తండ్రి దిద్దిన చాంపియన్
పిల్లలకి ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహిస్తే... వారు జీవితంలో అత్యున్నతస్థాయికి చేరుకుంటారని తాజాగా మాగ్నస్ కార్ల్సెన్ నిరూపించాడు. తమ అబ్బాయి చెస్ మాత్రమే ఆడాలని ఏనాడూ కార్ల్సెన్ తల్లిదండ్రులు సిగ్రున్, హెన్రిక్ అల్బెర్ట్ ఒత్తిడి చేయలేదు. కుమారుడిలో ఉన్న అపార ప్రతిభను, సహజ నైపుణ్యాన్ని గుర్తించి తమవంతుగా ప్రోత్సహించారు. కార్ల్సెన్ విజయ నేపథ్యం గురించి తండ్రి హెన్రిక్ మాటల్లో... ‘మేము కొంతకాలం ఫిన్లాండ్లో ఉన్నాం. అక్కడ కార్ల్సెన్కు మిత్రులెవరూ లేకపోవడంతో లెగో (విడివిడిగా ఉండే బొమ్మలను ఒక క్రమంలో పేర్చి ఒక రూపం ఇవ్వడం) గేమ్స్ ఆడేవాడు.
నాలుగేళ్ల వయస్సులోనే లెగో ద్వారా అతను కనీసం ఆరేడు గంటలు ఏకాగ్రతతో, ఎలాంటి అలసట లేకుండా ఉండేవాడని గ్రహించాను. ఈ లక్షణాలతో అతను చెస్ ప్లేయర్ కాగలడనే నిర్ణయానికి వచ్చాను. అతనికి చెస్ ఆటను పరిచయం చేయడంతోపాటు అపుడపుడూ గేమ్‌లు ఆడేవాడిని. కార్ల్సెన్కు ఏడేళ్ల వయసులో మా పెద్దమ్మాయి కూడా చెస్ ఆడటం ప్రారంభించింది. అక్క ఆటను చూసిన కార్ల్సెన్ ఆమెను ఓడించాలనే లక్ష్యంతో చెస్‌ను సీరియస్‌గా తీసుకొని తీవ్ర సాధన చేయడం ప్రారంభించాడు.
మూడు నెలల తర్వాత అక్కను ఓడించాడు. నార్వే జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న తొలిసారి 11వ స్థానం పొందాడు. కార్ల్సెన్కు పదేళ్లు వచ్చేసరికి గంటలకొద్దీ చెస్ బోర్డుకే అంకితమైపోయాడు. స్కూల్ హోంవర్క్ కూడా మేము గుర్తుచేసేవాళ్లం. 13 ఏళ్లకు గ్రాండ్‌మాస్టర్ హోదా సంపాదించాడు. 16 ఏళ్లు వచ్చాక కూడా ఉన్నతవిద్య అభ్యసిస్తే బాగుంటుందని సూచించేవాళ్లం. కానీ చెస్ తప్ప మరో లోకం తెలియకుండా కార్ల్సెన్ ముందుకు దూసుకెళ్లాడు. మేము కూడా మా అబ్బాయి ఆసక్తిని గమనించి ప్రోత్సహించాం. ఆ ఫలితం మీరూ చూస్తున్నారు’.
కుటుంబం అండ...: కార్ల్సెన్ కెరీర్‌కు మొదటి నుంచి తండ్రి అండగా ఉన్నారు. తన ఆర్థిక వ్యవహారాలు, స్పాన్సర్‌షిప్‌లు అన్నీ పర్యవేక్షిస్తారు. కార్ల్సెన్ అసలు వీటి గురించి పట్టించుకోడు. కేవలం గేమ్ విషయంలో మాత్రమే బయటివారి సలహాలు వింటాడు. తనకు ఒక అక్క, ఇద్దరు చెల్లెల్లు. చెస్ చాంపియన్‌షిప్ కోసం వీళ్లంతా కూడా చెన్నై వచ్చారు.
- సాక్షి క్రీడావిభాగం