అడవి దారిలో... | one midnight sotry | Sakshi
Sakshi News home page

అడవి దారిలో...

Published Sun, Mar 8 2015 1:01 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

అడవి దారిలో... - Sakshi

అడవి దారిలో...

కథ
రోడ్డు మీద కారు మెత్తగా సాగిపోవడం లేదు... ఎందుకంటే మేం ప్రయాణిస్తున్నది గతుకుల మట్టిరోడ్డు. రాత్రి పదిగంటలు దాటింది... కానీ అర్ధరాత్రి అయిన ఫీలింగ్ కలుగుతోంది. దానిక్కారణం మేం ప్రయాణిస్తున్న దారి...! అది అడవిదారి లాగా ఉంది. నేను, రాఘవ, కిరణ్, శంకర్... మా నలుగురు స్నేహితులం ఉదయం ఐదున్నరకు విజయనగరం నుంచి అరకు వెళ్ళడానికి బయల్దేరాం. రొటీన్ లైఫ్ నుండి బైటపడ్డానికి అప్పుడప్పుడూ ఇలాంటి చిన్న చిన్న ట్రిప్పులు వేయడం మాకలవాటు.

శంకర్‌గాడి సెకండ్ హ్యాండ్ కారులో ప్రయాణం. తిరిగి రాత్రికి ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో బయల్దేరాం. అయితే బొర్రాగుహల దగ్గర ఎక్కువ సమయం గడపడం, అరకులో మ్యూజియం, గార్డెన్స్ లాంటివి చూశాక చాపరాయి దగ్గర కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోవడం తదితర కారణాల వల్ల మేం అట్నుంచి బయల్దేరడం బాగా ఆలస్యమైంది. తిరిగి వచ్చేదారిలో బొర్రాగుహలు దాటాక ఓ అడ్డదారి ఉందంటే తొందరగా ఇల్లు చేరుకోవచ్చన్న ఆశతో అటువైపు కారు మళ్ళించాం. మాకు అడ్డదారిలో వెళ్ళొచ్చని చెప్పిన ఒక తాత తనను కూడా అటువైపు మెయిన్ రోడ్డు వరకూ దిగబెట్టమని అభ్యర్థించడంతో అతణ్ణి కూడా కార్లో ఎక్కించుకున్నాం.
 
పది నిమిషాలు గడిచేసరికి ఆ దార్లోకి వచ్చి పొరపాటు చేశామని అర్థమైంది. కానీ వెనక్కు వెళ్ళిపోదామన్న మాట అంటే పలచనైపోతామన్న ఊహతో ఎవరికి వారే బింకంగా ఉండిపోయాం. శంకర్ ఏకాగ్రతతో బండి నడుపుతున్నాడు. పక్కనే కూర్చున్నాను నేను.
 చుట్టూ చెట్లు... మధ్యలో మట్టిదారి... ముందూవెనకా ఏ వాహనం లేదు. మనిషన్న వాడెవడూ ఎదురవడం లేదు. విండో అద్దం కొద్దిగా దించితే చాలు చలిగాలి ఈడ్చి కొడుతోంది. చలి సంగతి అలా ఉంచితే చెట్ల మధ్య నుంచి గాలి చేస్తోన్న శబ్దం ఒక రకమైన భయాన్ని కలిగిస్తోంది. దానికి తోడు కీచురాళ్ళ శబ్దం కారు చేస్తున్న శబ్దాన్ని అధిగమించి వినిపిస్తూ ఆ భయాన్ని అధికం చేస్తోంది.

ఇలాంటి దారిలో వెళ్ళమని సలహా చెప్పిన వ్యక్తి మీద కంటే ముందూ వెనకా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే బండిని ఇటువైపు తిప్పించిన రాఘవ మీద నాకు కోపం వచ్చింది. కాస్త ఆలస్యమైతే ఏవుంది, అర్ధరాత్రికైనా ఇంటికి చేరుకునేవాళ్ళమే కదా! ఆ మాత్రం దానికి ఈ అడ్డదారిలో ప్రయాణం చేయడం అవసరమా? అనిపించింది. ఆ మాటే బైటికి అన్నాను. మిగతా ఇద్దరు కూడా నన్ను సపోర్టు చేస్తూ మాట్లాడారు. రాఘవ నవ్వి వూరుకొన్నాడు. ఏమైనా వాడికి ధైర్యం ఎక్కువ!
 
నేను వెనక్కి తిరిగి మాతో పాటు వస్తున్న తాత వైపు చూశాను. బహుశా అతడికి దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళు ఉండొచ్చు. పంచె కట్టుకుని బనీనులాంటి చొక్కా ధరించి ఉన్నాడు. ఆ బట్టలు ఒకప్పుడు తెల్లగా ఉండేవేమో! ఉతికి ఎన్నాళ్ళయిందో గానీ ఇప్పుడు మాత్రం బూడిద రంగులోకి మారి ఉన్నాయి. పూర్తిగా తెల్లబడ్డ పల్చటి జుట్టు, మొహం మీద వదులుగా వేలాడుతున్న చర్మం, కాంతి లేని కళ్ళు, బక్క పల్చటి శరీరం... జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినట్టుగా ఒక రకమైన నిశ్చలత అతని మొహంలో కనబడుతోంది. నేను తనవైపు చూడ్డం చూసి చిన్నగా నవ్వి... ‘‘తవరు బయంపడతన్నట్టుందండి... రాత్రి మీద ఈ దార్లో ఎవరూ రారు గానండీ... పగటిపూట గొర్లు మేపుకునే పిలగాళ్ళు, అడపాదడపా అటూఇటూ వచ్చిపోయే మనుసుల్తో బానే వుంటదండి...’’ అన్నాడు.
 
‘‘ఏం బావుండడమో ఏంటో... ఇది దెయ్యాలు తిరిగే దారిలాగా ఉంది తప్ప మనుషులు నడిచే మార్గంలా లేదు...’’ కొద్దిగా విసుగ్గా అన్నాడు కిరణ్. వాడి మాటల్లో విసుగుతో పాటు అంతర్లీనంగా భయం తొంగి చూడడం మాకర్థమౌతూనే ఉంది. వాడికి మామూలుగానే భయం ఎక్కువన్నది మా అందరికీ తెలిసిన సంగతే!
 తాత ఈసారి కాస్త గట్టిగానే నవ్వాడు. మా భయం అతనికి నవ్వులాటగా ఉన్నట్టుంది.
 ‘‘ఎందుకు తాతా నవ్వుతున్నావ్?’’ అడిగాడు రాఘవ.

 ‘‘ఏం లేదు బాబూ... మన బయ్యమే దెయ్యవండి... అంతకంటే  ఏవుందండి? దెయ్యం అనగానే ఓ సిన్న సంగతి గాపకానికొచ్చిందండి... అందుకే నవ్వినాను’’ అన్నాడు తాత.
 ‘‘ఏంటా సంగతి... మాక్కూడా చెప్పు తాతా’’ అన్నాడు శంకర్ డ్రైవింగ్ చేస్తూనే.
 ‘‘అవునవును... ఏంటో చెప్పు. కాలక్షేపంగా ఉంటుంది’’ సమర్థించాడు కిరణ్.
 ‘‘చాన్నాళ్ళ కిందట సంగతండి... ఇలాగే నలుగురు పెద్దమనుసులు కార్లో ఈ దారంట ఎల్తన్నారటండి. రాత్రి పదకొండు దాటుంటాది. అప్పుడే రోడ్డుకడ్డంగా ఓ పిల్ల కనబడిందటండి. ఆపమని సేతులూపుతందట. సరే ఎవురో ఆడకూతురు ఇక్కడ సిక్కుబడిపోయినట్టుందని కారాపేరటండి. ఆయమ్మ కారెక్కింది.

ఈయేళప్పుడు ఇక్కడెందుకున్నా వనడిగితే ‘మా తాత పసరు వైద్యంసేస్తాడు. నాను పసరు మొక్కల కోసం ఎదుక్కుంటూ ఎళ్ళి తప్పొడిపోన్ను. తిరిగి తిరిగి ఇక్కడికెలాగో వొచ్చేనుగానీ ఇంత రాత్రి పూట ముందుకెల్నానికి బయవేసి చాంచేపట్నుంచి ఇక్కడే వుండిపోన్ను’ అందటండి. సరే కానీ అని అటుపక్క దిగబెట్టేత్తావని సెప్పేరట. కానీ వొయసులో ఉన్న పిల్లని సూసేసరికి ఆళ్ళకి దుర్భుద్ధి పుట్టింది. ఇంకేటుంది? ఆళ్ళ కామానికి ఆ పిల్ల బలైపోయింది. ఆళ్ళు కార్లోంచి దించీశాక అక్కడే దగ్గిర్లోని పాడుపడిన బావిలో దూకి పేణం తీసుకుందట ఆ పిల్ల. పాపం... ఆళ్ళ తాత ఆ కార్లోని మనుసుల కోసం చాన్నాళ్ళు యెతికాడని అంటారు. ఆ పిల్ల కూడా దెయ్యవై ఆళ్ళని యెతుకుతూ అప్పుడప్పుడూ ఇటేపు ఎళ్ళే కార్లని ఆపి యెక్కుతుంటుందని ఇప్పటికీ సాలామంది అంటుంటారండి’’ అన్నాడు.
 
అతడు చెప్పడం పూర్తయ్యాక కొద్ది క్షణాల పాటు ఎవరూ మాట్లాళ్ళేదు. అనవసరంగా ఈ టైమ్‌లో ముసలాణ్ణి కదిపామేమో అనిపించింది.
 ‘‘ఇదంతా నిజమే అని నమ్ముతున్నావా తాతా?’’ అడిగాడు రాఘవ.
 ‘‘చాన్నాళ్ళ కిందట మా గూడెంలో ఈ ఇసయం పొగలాగా పుట్టిపోయింది బాబూ. అప్పున్నుంచీ ఎవరినోట ఆలకించినా ఇదేసంగతి. మరి నిజవేనా అంటే నాను మాత్రం ఏటి సెప్పగల్ను బాబూ!’’ అన్నాడు తాత.
 
అది నిజమైనా కాకపోయినా తాత చెప్పింది విన్నాక మా మనసుల్లో మాత్రం భయం మరింతగా వ్యాపించిదన్న మాట మాత్రం వాస్తవం!
 కాసేపు మళ్ళీ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో కీచురాళ్ళ రొద మరింత గట్టిగా వినబడుతున్నట్టుగా ఉంది. చల్లటి వాతావరణంలో కూడా నాకు చెమటలు పడుతున్నట్టుగా అనిపిస్తోంది. రాఘవ సంగతేమో గానీ మిగతావారి పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పగలను.
 ‘‘ఇలాంటి కథలను నమ్మడానికి లేదులే..’’ కిరణ్ వాతావరణాన్ని తేలిక చెయ్యడానికే అన్నా వాడి గొంతులో భయం స్పష్టంగానే ధ్వనించింది.
 ‘‘నిజమైనా కావచ్చు. ఇలాంటివి చాలాచోట్ల జరిగాయని మనం చదివాం కదా. దెయ్యం ఉనికిని గుర్తించినవాళ్ళు కూడా ఉన్నారు కదా...’’ అదేదో మామూలు విషయం అన్నట్టుగా అన్నాడు రాఘవ. కానీ ఆ మాటలు కిరణ్‌ని మరింత టీజ్ చెయ్యడానికే అన్నాడని మాకు అర్థమైంది.
 ‘‘చాల్చాల్లే... నిన్నే అడగాలి ఇలాంటి సంగతులు!’’ అన్నాడు కిరణ్.
 
‘‘సరే... ఇంకా విషయం వదిలేయండి. ఇంకేదైనా మాట్లాడండి’’ అన్నాడు శంకర్.
 మా మనసుల నిండా అప్పటికే భయం ఆవరించింది. ఎవరూ కొద్ది క్షణాల పాటు ఏమీ మాట్లాడలేదు. అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఏర్పడుతున్న ఈ నిశ్శబ్దాన్ని ఎదుర్కోవడం మరింత కష్టంగా ఉంది. చివరికి రాఘవే చొరవ తీసుకొని ఆర్నెల్ల క్రితం మేమందరం దేవీపురానికి వెళ్ళినప్పటి సంగతుల గురించి మాట్లాడ్డం మొదలుపెట్టాడు. క్రమంగా ఆ సంభాషణలో అందరం పాల్గొంటూ తలో సంగతి గుర్తు చేసుకోసాగాం. ఈ సూత్రం బానే పనిచేసినట్టుంది. కాసేపటికి మేమంతా నార్మల్ మూడ్‌లోకి వచ్చే సూచనలు కనిపించాయి. సరిగ్గా అప్పుడు జరిగింది అది...!
 
రోడ్డుకడ్డంగా ఓ అమ్మాయి నిలుచుని ఆపమని చేతులూపుతోంది. కాస్త దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూడగానే పోయిన భయం ఒక్కసారిగా రెట్టింపు ప్రభావంతో తిరిగొచ్చింది. ఈ టైమ్‌లో ఈ దారిలో నిలుచున్న ఆ అమ్మాయి ఎవరు? అసలు ఆమె మనిషేనా? లేక...?
 నా గుండె చప్పుడు స్పష్టంగా నాకే వినిపిస్తోంది. వెనక్కి తిరిగి రాఘవ వైపు చూశాను. వాడి మొహంలో ప్రశ్నార్థకం. కిరణ్ సంగతి చెప్పక్కర్లేదు. కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. అసంకల్పితంగా శంకర్ కారు స్లో చేశాడు.
 ‘‘పోనియ్ నీకేమైనా పిచ్చా? వేగంగా పోనియ్... ఆపకు...’’ అరిచాడు కిరణ్.
 
వెంటనే కారు వేగం పుంజుకుంది. ఆ అమ్మాయికి దూరం జరిగేటట్లుగా కుడివైపు సర్రున కోసి ఆమె దాటిపోగానే తిరిగి మెయిన్ రూట్లోకి వచ్చి దూసుకుపోయింది.
 ‘‘ఆపు... కారాపు...’’ గట్టిగా అన్నాడు రాఘవ.
 ‘‘ఎందుకురా ఆపమంటున్నావ్? కారు పోనీ శంకర్... ఆపొద్దు...’’ కిరణ్ కూడా గట్టిగానే అన్నాడు.
 ‘‘మీ మొహం... కొద్దిగానైనా ఆలోచించరేంట్రా...? తాత చెప్పిన కట్టుకథ విని ఆ మూడ్‌లోకి వెళ్ళిపోయి మీరేం చేస్తున్నారో మీకే తెలీడం లేదు. ఆ అమ్మాయి దెయ్యమేవిటి! దెయ్యమయితే కారాపకుండా వెళ్ళినంతమాత్రాన మనల్ని వదిలేస్తుందా? ఎగురుకుంటూ అయినా కార్లోకి వచ్చెయ్యదా? పాపం... ఆ అమ్మాయి ఏదో ఆపదలో వుందేమో? ఇలా వచ్చెయ్యడానికి మీకు మనసెలా ఒప్పుతోందిరా... దయచేసి నా మాట విని కారు వెనక్కి తిప్పిండి...’’ గుక్క తిప్పుకోకుండా అన్నాడు రాఘవ.
 
ఎవరూ మాట్లాళ్ళేదు.
 ‘‘అవును బాబూ... నాను కాటికాపరి పంజేశాను. శవాల మద్దిన, దెయ్యాల మద్దిన తిరిగినోణ్ణి. ఆ పిల్ల దెయ్యం కాదు బాబూ... పాపం... ఏడుత్తున్నట్టుంది... ఎవరో, ఎంచేత ఇక్కడుండిపోయిందో... కారు ఎనక్కి తిప్పి ఎక్కించుకోండి బాబూ... ఈ ముసిలాడికున్న ధయిర్యం కూడా మీకు నేదా బాబూ...’’ అంతవరకూ మౌనంగా ఉన్న తాత మాట్లాడాడు.
 మిగతా ముగ్గురం ఆలోచన్లో పడ్డాం.
 ‘‘ఒరేయ్.... దయచేసి వెనక్కి తిప్పండ్రా. మనం కాపాడకపోతే ఆ అమ్మాయికేదైనా ప్రమాదం జరగొచ్చు. ఆ ఉసురు మనకు తగులుతుందిరా...’’ మమ్మల్ని కన్విన్స్ చేస్తూ అన్నాడు రాఘవ.
 
కారు వెనక్కి తిరిగింది.
 అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి మోకాళ్ళ మీద కూర్చుని మొహం కప్పుకొని ఉంది. బహుశా ఏడుస్తోంది. కారు ఆగగానే ముందు రాఘవే దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆమె మొహం పెకైత్తి వాణ్ణి చూడగానే భోరున ఏడ్చింది. వాడు ఆ అమ్మాయిని సముదాయిస్తూ తీసుకొచ్చి కార్లోకి ఎక్కించాడు. వెనక సీట్లోనే నలుగురూ ఇరుక్కొని కూర్చున్నారు. కారు తిప్పి ముందుకు పోనిచ్చాడు శంకర్.
 
ఆ అమ్మాయికి పదహారు, పదిహేడేళ్ళుండొచ్చు. రాఘవ నెమ్మదిగా ఆమె దగ్గర్నుంచి విషయం రాబట్టాడు. ఆ అమ్మాయి వైజాగ్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. విహారయాత్రకి వాళ్ళ క్లాసు పిల్లలంతా బస్సు మీద అరకు, బొర్రా గుహలకొచ్చారు. తిరిగి బైల్దేరేసరికి మాలాగే ఆలస్యం కావడంతో ఈ అడ్డదారి ఎన్నుకున్నారు. మధ్యలో బస్సు ఆగిపోయింది. తిరిగి స్టార్ట్ అవడం లేదు. ఏం జరిగిందో చూస్తున్నారు. ఈ అమ్మాయి తలనొప్పిగా ఉందని చెప్పి వెనక సీట్లో పడుకొని ఉంది. బస్సు ఆగడంతో వెనక డోర్‌గుండా బైటికి దిగింది. టాయిలెట్‌కి వెళ్ళే ఆలోచనతో కాస్త వెనగ్గా పొదల చాటుకు వెళ్ళింది. ఈలోగా సడన్‌గా బస్సు స్టార్ట్ అయి ముందుకు కదిలింది. వెనకసీట్లో ఈ ఒక్క అమ్మాయే పడుకొని ఉండడం వల్ల ఈమె బస్సు దిగిన సంగతి ఎవరూ గమనించలేదు. బస్సు వెళ్ళిపోతున్న విషయం గమనించి ఈ అమ్మాయి బస్సు వెనక పరిగెత్తుకుంటూ ఆపమని కేకలు వేస్తూ వచ్చినా అప్పటికే బస్సు స్పీడందుకొని వెళ్ళిపోవడంతో ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది. అదీ జరిగిన విషయం!
 
అడవి నుంచి బైటపడుతున్నామనడానికి సూచనగా అక్కడక్కడ ఇళ్లు కనిపిస్తున్నాయి. మరి కాసేపటికి కాస్త దూరంలో ఎదురుగా మెయిన్‌రోడ్డు మీద వాహనాలు వెళ్తున్నట్లుగా లైట్లు కనిపించాయి. అప్పటికి మా మనసుల్లో భయం పోయింది. అట్నుంచి ఏదో వాహనం మావైపుగా వస్తోంది. కాస్త దగ్గరికి వచ్చాక అర్థమైంది... అదొక మినీ బస్సు. దాన్ని చూడగానే ఆ అమ్మాయి... ‘అది మా బస్సే...’ అంటూ అరిచింది.
 
కారాపుచేసి ఆ అమ్మాయిని తీసుకొని బస్సుకు ఎదురుగా వెళ్ళాం. వాళ్ళు ఆ అమ్మాయి మిస్సయిందని గమనించి వెనక్కి వస్తున్నారు. ఆ పిల్లను వాళ్ళకు అప్పజెప్పి తిరిగి కారు దగ్గరకు వచ్చాం. రాఘవ మాతో బస్సు దగ్గరికి రాకుండా కారు దగ్గరే నిలబడి ఉన్నాడు. తాత మాతో రావడం లేదు. మెయిన్‌రోడ్డు ఎదురుగానే ఉంది కాబట్టి రాఘవతో చెప్పేసి వెళ్ళిపోయినట్టున్నాడు. జరిగిన సంగతుల గురించే మాట్లాడుకుంటూ ఈసారి మా ట్రిప్పు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అనుకుంటూ నవ్వుకున్నాం.
 రాఘవ మాత్రం మా సంభాషణలో పాలు పంచుకోలేదు. ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మరో గంట ప్రయాణం తర్వాత విజయనగరం చేరుకున్నాం.

ఇది జరిగిన వారం తర్వాత మరుసటి ఆదివారం అంతా ఓ చోట కలుసుకున్నాం. కిందటి వారం అరకు ట్రిప్ గురించే మాట్లాడుకుంటున్నాం.
 ‘‘మొత్తానికి గొప్ప ఎక్స్‌పీరియెన్స్!’’ అన్నాను నేను.
 ‘‘అవును... ఆ టైమ్‌లో ఆ పరిస్థితిలో వెనక్కు వెళ్ళడం ఒకరకంగా సాహసమే... కానీ దానివల్ల ఓ అమ్మాయి రక్షించబడింది. ఆ తృప్తి చాలు మనకి. లేకపోతే ఆ బస్సు వెనక్కి వచ్చేలోగా ఆ అమ్మాయికేదన్నా ప్రమాదం జరిగుండొచ్చు’’ అన్నాడు శంకర్.
 ‘‘ప్రమాదమేమిటి నీ మొహం... నాలాంటి వాడికైతే అక్కడ ఏ ప్రమాదం జరక్కపోయినా అడవిలో ఒంటరిగా చిక్కుబడిపోయామన్న భయంతోనే గుండాగిపోయి ఉండేది...’’ సిన్సియర్‌గా అన్నాడు కిరణ్.
 రాఘవ ఇంకేదో ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా ఉన్నాడు.
 
‘‘నువ్వేం మాట్లాడవేంట్రా?’’ అన్నాన్నేను.
 ఒకసారి మావైపు చూసి ‘‘మనం సాహసం చేసింది నిజమేగానీ, అది ఆ అమ్మాయిని రక్షించడం కాదు...’’ సాలోచనగా అన్నాడు వాడు.
 ‘‘మరి...?’’ అడిగాడు.
 ‘‘తెలీకుండా మరో పెద్ద సాహసం చేశామేమో అనిపిస్తోంది. ఇది నిజమో కాదో గట్టిగా అడిగితే నేను చెప్పలేను. అందుకే ఈ విషయం ఇంతవరకూ మీకు చెప్పలేదు కూడా’’ అన్నాడు.
 ‘‘అబ్బ... అదేంటో చెప్పరా?’’ సస్పెన్స్ భరించలేనట్టు ఆతృతగా అన్నాడు కిరణ్.
 
‘‘ఆ రోజు మీరు బస్ దగ్గరకు వెళ్ళినప్పుడు నేను బైటికి వచ్చి కార్ డోర్ మూసేసి అక్కడే నిలబడ్డాను. డోర్ మూసినప్పుడు లోపల తాతను చూసినట్టే గుర్తుంది. మెయిన్‌రోడ్డు ఇంకాస్త దూరంలో ఉంది గదా... అక్కడ దిగుతాడేమో అనుకున్నా. తర్వాత మీరొచ్చారు. మళ్ళీ కార్ డోర్ తీసి చూసేసరికి తాత లోపల లేడు. నాకు అయోమయంగా అనిపించింది. నాకు చెప్పి వెళ్ళిపోయాడని మీరనుకున్నారు. అది నిజం కాదు. అసలతడు దిగినట్టుగానీ, వెళ్ళిపోయినట్టుగానీ నేను చూడనేలేదు. అసలా కార్ డోర్ తీసినట్టు కూడా అనిపించలేదు...!’’
 అందరం షాక్ తిన్నట్టుగా నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఇది నిజమా? లేక రాఘవ పొరబడ్డాడా? తాత ఎవరికీ చెప్పకుండా సెలైంట్‌గా దిగి వెళ్ళిపోయాడా? లేక మాయమైపోయాడా? అసలతడు ఎవరు? అతడు చెప్పిన కథలోని తాత అతడేనా? మా అందరిలో ఎన్నో ప్రశ్నలు!
 మా ప్రశ్నల్లో దేనికీ సమాధానాలు లేవు. ఆ రోజు జరిగింది తల్చుకుంటే మాత్రం ఇప్పటికీ మా గుండె కొట్టుకునే వేగం పెరుగుతూనే ఉంటుంది.
 
ఆ అమ్మాయికి పదహారు,  పదిహేడేళ్ళుండొచ్చు. రాఘవ నెమ్మదిగా ఆమె దగ్గర్నుంచి విషయం రాబట్టాడు. ఆ అమ్మాయి వైజాగ్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది.
- ఎం.రమేశ్ కుమార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement