M. S. Subbulakshmi
-
స్వర సరస్వతి
జగదోద్ధారకులు మన పిల్లల్లోనే ఉన్నారు. వారిని ఆడించండి. పాడించండి. దయచేసి శిక్షణ పేరుతో హింసించకండి - ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ‘మధుర నుంచి ఒకమ్మాయి వచ్చింది. టీనేజ్‌లోకి ప్రవేశిస్తోంది. ఆమె పాటను మేము రికార్డ్‌లో కట్ చేస్తున్నాం. వినేందుకు వస్తారా? వీలైతే అభిప్రాయాన్ని చెబుతారా?’ బెంగళూరు హెచ్ఎంవీ కంపెనీ మేనేజర్ తన స్నేహితుడు గోవిందరాజు వెంకటాచలాన్ని 1929వ సంవత్సరంలో ఒక ఉదయం అడిగారు. వెంకటాచలం ఎవరు? ఆనంద కుమారస్వామి, ఒ.సి. గంగూలీ,పెర్సీ బ్రౌన్, హెచ్.బి.హావెల్ వంటి 20వ శతాబ్దపు ప్రముఖ కళావిమర్శకుల పాలపుంతలో ముఖ్యుడు! వివిధ ఫైన్ ఆర్ట్స్ పత్రికలకు కాలమిస్ట్, వివిధ విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్. ప్రపంచదేశాలకు అనధికార భారత సాంస్కృతిక రాయబారి. ఆ ఆహ్వానాన్ని విని, ‘పొద్దున్నే మరొక బాల్యచేష్ట , ఏం వెళ్తాంలే’ అనుకున్నారు. ఏ సిక్త్సెన్సో చెప్పడంతో వెళ్లారు. విన్నారు. ఏమన్నారు?... ‘ఆమె గాత్రం వికసించే మొగ్గ పరిమళం. వదనం హృదయసౌందర్య భరితం. సంగీతం కోసమే పుట్టింది. జలపాతపు ఉధృతి, వీణానాదపు లాలిత్యం ఆమె గాత్రంలో ఉంది. చెవికి ఇంపైన గానాన్ని విన్పించేందుకు విద్వాన్లు, ఉస్తాద్‌లు తమ శరీరాలను క్యారికేచర్లుగా మలుచుకుంటున్న వేళ, చిత్రహింసలు పడుతున్న ముఖాలతో, భీతి గొలిపే చూపులతో సంగీతాభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్న వేళ, ఒక సహజ వదన సౌందర్యపూరితంగా మన ముందుకు వచ్చింది. ఈ బాలిక సంగీతంలోని గణితశాస్త్రాన్ని ప్రదర్శించదు. సంగీత సరస్వతిని శ్రోతలకు దర్శింపజేస్తుంది, మనోధర్మంతో!’ ఇంతకూ ఎవరా టీనేజ్ అమ్మాయి? ముద్దుపేరు కుంజమ్మ. పూర్తిపేరు మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి! పాపులర్ నేమ్ ‘ఎం.ఎస్’! ఆమె ఇష్టపడే పట్టుచీరెల రంగు ‘ఎం.ఎస్. బ్లూ’గా విఖ్యాతం! మధురైలో 1916 సెప్టెంబర్ 16న జన్మించారు. వెంకటాచలం చెప్పిన భవిష్యత్ వాణిని తన జీవితంలో ఎం.ఎస్. నిజం చేసారు.‘పక్షి చూడు ఎంత చక్కగా ఉందో! అంటే, అవును చాలా రుచికరంగా ఉంటుంది’ అనే భిన్న స్వభావాలున్న వాతావరణంలో పెరిగింది ఎం.ఎస్! బాగా పాడే కన్యకు మహారాజ పోషకుడిని అన్పించుకునే సరసులకు కొదువ లేని సమాజంలో దేవదాసి కుటుంబంలో జన్మించింది. అమ్మ అమ్మాళ్ వీణావిద్వాంసురాలు. కుంజమ్మను తీసుకుని చెన్నై విచ్చేసింది. కర్నాటక, హిందుస్తానీ సంగీతాల విశిష్టతలను కుంజమ్మ నేర్చుకుంది. సెవెన్టీన్త్ ఇయర్లో మెడ్రాస్ మ్యూజిక్ అకాడెమీలో కచేరీ ఇచ్చిన తొలి గాయని! శాస్త్రీయసంగీతం నేర్చుకుంటూనే సినిమాల్లో నటించింది. ప్రేమ్‌చంద్ కథ ‘బజార్-ఎ-హుస్న్’ ఆధారంగా నిర్మితమైన తమిళ చిత్రం ‘సేవాసదన్’లో కథా నాయికగా చేసింది. సావిత్రి (1941)లో నారదునిగా నవ్వించింది. రాజస్తానీ భక్తగాయని మీరా (1945)లో మీరాగా ప్రేక్షకుల మనస్సుల్లో ముద్రవేసింది. అంతటితో సినిమాలకు స్వస్తి పలికింది. ఈ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంతో తన భర్త, మార్గదర్శి, కె.సదాశివన్ ‘కల్కి’ పత్రికను స్థాపించడానికి దోహదపడింది. సదాశివన్ కాంగ్రెస్‌వాది. రాజాజీ సన్నిహితుడు. దేశభక్తి గీతాలు పాడేవాడు. ఎం.ఎస్ నోరు విప్పాక నేను మూసుకున్నాను అని చమత్కరించేవాడు. ‘హరి తుమ్ హరో’ ఇతరులు పాడగా వినడం కంటె సుబ్బులక్ష్మి చదవగా వినడమే తనకు ప్రశాంతతనిస్తుందన్నారు మహాత్మాగాంధీ. ‘ఆమె సంగీత సామ్రాజ్ఞి. నేను కేవలం ప్రధానిని’ అన్నారు నెహ్రూ . బడేగులాం ఆలీఖాన్ ‘సుస్వరలక్ష్మి’ అన్నారు. లత ‘తపస్విని’ అన్నారు. కవిగోకిల సరోజినీనాయుడు అసలు సిసలు ‘గానకోకిల’ ఎం.ఎస్ అన్నారు. శాస్త్రీయ సంగీతకారుల్లో భారతరత్న పొందిన తొలి విదుషీమణి ఎం.ఎస్. తన కచేరీల ద్వారా రికార్డుల ద్వారా వ చ్చిన ఆదాయాన్ని ధార్మిక సంస్థలకు విరాళంగా ప్రకటించారు. టీ.టీ.డీ తదితర ధార్మిక సంస్థలు, రికార్డింగ్ సంస్థలు, కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఎం.ఎస్ గాన నిధి ‘అభయం’ నుంచి పొందుతున్నాయి. తనకు భగవంతుడు ప్రసాదించిన గాత్రం ద్వారా తరతరాల మానవాళికి ఎం.ఎస్ ఇచ్చిన గొప్ప సంపద ‘అభయం’! - పున్నా కృష్ణమూర్తి (తిరుమలకొండ-పదచిత్రాలు, రచయిత) -
సుస్వరలక్ష్మి
సత్వం: ‘నేను మామూలు ప్రధానిని; నువ్వు సంగీత సామ్రాజ్ఞివి,’ అన్నారు జవహర్లాల్ నెహ్రూ, సుబ్బులక్ష్మి ఆలపించిన ‘వైష్ణవో జనతో...’ విన్న తన్మయత్వంలో. ఆమె గానానికి ముగ్ధులైనవాళ్లలో మహాత్మాగాంధీ, హెలెన్ కెల్లెర్, యెహుదీ మెనుహిన్, బడే గులాం అలీఖాన్ వంటివారు కొందరు మాత్రమే! ‘రవ్వంత సాంస్కృతిక జ్ఞానం’ ఉన్న ప్రతి భారతీయుడూ ఎమ్మెస్ను ఏదోరకంగా ఎరిగివుంటాడు! ఆమె గొంతులో పదాలెంత అందంగా పలుకుతాయో, పదాల మధ్య విరామమూ అంతే అందంగా వినబడుతుంది. పారిజాతాల్ని గుప్పిట్లోకి తీసుకున్నట్టు, పావురాళ్లను ప్రేమగా నిమిరినట్టు, యోగులెవరో ఉమ్మడిగా వరమొసగినట్టు, స్వర్గద్వారంలోకి బేషరతుగా ప్రవేశించినట్టు, దైవసన్నిధిలో తీరిగ్గా నడుము వాల్చినట్టు అనుభూతి కలుగుతుంది. గాయకీ, శ్రోతా ఏకకాలంలో అమరులవుతారు. పుట్టుకతో కాకపోయినా, తన ఆహార్యంతో మరింత బ్రాహ్మణురాలిగా ఆమె కనబడేవారు. కాంచీపురం పట్టుచీర, వజ్రం పొదిగిన నాసికాభరణాలు, తిలకం, విభూతి దిద్దుకున్న నుదురు, ముఖ్యంగా ఎంతటి సంక్లిష్టమైన రాగంలోనూ చెదరని ఆమె వదనపు ప్రసన్నత... కళను ఊపిరిగా బతికిన దేవదాసీల పరంపరలో ‘మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి’గా ఆమె జన్మించారు. పసిప్రాయంనుంచే సంగీత సరస్సులో ఈదులాడారు. ‘శకుంతల’(1940), ‘మీరా’(1945) లాంటి తమిళచిత్రాల్లో నాయికగా నటించారు. దుష్యంతుడి పాత్ర పోషించిన జి.ఎన్.బాలసుబ్రమణియంను ఆయన గానం సహా ఇష్టపడ్డారు. ఇక ఒక్క క్షణం కూడా మీనుంచి నేను వేరుపడి ఉండలేను, అని ఇరవైల్లోవున్న సుబ్బులక్ష్మి ఒక లేఖలో రాశారు. ‘కన్నా’ ‘అన్బే’(ప్రియమైన) లాంటి సంబోధనలతో జీఎన్బీకి సుబ్బులక్ష్మి రాసిన ఉత్తరాల్ని ఆమె జీవితచరిత్ర ‘ఎంఎస్- ఎ లైఫ్ ఇన్ మ్యూజిక్’ రాసిన టి.జె.ఎస్.జార్జ్ చూడగలిగారు. లేకపోతే, ఆమెలోని స్త్రీత్వాన్ని పట్టించే ఘటన చరిత్రపొరల్లో దాక్కుండిపోయేదే! అయితే, వారి ప్రేమ ఫలవంతం కాలేదు. అదే శకుంతల నిర్మాత త్యాగరాజన్ సదాశివంను ఆమె పెళ్లాడారు. భార్య మరణించివున్న సదాశివంతో ఆమె పెళ్లి... ఆమెకు ఉద్వేగ పరంగా నష్టం కలిగించిందేమోగానీ సంగీతపరంగా మేలు చేసిందంటారు! వివాహం తర్వాత పూర్తిగా భారతీయ ఇల్లాలిగా భర్తకు అంకితమైపోయారు. మొదటిభార్య పిల్లలు రాధ, విజయను తన బిడ్డల్లా స్వీకరించారు. పూర్తిగా కర్ణాటక సంగీతానికే తనను సమర్పించుకోవడానికి సినిమాలను వదిలేసిన సుబ్బులక్ష్మిని చేతిలోని వజ్రంలా సానపెట్టారు సదాశివం. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవాడు, కల్కి పత్రికను నడిపినవాడు, ‘రాముడికి లక్ష్మణుడు ఎంతో, నాకు సదాశివం అంత,’ అని రాజగోపాలచారిలాంటివాడిచే అనిపించుకున్న సదాశివం... భార్య శక్తినీ, విలువనీ పూర్తిగా ఎరిగి, నిర్వహణ సామర్థ్యంతోపాటు, ప్రజాసంబంధాలూ మెరుగ్గా ఉన్న సదాశివం... సుబ్బులక్ష్మిని పద్ధతిగా ప్రపంచగుమ్మపు ఒక్కో మెట్టే ఎక్కించారు. ఏం పాడాలో, ఎలా పాడాలో, ఏది ఒత్తి పలకాలో, ఏది పునరుచ్చరించాలో లాంటి ప్రతి చిన్న వివరాన్నీ ఆయన జాగ్రత్తగా చూసుకునేవారు. ఆమె ద్వారానే ఆయన సంగీత ప్రపంచంలో జీవిస్తే, ఆయన ద్వారానే ఆమె మొత్తంగా ప్రపంచంలోనే బతికింది. అందుకే ఆయన మరణించిన తర్వాత ఏ ఒక్క కచేరీ చేయలేదు. తమిళం, తెలుగు, సంస్కృతం, హిందీ, మలయాళం, కన్నడం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో పాడిన సుబ్బులక్ష్మి... ఏ సామాజిక కారణం కోసమైనా పాడకుండా లేరు. సదాశివం షష్టిపూర్తి సందర్భంగా ఆమెకు రాధ కానుకగా ఇచ్చిన బంగారుగాజుల్ని కూడా భారత్-పాక్ యుద్ధ సమయంలో ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశారట! మానవాళితో సంభాషించడానికి తనను దేవుడు పంపిన సంగీత వాద్యంగా భావించుకున్నారీ భారతరత్నం(1916-2004). విష్ణు సహస్రనామం, భజగోవిందం, హనుమాన్ చాలీసా లాంటి వాటితో భక్తిని ఉత్సవంగా మలిచారు. ‘వేంకటేశ్వర సుప్రభాతం’ వినడానికి ఎంతటి దేవుడూ ఉత్సాహంగా నిద్ర మేలుకోవాల్సిందే! తన ఉచ్చారణతో ఉచ్చారణను దిద్దుకునేంత స్పష్టంగా, ఒక మానవ కంఠనాళపు పరిధిని కూడా దాటి పాడారు. పాడినకొద్దీ తేటపడే గొంతుక ఆమెది. మనిషికీ దేవుడికీ మధ్య దూరాన్ని తగ్గించే గొంతు వంతెన ఆమెది.