈ అడ్డదారి ఎన్నుకున్నారు. మధ్యలో బస్సు ఆగిపోయింది. తిరిగి స్టార్ట్ అవడం లేదు. ఏం జరిగిందో చూస్తున్నారు. ఈ అమ్మాయి తలనొప్పిగా ఉందని చెప్పి వెనక సీట్లో పడుకొని ఉంది. బస్సు ఆగడంతో వెనక డోర్గుండా బైటికి దిగింది. టాయిలెట్‌కి వెళ్ళే ఆలోచనతో కాస్త వెనగ్గా పొదల చాటుకు వెళ్ళింది. ఈలోగా సడన్‌గా బస్సు స్టార్ట్ అయి ముందుకు కదిలింది. వెనకసీట్లో ఈ ఒక్క అమ్మాయే పడుకొని ఉండడం వల్ల ఈమె బస్సు దిగిన సంగతి ఎవరూ గమనించలేదు. బస్సు వెళ్ళిపోతున్న విషయం గమనించి ఈ అమ్మాయి బస్సు వెనక పరిగెత్తుకుంటూ ఆపమని కేకలు వేస్తూ వచ్చినా అప్పటికే బస్సు స్పీడందుకొని వెళ్ళిపోవడంతో ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది. అదీ జరిగిన విషయం! అడవి నుంచి బైటపడుతున్నామనడానికి సూచనగా అక్కడక్కడ ఇళ్లు కనిపిస్తున్నాయి. మరి కాసేపటికి కాస్త దూరంలో ఎదురుగా మెయిన్‌రోడ్డు మీద వాహనాలు వెళ్తున్నట్లుగా లైట్లు కనిపించాయి. అప్పటికి మా మనసుల్లో భయం పోయింది. అట్నుంచి ఏదో వాహనం మావైపుగా వస్తోంది. కాస్త దగ్గరికి వచ్చాక అర్థమైంది... అదొక మినీ బస్సు. దాన్ని చూడగానే ఆ అమ్మాయి... ‘అది మా బస్సే...’ అంటూ అరిచింది. కారాపుచేసి ఆ అమ్మాయిని తీసుకొని బస్సుకు ఎదురుగా వెళ్ళాం. వాళ్ళు ఆ అమ్మాయి మిస్సయిందని గమనించి వెనక్కి వస్తున్నారు. ఆ పిల్లను వాళ్ళకు అప్పజెప్పి తిరిగి కారు దగ్గరకు వచ్చాం. రాఘవ మాతో బస్సు దగ్గరికి రాకుండా కారు దగ్గరే నిలబడి ఉన్నాడు. తాత మాతో రావడం లేదు. మెయిన్‌రోడ్డు ఎదురుగానే ఉంది కాబట్టి రాఘవతో చెప్పేసి వెళ్ళిపోయినట్టున్నాడు. జరిగిన సంగతుల గురించే మాట్లాడుకుంటూ ఈసారి మా ట్రిప్పు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అనుకుంటూ నవ్వుకున్నాం. రాఘవ మాత్రం మా సంభాషణలో పాలు పంచుకోలేదు. ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మరో గంట ప్రయాణం తర్వాత విజయనగరం చేరుకున్నాం. ఇది జరిగిన వారం తర్వాత మరుసటి ఆదివారం అంతా ఓ చోట కలుసుకున్నాం. కిందటి వారం అరకు ట్రిప్ గురించే మాట్లాడుకుంటున్నాం. ‘‘మొత్తానికి గొప్ప ఎక్స్‌పీరియెన్స్!’’ అన్నాను నేను. ‘‘అవును... ఆ టైమ్‌లో ఆ పరిస్థితిలో వెనక్కు వెళ్ళడం ఒకరకంగా సాహసమే... కానీ దానివల్ల ఓ అమ్మాయి రక్షించబడింది. ఆ తృప్తి చాలు మనకి. లేకపోతే ఆ బస్సు వెనక్కి వచ్చేలోగా ఆ అమ్మాయికేదన్నా ప్రమాదం జరిగుండొచ్చు’’ అన్నాడు శంకర్. ‘‘ప్రమాదమేమిటి నీ మొహం... నాలాంటి వాడికైతే అక్కడ ఏ ప్రమాదం జరక్కపోయినా అడవిలో ఒంటరిగా చిక్కుబడిపోయామన్న భయంతోనే గుండాగిపోయి ఉండేది...’’ సిన్సియర్‌గా అన్నాడు కిరణ్. రాఘవ ఇంకేదో ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా ఉన్నాడు. ‘‘నువ్వేం మాట్లాడవేంట్రా?’’ అన్నాన్నేను. ఒకసారి మావైపు చూసి ‘‘మనం సాహసం చేసింది నిజమేగానీ, అది ఆ అమ్మాయిని రక్షించడం కాదు...’’ సాలోచనగా అన్నాడు వాడు. ‘‘మరి...?’’ అడిగాడు. ‘‘తెలీకుండా మరో పెద్ద సాహసం చేశామేమో అనిపిస్తోంది. ఇది నిజమో కాదో గట్టిగా అడిగితే నేను చెప్పలేను. అందుకే ఈ విషయం ఇంతవరకూ మీకు చెప్పలేదు కూడా’’ అన్నాడు. ‘‘అబ్బ... అదేంటో చెప్పరా?’’ సస్పెన్స్ భరించలేనట్టు ఆతృతగా అన్నాడు కిరణ్. ‘‘ఆ రోజు మీరు బస్ దగ్గరకు వెళ్ళినప్పుడు నేను బైటికి వచ్చి కార్ డోర్ మూసేసి అక్కడే నిలబడ్డాను. డోర్ మూసినప్పుడు లోపల తాతను చూసినట్టే గుర్తుంది. మెయిన్‌రోడ్డు ఇంకాస్త దూరంలో ఉంది గదా... అక్కడ దిగుతాడేమో అనుకున్నా. తర్వాత మీరొచ్చారు. మళ్ళీ కార్ డోర్ తీసి చూసేసరికి తాత లోపల లేడు. నాకు అయోమయంగా అనిపించింది. నాకు చెప్పి వెళ్ళిపోయాడని మీరనుకున్నారు. అది నిజం కాదు. అసలతడు దిగినట్టుగానీ, వెళ్ళిపోయినట్టుగానీ నేను చూడనేలేదు. అసలా కార్ డోర్ తీసినట్టు కూడా అనిపించలేదు...!’’ అందరం షాక్ తిన్నట్టుగా నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఇది నిజమా? లేక రాఘవ పొరబడ్డాడా? తాత ఎవరికీ చెప్పకుండా సెలైంట్‌గా దిగి వెళ్ళిపోయాడా? లేక మాయమైపోయాడా? అసలతడు ఎవరు? అతడు చెప్పిన కథలోని తాత అతడేనా? మా అందరిలో ఎన్నో ప్రశ్నలు! మా ప్రశ్నల్లో దేనికీ సమాధానాలు లేవు. ఆ రోజు జరిగింది తల్చుకుంటే మాత్రం ఇప్పటికీ మా గుండె కొట్టుకునే వేగం పెరుగుతూనే ఉంటుంది. ఆ అమ్మాయికి పదహారు, పదిహేడేళ్ళుండొచ్చు. రాఘవ నెమ్మదిగా ఆమె దగ్గర్నుంచి విషయం రాబట్టాడు. ఆ అమ్మాయి వైజాగ్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. - ఎం.రమేశ్ కుమార్