సైనికుడు
మాచవరంలో ఉట్టిపడుతున్న జాతీయభావం
ఆర్మీలో చేరిన 11 మంది యువకులు
కొన్నేళ్లుగా దేశ సేవకే అంకితం
కఠినతరమైన విధులే అయినా సంతృప్తికరం
దేశరక్షణకు ఈ మాత్రం కష్టం తప్పదంటున్న యువకులు
యువతకు ఆదర్శం ఈ జవాన్లు
వెల్లివిరుస్తున్న దేశభక్తి
ఆర్మీవైపు ధనాసిరి యువత ∙తొమ్మిది మంది విధుల్లో
ఒక మాచవరం.. ఒక ధనాసిరి.. ఇక్కడి యువకులు ఇంజనీర్లు, వైద్యులు కావాలనుకోవడం లేదు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుంటున్నారు. ఈ రెండు గ్రామాల నుంచి వెళ్లి భారత సైన్యంలో చేరిన మన మెతుకుసీమ కుర్రాళ్ల గురించి స్వాతంత్య్ర దినోత్సవాన్ని
పురస్కరించుకుని ప్రత్యేక కథనం.. – మెదక్/జహీరాబాద్
‘కార్గిల్’ కదిలించింది!
1999లో కార్గిల్ యుద్ధ సమయంలో 9వ తరగతి చదువుతున్నాను. మన సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్థాన్ సైనికులను తరిమి కొట్టడం నన్ను కదిలించింది. ఆ యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాల కోసం నేను మరికొందరు మిత్రులతో కలిసి విరాళాలు సేకరించాను. ఇండియన్ ఆర్మీ నాలో స్ఫూర్తినింపింది. మన సైనికులు మన కోసం చేస్తున్న త్యాగం.. నాలో సైనికుడు కావాలనే లక్ష్యాన్ని ఏర్పరిచింది. మొదట్లో నా నిర్ణయాన్ని తల్లిదండ్రులు కాదన్నా తరువాత అంగీకరించారు. ప్రస్తుతం అసోంలో విధులు నిర్వర్తిస్తున్నాను.
– చాగంటి కాంతారావు, జవాన్
‘నీ తల్లిమోసేది నవ మాసాలేరా...! ఈ తల్లి మోయాలి కడవరకు రా..! కట్టే కాలే వరకు రా...!! ఆ రుణం తలకొరివితో తీరేను రా... ఈ రుణం ఏ రూపాన తీరేనురా..?’ అని ఓ సినీ గేయ రచయిత రాసినట్టుగానే తల్లి కన్నా దేశం గొప్పదే. ఎందుకంటే మనం కట్టెల్లో కాలేవరకు మోసేది మన దేశమే.. మరి, మనం పుట్టి పెరిగి పెద్దయినా ఈ దేశం కోసం ఏం చేయగలం?.. ఎలా చేయగలం?.. దేశం రుణం తీర్చుకోవడానికి దారేది..? అని ఆలోచించి దారి వెతుక్కున్నారు
మాచవరం గ్రామానికి చెందిన 11 మంది యువకులు. కొన్నేళ్లుగా ఆర్మీలో చేరి దేశ రక్షణకు కాపలా కాస్తున్నారు. సైనికులుగా దేశానికి సేవచేసే అదృష్టం కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు మాచవరం యువకులు. వారిలో ఓ ముగ్గురు ‘సాక్షి’తో ఫోన్లో తమ మనోగతాన్ని పంచుకున్నారు.
– మెదక్
జహీరాబాద్: మండలంలోని ధనాసిరి గ్రామం సైనికుల పుట్టినిల్లుగా మారింది. ఈ గ్రామానికి చెందిన అనేక మంది యువకులు ఆర్మీలో చేరి దేశానికి సేవచేస్తున్నారు. దేశరక్షణకు అనుక్షణం కష్టపడుతున్నారు. ప్రస్తుతం తొమ్మిది మంది విధుల్లో ఉండగా మరో 18 మంది రిటై ర్ అయ్యారు. ఎస్.గణపతి, దిగంబర్, గౌతం, శేఖర్, బస్వరాజ్, ఎం.భాస్కర్‌రెడ్డి, దేవరాజ్, జి.గుండప్ప, కె.బక్కారెడ్డిలు ప్రస్తుతం దేశం లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన వారు అనేక మంది ఆర్మీలో చేరి దేశానికి సేవలందిస్తుండడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ గ్రామానికే గర్వకారణంగా పేర్కొంటున్నారు.
మెదక్ మండలం మాచవరం ఓ చిన్న గ్రామం. జనాభా 1,400. ఇక్కడి నుంచి 11 మంది యువకులు ఆర్మీలో చేరి విధులు నిర్వహిస్తున్నారు. అందులో ముగ్గురు సైనికులు పోచయ్య, మల్లేశం, చాగంటి కాంతారావులు ‘సాక్షి’తో ఫోన్లో ముచ్చటించారు. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తోండడం ఎంతో సంతృప్తినిస్తోందని చెబుతున్నారు. ఇదివరకు ఎక్కడకెక్కడ ఎలా పనిచేసిందీ?, దేశరక్షణకు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో వారు పంచుకున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఏనాడూ వెన్ను చూపలేదని చెప్పుకొచ్చారు.
ఆ వివరాలు వారి మాటల్లో...
ఆర్మీలో ఉద్యోగమంటే ప్రాణం...
రామకిష్టయ్య–ఆగమ్మ మా అమ్మానాన్నలు. వారికి నేను రెండో సంతానం. 13 ఏళ్లుగా ఆర్మీలో చేరి జవానుగా పనిచేస్తున్నా. మిలటరీలో ఉద్యోగం చేయాలనేది నా చిన్ననాటి కోరిక. ఆ దిశగా కృషి చేసి నా కల నెరవేర్చుకున్నా. ఆర్మీలో ఉద్యోగం చేయడం భారతీయుడిగా ఎంతో గర్వంగా ఉంది. దేశరక్షణలో భాగంగా కళ్లముందు ఎన్నో ఘోర ఘటనలు జరిగినా అదరకుండా భారతమాత రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం.
2008–09 మధ్యకాలంలో మైనస్ 17 డిగ్రీల ఉష్ణోగ్రతలో నేను జమ్ముకాశ్మీర్, శ్రీనగర్ సరిహద్దుల్లో విధులు నిర్వహించా. ఓ రోజు అర్ధరాత్రి ఉగ్రవాదులు ఓ గ్రామంలో చొరబడి విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఆ ముష్కరుల కాల్పులకు అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. నాతోటి సహచరుడు కూడా ప్రాణాలు వదిలాడు. మరో మిత్రుడికి గాయాలయ్యాయి. అప్పుడు జవాన్లమంతా కలిసి ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాం.
24 గంటలపాటు హోరాహోరి కాల్పులు జరిగాయి. నిద్ర ఆహారం లేదు. మైనస్ డిగ్రీల్లో జరుగుతున్న హోరాహోరి కాల్పుల్లో ఆ ప్రాంతం వేడెక్కింది. కొంతమంది ఉగ్రవాదులు తప్పించుకుని వెళ్లిపోగా మరికొందరు మృత్యువాత పడ్డారు. ఈ రకంగా భరతమాత రుణం తీర్చుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం కొల్కటలో పనిచేస్తున్నా.
అమ్మానాన్నను ఒప్పించి...
ఆర్మీలో చేరేందుకు మొదట్లో అమ్మానాన్న ఒప్పుకోలేదు. వారిని అతికష్టం మీద ఒప్పించాను. 11 ఏళ్ల క్రితం నేను ఆర్మీలో చేరా. ప్రస్తుతం రాజస్థాన్‌లో పనిచేస్తున్నా జమ్మూలో పనిచేసిన అనుభవం ఉంది. సహజంగా ఒక్కకొడుకు ఉన్న దంపతులు ఆర్మీలోకి పంపాలంటే భయపడుతుంటారు. అందరిలాగే మాతల్లిదండ్రులు సైతం అడ్డుచెప్పారు. కానీ ఈ గడ్డపై పుట్టినందుకు దేశరక్షణ కోసం పాటుపడటం కన్నా మరెందులోనూ సంతృప్తి లేదని తల్లిదండ్రులను ఒప్పించా. ఈ దేశం నాకేం ఇచ్చిందనడం కన్నా.. ముందు ఈ దేశంకోసం నేను ఏం చేశానని ప్రతి యువకుడు ఆలోచించి దేశరక్షణలో పాలుపంచుకోవాలి. – మల్లేశం, జవాను
దేశభక్తితోనే ఆర్మీలోకి..
మా గ్రామ యువకుల్లో దేశభక్తి ఎక్కువ. ఆ కారణంగానే చాలామంది ఆర్మీలో పనిచేస్తున్నారు. మాజీ సర్పంచ్, స్వాతంత్యస్రమర యోధులు చందర్‌పాల్ గ్రామంలో సంఘం కార్యక్రమాలు నిర్వహించే వారు. ఇందులో గ్రామానికి చెందిన అనేకమంది చురుగ్గా చురుకుగా పాల్గొనే వారు. ప్రజల్లో దేశ భక్తి కూడా అధికంగా పెరిగింది. యువకులు దేశానికి సేవలందించాలనే ఉద్దేశంతో ఆర్మీలో చేరారు. ఇది మా గ్రామానికి ఎంతో గర్వకారణం. – ప్రతాప్ కుల్కర్ణి, ధనాసిరి
దేశానికి సేవలందించేందుకే...
దేశానికి సేవలందించాలనే ఉద్దేశంతో మా గ్రామానికి చెందిన అనేక మంది ఆర్మీలో చేరారు. దేశ భక్తితోపాటు ప్రతిభతో ఉద్యోగాలు సంపాదించారు. ధనాసిరికి చెందినవారు చాలామంది ఆర్మీలో చేరడం జహీరాబాద్ ప్రాంతానికే గర్వకారణం.
– బన్నెల్లి మల్లికార్జున్‌రెడ్డి, ధనాసిరి, సత్వార్ పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు
నా సోదరుడు ఆర్మీలో చేరడం సంతోషంగా ఉంది
నా సోదరుడు ఎస్.గణపతి ఆర్మీలో చేరి దేశానికి సేవలందించడం సంతోషంగా ఉంది. జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో జేసీఓగా సేవలందిస్తున్నాడు. ఆయన ఆర్మీలో చేరడం మా గ్రామానికి ఎంతో గర్వంగా ఉంది. దేశానికి సేవలందించడమే కాదు కుటుంబ యోగక్షేమాలు కూడా చూస్తున్నాడు.
– ఎస్.సంతోష్, ధనాసిరి