కేజ్రీవాల్ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్: సంజయ్ సింగ్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో కుట్ర చేసి సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని అన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఇదే సమయంలో లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్ ఇచ్చారని గుర్తు చేశారు.
కాగా, సంజయ్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి మనీ ట్రయల్ ఆధారాలు లేవు. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్‌కు కుట్రలు చేశారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి.. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆప్‌ను నాశనం చేయాలని బీజేపీ చూస్తోంది. బీజేపీతో కలిస్తే ఎలాంటి కేసులు ఉండవు. అలాగే, కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు మాగుంట శ్రీనివాస్‌కు టీడీపీ టికెట్ ఇచ్చారు. బీజేపీతో పొత్తులో భాగంగానే ఇదంతా జరిగింది. ఆయన ఇప్పుడు మోదీ ఫొటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారు’ అని కామెంట్స్ చేశారు.
#WATCH | Delhi: Aam Aadmi Party MP Sanjay Singh says, "There is one person, Magunta Reddy, who gave 3 statements, his son Raghav Magunta gave 7 statements. On 16th September, when he (Magunta Reddy) was first asked by ED whether he knew Arvind Kejriwal, he told the truth and said… pic.twitter.com/YzyPrZxYAQ
— ANI (@ANI) April 5, 2024
ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో ఆర్నెల్ల పాటు తీహార్ జైల్లో ఉన్న సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన గురువారం రాత్రి విడుదలయ్యారు. ఆప్ కార్యకర్తలు వెంట ర్యాలీగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ భార్య సునీతను కలిసి ఆమెకు పాదాభివందనం చేశారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల నివాసాలకు కూడా వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శిస్తానని చెప్పారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ నియంత పాలనలో దేశమంతా నలిగిపోతోందంటూ దుమ్మెత్తిపోశారు. మోదీ సర్కారు ఎంతగా వేధించినా ఆప్ బెదరబోదు. కేజ్రీవాల్ రాజీనామా చేయబోరు. రెండు కోట్ల మంది ఢిల్లీవాసుల ప్రయోజనాల పరిరక్షణకు జైలు నుంచే సీఎంగా విధులు నిర్వర్తిస్తారు. ఆయన, సిసోడియా, జైన్ త్వరలోనే విడుదలవుతారు’ అని అన్నారు.