వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీటిని అందివ్వాలి
వైఎస్ఆర్ర్ సీపీ జిల్లా అధ్యక్షుడు భగవంత్‌రెడ్డి
లింగాల : నాగర్‌కర్నూల్ జిల్లాలోని అన్ని గ్రామాలకు వచ్చే ఖరీఫ్ నాటికి ఎంజీకేఎల్ఐ కాల్వల ద్వారా సాగునీటిని అందివ్వాలని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం లింగాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. అప్పటల్లో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయించారని తెలిపారు. 10లక్షల ఎకరాలకు సాగునీటిని అందివ్వాలనే సంకల్పం వైఎస్‌కు ఉండేదన్నారు. కేఎల్ఐ కాల్వల నిర్మాణానికి రూ.2990కోట్లు అంచనాలు ఉండగా అప్పట్లో రూ.1,930కోట్లు ఇచ్చారన్నారు.
నేటి ప్రభుత్వం మిగులు పనులు చేయకుండా కాల్వల నిర్మాణం మేమే చేపట్టామని చెప్పుకోవడం హస్యాస్పదంగా ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సాగునీటిని అందివ్వాలని, ఆ తర్వాతనే డిండికి నీటిని తరలించాలన్నారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నిరంజన్, నాయకులు కొండుర్ శేఖర్, మన్సూర్, ఉస్సేన్, లింగాల మండల శాఖ అధ్యక్షులు ఇర్కు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి
నూతనంగా ఏర్పడిన నాగర్‌కర్నూల్ జిల్లాలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు భగవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.