
స్వర సరస్వతి
జగదోద్ధారకులు మన పిల్లల్లోనే ఉన్నారు. వారిని ఆడించండి. పాడించండి. దయచేసి శిక్షణ పేరుతో హింసించకండి
జగదోద్ధారకులు మన పిల్లల్లోనే ఉన్నారు. వారిని ఆడించండి. పాడించండి. దయచేసి శిక్షణ పేరుతో హింసించకండి
- ఎం.ఎస్.సుబ్బులక్ష్మి
‘మధుర నుంచి ఒకమ్మాయి వచ్చింది. టీనేజ్‌లోకి ప్రవేశిస్తోంది. ఆమె పాటను మేము రికార్డ్‌లో కట్ చేస్తున్నాం. వినేందుకు వస్తారా? వీలైతే అభిప్రాయాన్ని చెబుతారా?’ బెంగళూరు హెచ్‌ఎంవీ కంపెనీ మేనేజర్ తన స్నేహితుడు గోవిందరాజు వెంకటాచలాన్ని 1929వ సంవత్సరంలో ఒక ఉదయం అడిగారు. వెంకటాచలం ఎవరు? ఆనంద కుమారస్వామి, ఒ.సి. గంగూలీ,పెర్సీ బ్రౌన్, హెచ్.బి.హావెల్ వంటి 20వ శతాబ్దపు ప్రముఖ కళావిమర్శకుల పాలపుంతలో ముఖ్యుడు! వివిధ ఫైన్ ఆర్ట్స్ పత్రికలకు కాలమిస్ట్, వివిధ విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్. ప్రపంచదేశాలకు అనధికార భారత సాంస్కృతిక రాయబారి. ఆ ఆహ్వానాన్ని విని, ‘పొద్దున్నే మరొక బాల్యచేష్ట , ఏం వెళ్తాంలే’ అనుకున్నారు.
ఏ సిక్త్‌సెన్సో చెప్పడంతో వెళ్లారు. విన్నారు. ఏమన్నారు?... ‘ఆమె గాత్రం వికసించే మొగ్గ పరిమళం. వదనం హృదయసౌందర్య భరితం. సంగీతం కోసమే పుట్టింది. జలపాతపు ఉధృతి, వీణానాదపు లాలిత్యం ఆమె గాత్రంలో ఉంది. చెవికి ఇంపైన గానాన్ని విన్పించేందుకు విద్వాన్‌లు, ఉస్తాద్‌లు తమ శరీరాలను క్యారికేచర్‌లుగా మలుచుకుంటున్న వేళ, చిత్రహింసలు పడుతున్న ముఖాలతో, భీతి గొలిపే చూపులతో సంగీతాభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్న వేళ, ఒక సహజ వదన సౌందర్యపూరితంగా మన ముందుకు వచ్చింది. ఈ బాలిక సంగీతంలోని గణితశాస్త్రాన్ని ప్రదర్శించదు. సంగీత సరస్వతిని శ్రోతలకు దర్శింపజేస్తుంది, మనోధర్మంతో!’
ఇంతకూ ఎవరా టీనేజ్ అమ్మాయి? ముద్దుపేరు కుంజమ్మ. పూర్తిపేరు మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి! పాపులర్ నేమ్ ‘ఎం.ఎస్’! ఆమె ఇష్టపడే పట్టుచీరెల రంగు ‘ఎం.ఎస్. బ్లూ’గా విఖ్యాతం! మధురైలో 1916 సెప్టెంబర్ 16న జన్మించారు. వెంకటాచలం చెప్పిన భవిష్యత్ వాణిని తన జీవితంలో ఎం.ఎస్. నిజం చేసారు.‘పక్షి చూడు ఎంత చక్కగా ఉందో! అంటే, అవును చాలా రుచికరంగా ఉంటుంది’ అనే భిన్న స్వభావాలున్న వాతావరణంలో పెరిగింది ఎం.ఎస్! బాగా పాడే కన్యకు మహారాజ పోషకుడిని అన్పించుకునే సరసులకు కొదువ లేని సమాజంలో దేవదాసి కుటుంబంలో జన్మించింది.
అమ్మ అమ్మాళ్ వీణావిద్వాంసురాలు. కుంజమ్మను తీసుకుని చెన్నై విచ్చేసింది. కర్నాటక, హిందుస్తానీ సంగీతాల విశిష్టతలను కుంజమ్మ నేర్చుకుంది. సెవెన్టీన్త్ ఇయర్‌లో మెడ్రాస్ మ్యూజిక్ అకాడెమీలో కచేరీ ఇచ్చిన తొలి గాయని! శాస్త్రీయసంగీతం నేర్చుకుంటూనే సినిమాల్లో నటించింది. ప్రేమ్‌చంద్ కథ ‘బజార్-ఎ-హుస్న్’ ఆధారంగా నిర్మితమైన తమిళ చిత్రం ‘సేవాసదన్’లో కథా నాయికగా చేసింది. సావిత్రి (1941)లో నారదునిగా నవ్వించింది. రాజస్తానీ భక్తగాయని మీరా (1945)లో మీరాగా ప్రేక్షకుల మనస్సుల్లో ముద్రవేసింది.
అంతటితో సినిమాలకు స్వస్తి పలికింది. ఈ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంతో తన భర్త, మార్గదర్శి, కె.సదాశివన్ ‘కల్కి’ పత్రికను స్థాపించడానికి దోహదపడింది. సదాశివన్ కాంగ్రెస్‌వాది. రాజాజీ సన్నిహితుడు. దేశభక్తి గీతాలు పాడేవాడు. ఎం.ఎస్ నోరు విప్పాక నేను మూసుకున్నాను అని చమత్కరించేవాడు. ‘హరి తుమ్ హరో’ ఇతరులు పాడగా వినడం కంటె సుబ్బులక్ష్మి చదవగా వినడమే తనకు ప్రశాంతతనిస్తుందన్నారు మహాత్మాగాంధీ. ‘ఆమె సంగీత సామ్రాజ్ఞి. నేను కేవలం ప్రధానిని’ అన్నారు నెహ్రూ .
బడేగులాం ఆలీఖాన్ ‘సుస్వరలక్ష్మి’ అన్నారు. లత ‘తపస్విని’ అన్నారు. కవిగోకిల సరోజినీనాయుడు అసలు సిసలు ‘గానకోకిల’ ఎం.ఎస్ అన్నారు. శాస్త్రీయ సంగీతకారుల్లో భారతరత్న పొందిన తొలి విదుషీమణి ఎం.ఎస్. తన కచేరీల ద్వారా రికార్డుల ద్వారా వ చ్చిన ఆదాయాన్ని ధార్మిక సంస్థలకు విరాళంగా ప్రకటించారు. టీ.టీ.డీ తదితర ధార్మిక సంస్థలు, రికార్డింగ్ సంస్థలు, కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఎం.ఎస్ గాన నిధి ‘అభయం’ నుంచి పొందుతున్నాయి. తనకు భగవంతుడు ప్రసాదించిన గాత్రం ద్వారా తరతరాల మానవాళికి ఎం.ఎస్ ఇచ్చిన గొప్ప సంపద ‘అభయం’!
- పున్నా కృష్ణమూర్తి
(తిరుమలకొండ-పదచిత్రాలు, రచయిత)