Mahakalesvar
-
మహాకాళేశ్వరం గోడ కూలి ఇద్దరు మృతి
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మహాకాళేశ్వరం ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతిచెందారు. ఆలయానికున్న గేట్ నంబర్ నాలుగుకు ముందు మహాకాళ్ లోక్ ఫేజ్ టూ సమయంలో నిర్మించిన గోడపై మరొక గోడను నిర్మిస్తున్నారు. భారీ వర్షానికి ఈ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, గోడలోని కొంత భాగం కూలిపోగా, దాని కింద నలుగురు సమాధి అయ్యారని ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, బాధితులను శిథిలాల నుంచి రక్షించి జిల్లా ఆస్పత్రికి తరలించారన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఇండోర్‌కు తరలించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. మృతులను ఫర్హీన్ (22), అజయ్ యోగి (27)గా గుర్తించినట్లు సీఎంహెచ్వో ఏకే పటేల్ తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించారు.ఇది కూడా చదవండి: ‘కేజ్రీవాల్ జైల్లో ఎందుకు రాజీనామా చేయలేదు?’ -
మహాకాళేశ్వరునికి విశేష హారతి.. మువ్వన్నెల వస్త్రం
నేడు(పంద్రాగస్టు) దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం మహాకాళేశ్వర ఆలయంలో స్వామివారికి విశేష హారతి ఇవ్వడంతోపాటు మువ్వన్నెల వస్త్రాన్ని సమర్పించారు.ఈరోజు తెల్లవారుజామునే మహాకాళేశ్వరుని ముంగిట భస్మహారతి కూడా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భస్మహారతి అనంతరం మహాకాళేశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం మువ్వన్నెల వస్త్రాన్ని సమర్పించారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి నుంచే ఆలయం అంతటా ఆకర్షణీయమైన లైట్లను అలంకరించారు. దీంతో ఆలయం మూడు రంగుల కాంతితో వెలుగొందింది. ఆలయం పైభాగంలో జాతీయ జెండాను కూడా ఎగురవేశారు. ఆలయ పూజారులు తెలిపిన వివరాల ప్రకారం అన్ని హిందూ పండుగలతో పాటు జాతీయ పండుగలను కూడా ఆలయంలో నిర్వహిస్తారు. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు
ఉత్తరాదిన ఈరోజు శ్రావణమాసంలోని నాల్గవ సోమవారం. ఈ సందర్భంగా భక్తులు శివాలయాలకు చేరుకుని పూజలు చేస్తున్నారు. దీంతో ఆలయాలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఉజ్జయిని మహాకాళీశ్వరునికి ఘనంగా భస్మహారతి నిర్వహించారు. దీనిని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. #WATCH | Ujjain, Madhya Pradesh: Bhasma Aarti performed at Mahakaleshwar Temple on the fourth Monday of the holy month of 'Sawan'. pic.twitter.com/8da9zfvocK— ANI (@ANI) August 11, 2024ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.#WATCH | Deoghar, Jharkhand: Devotees gather in huge numbers to offer prayers, on the fourth Monday of 'Sawan' month. pic.twitter.com/4zGvX14YB5— ANI (@ANI) August 11, 2024జార్ఖండ్‌లోని డియోఘర్‌లో శివాలయాయాలలో పూజలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.#WATCH | Uttar Pradesh: Devotees gather in huge numbers to offer prayers, on the fourth Monday of 'Sawan' month, at Shri Mankameshwar Mahadev Mandir in Prayagraj pic.twitter.com/qd3iu6iBPL— ANI (@ANI) August 12, 2024ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని మంకమేశ్వర్ మహాదేవ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఢిల్లీలోని గౌరీ శంకర్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. #WATCH | Devotees gather in huge numbers to offer prayers, on the fourth Monday of 'Sawan' month, at Shri Gauri Shankar Mandir in Delhi pic.twitter.com/JXKpEOSO8t— ANI (@ANI) August 12, 2024 -
భస్మహారతికి పోటెత్తిన భక్త జనం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోగల మహాకాళేశ్వరుని ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రావణమాసం(ఉత్తరాదిన)లోని రెండవ సోమవారం(నేడు) సందర్భంగా భక్తులు మహాకాళేశ్వరుని దర్శనం కోసం తరలివస్తున్నారు.ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి అందించారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించారు. శ్రావణమాసంలో మహాకాళేశ్వరుని దర్శనం కోసం విదేశాల నుంచి కూడా భక్తులు ఉజ్జయినికి తరలివస్తుంటారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. శ్రావణమాసం రాకకు ముందే ఆలయ ప్రాంగణం అంతటా రంగులు వేశారు. ఈ మాసంలో ఆలయంలో నిర్వహించే మహాశివుని ఊరేగింపు వైభవంగా జరుగుతుంటుంది. దీనిని చూసేందుకు భక్తజనం అమితమైన ఆసక్తి చూపిస్తారు. Ujjain, MP: "Thousands of devotees are at Baba Mahakal's court, eager to catch a glimpse of him. This will continue from morning until evening," says Ashish (Priest) pic.twitter.com/sFW0U2Tquo— IANS (@ians_india) July 29, 2024 -
Mahakal: మహాకాళ్ లోకపు ప్రత్యేకతలు తెలుసా?
ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశిష్ట ప్రత్యేకతతో కూడుకున్న జ్యోతిర్లింగం.. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ప్రసిద్ధ శైవ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినీ పట్టణంలో ఉంది. క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం ఇదేనని చెప్తారు. ఇతర చిత్రాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తితో యేర్పడిన శివలింగంగా భావిస్తారు. అంతేకాదు.. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయ ప్రాంగణం కొత్త సొగసులతో.. సరికొత్తగా ముస్తాబు అయ్యింది. రుద్రసాగరం సమీపాన ఉన్న శ్రీ మహా కాళేశ్వరాలయ కారిడార్ ఇవాళ(మంగళవారం) ప్రారంభం కాబోతోంది. మహాకాళ్ లోక్ పేరిట అభివృద్ధి చేసిన పనులను ఆవిష్కరించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కార్తిక్ మేళా గ్రౌండ్లో ప్రజల సమక్షంలో ఆయన పాల్గొనున్నారు కూడా. పూజ తర్వాత ఈ కారిడార్‌ను జాతికి అంకితం చేయనున్నారాయన. Har Har Mahadev! The newly built Mahakal Corridor in Ujjain. pic.twitter.com/dA4ZgeEejD — Y. Satya Kumar (సత్యకుమార్) (@satyakumar_y) October 8, 2022 ► మహాకాళేశ్వర ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేస్తారు. ► ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని "దక్షిణామూర్తి" అని కూడా అంటారు. ► ఉజ్జయినిలో శివలింగాలు మూడుఅంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కంటే కింద మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆ పైన నాగేంద్ర స్వరూపమైన లింగం ఉంటుంది. ► రెండు ఫేజ్‌లు మహాకాళ్ లోక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కారిడార్ కోసం రూ.856 కోట్లు కేటాయించారు. విశాలమైన కారిడార్‌లో శివతత్వం ఉట్టిపడే అలంకరణలతో పాటు సందర్శకులను ఆకర్షించేలా పలు నిర్మాణాలు చేపట్టారు. ► మొదటి ఫేజ్ నిర్మాణానికి రూ.316 కోట్లు ఖర్చు అయ్యింది. 900 మీటర్ల కంటే పొడవైన ఈ కారిడార్.. దేశంలోనే అతిపెద్ద కారిడార్‌గా గుర్తింపు దక్కించుకోబోతోంది. ► మహాకాళేశ్వర ఆలయం చుట్టూరా పాత రుద్రసాగర్ సరస్సు చుట్టూరా ఈ కారిడార్ విస్తరించి ఉండనుంది. Preview of Mahakal Corridor. Newly developed corridor at the Mahakaleshwar temple has been named Sree Mahakal Lok, & its design is inspired by Shiv Leela. Murals & statues portray various aspects of Lord Shiva. On Oct 11, PM @narendramodi Ji will inaugurate it.#ShriMahakalLok pic.twitter.com/uK0Tfyg7q6 — Shobha Karandlaje (@ShobhaBJP) October 9, 2022 ► ఈ కారిడార్‌కు రెండు భారీ నందీద్వారం, పినాకి ద్వారం ఉన్నాయి. ఈ రెండు గేట్వేస్లో తక్కువ దూరంలోనే కారిడార్ ప్రారంభంలో ఉంటాయి. ► ఇక ఈ కారిడార్‌కు మరో ప్రత్యేకత.. విశేష అలంకరణలతో కూడిన 108 స్తంభాలు. ఇసుక రాళ్లు, ఫౌంటైన్లు, శివ పురాణం నుండి కథలను వర్ణించే 50 కంటే ఎక్కువ కుడ్యచిత్రాలు ఉన్నాయి. ► కారిడార్ ప్రాజెక్ట్‌లో మిడ్-వే జోన్, పార్క్, కార్లు, బస్సుల కోసం బహుళ అంతస్థుల పార్కింగ్. పూలు, ఇతర వస్తువులు అమ్మే దుకాణాలు, సోలార్ లైటింగ్, యాత్రికుల సౌకర్యాల కేంద్రం, నీటి పైప్‌లైన్, మురుగునీటి లైన్ మొదలైనవి కూడా ఉన్నాయి. అలాగే, లైట్, సౌండ్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశారు. ► ఇక రూ.310.22 కోట్లతో సెకండ్ ఫేజ్ పనులు కొనసాగుతున్నాయి. రుద్రసాగర్కు పునర్వైభవ పనులు ఇందులోనే సాగుతున్నాయి. A Golden era for Cultural rejuvenation under leadership of Hon'ble PM Shri @narendramodi Ji - Started with Kedarnath Shrine, then Kashi Vishwanath & now Ujjain #MahakalCorridor. Redevelopment of ancient temples for promoting religious tourism is a key priority of @BJP4India govt. pic.twitter.com/aYv4mVvlqm — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2022 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► రెండో దశ అభివృద్ధి పనుల్లో.. ఆలయ తూర్పు, ఉత్తర ముఖాల విస్తరణ ఉంటుంది. ఉజ్జయిని నగరంలోని మహారాజ్‌వాడ, మహల్ గేట్, హరి ఫాటక్ వంతెన, రామ్‌ఘాట్ ముఖభాగం, బేగం బాగ్ రోడ్ వంటి వివిధ ప్రాంతాల అభివృద్ధి కూడా ఇందులో ఉంది. పురాణాల ప్రకారం.. ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయుటకు గల నగరాలలో ఒకటిగా భాసిల్లింది. పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. శివారాధనకే అంకితం అయ్యేవాడు. ఒకరోజు ఓ రైతు కొడుకు అయిన శ్రీకరుడు, రాజభవనం పరిసరాలలో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోనికి ప్రవేశించి ఆయనతోపాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు శ్రీకరుడిని బలవంతంగా రాజ్యం వెలుపల గల క్షిప్ర నదీ సమీపంలోనికి పంపిస్తారు. ఉజ్జయినికి ప్రక్కగల రాజ్యాలలోని శత్రు రాజులు రిపుదమన రాజు, సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది. ఆయన నిర్ఘాంతపోయి.. క్షిప్ర నదీ తీరంలో మహాశివుని కోసం ప్రార్థనలు చేస్తాడు. శివుడు తన భక్తుల అభ్యర్థనలు విని మహాకాళుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి చేరిన శత్రువులనందరినీ నాశనం చేశాడు. శివభక్తులైన శ్రీకరుడు, వ్రిధి ల అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండుటకు అంగీకరిస్తాడు. ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాళునిగా కాంతి రూపంలో కొలువైనాడు. పరమేశ్వరుడు ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి మరణ, వ్యాధుల భయం నుండి విముక్తి కల్పిస్తాడనే నమ్మకం ఉంది. -
రెండో ఉజ్జయిని.. రాజమహేంద్రవరం
ఓవైపు వేదంలా ఘోషించే గోదావరి.. మరోవైపు అమరధామంలా భాసిల్లే రాజమహేంద్రి.. ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శన భాగ్యం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోనూ వీక్షించే అవకాశం భక్తులకు దక్కుతోంది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అక్కడ నిత్యం... ‘నాగేంద్రహారాయ త్రిలోచనాయ.. భస్మాంగరాయ మహేశ్వరాయ.. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ.. తస్త్మేన్త కారాయ నమశ్శివాయ!’ అంటూ వేద మంత్రాలు వినసొంపుగా వినిపిస్తుంటాయి. మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనంద ఝరిలో ఓలలాడిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వరాలయం గోదావరి చెంత కొలువుదీరింది. ఈ ఆలయం దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరం వచ్చే భక్తులను భక్తిపారవశ్యంతో కట్టిపడేస్తోంది. రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయ విశేషాలు ఇవి.. ఆలయ నిర్మాణానికి బీజం పడిందిలా.. రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మార్వాడీలతోపాటు ఉజ్జయిని వెళ్లిన రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగలు వెంకట్రావు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. దేశం గర్వించదగ్గ ఇటువంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన నిర్మించాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి జరిపే భస్మాభిషేకానికి మహాద్భుతమైన క్రతువుగా దేశవ్యాప్తంగా పేరుంది. ఈ భస్మాభిషేకాన్ని చూడటానికి దేశం నలుమూలల పెద్ద ఎత్తున భక్తులు ఉజ్జయిని వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ఉజ్జయిని మహాకాళేశ్వరాలయాన్ని సందర్శిస్తే లభించే అనుభూతిని దక్షిణాది రాష్ట్రాల భక్తులకు అందించాలని రాజమహేంద్రవరంలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పవిత్ర గోదావరి నదీ తీరాన గౌతమీ ఘాట్‌లో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది. ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభమైంది. ఆధునికత ఉట్టిపడేలా.. ఆధ్యాత్మికుల మనసు దోచుకునేలా.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వాసు అనే శిల్పి రూపొందించిన అద్భుతమైన నమూనాతో మహాకాళేశ్వరుడి ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుంది. భూమి ఉపరితలం నుంచి 55 అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన 109 అడుగుల గర్భాలయ నిర్మాణం భక్తుల మనసు దోచుకుంటోంది. 75 అడుగుల ఎత్తైన నాలుగు గాలిగోపురాలు, 50 అడుగులతో అతి విశాలమైన నాలుగు మండపాలు, 55 అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు బలిపీఠాలు, నాలుగు త్రిశూలాలు, నాలుగు నందులను తిలకించారంటే భక్తులు ఆనందపారవశ్యంతో మునిగితేలాల్సిందే. గర్భాలయానికి నాలుగు వైపుల గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం. 32 ద్వైత, 32 అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా 64 ఉపాలయాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉప ఆలయాలను దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్లేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. గర్భాలయంలో ప్రధాన శివలింగంతోపాటు బలిపీఠాలు, నందులు తిరుమలలో, ఉప ఆలయాల్లోని విగ్రహాలను రాజస్థాన్‌లోని జైపూర్‌లో తయారుచేయించారు. ప్రత్యేకం.. భస్మాభిషేకం రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది.. భస్మాభిషేకం. ఇక్కడ రోజూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు శాస్త్రోక్తంగా జరిపే భస్మాభిషేకాన్ని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తోన్న రెండు కైలాస భూముల నుంచి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తెస్తారు. దేహం చాలించిన వారి చితాభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి అర్చకులు అభిషేకిస్తారు. దేహం చాలించిన ప్రతి ఒక్కరి ఆత్మ చితాభస్మాభిషేకంతో శాంతిస్తుందనేది భక్తుల నమ్మకం. ఉజ్జయినిలో అయితే భస్మాభిషేకానికి పురుషులను మాత్రమే అనుమతిస్తారు. కానీ రాజమహేంద్రవరంలో మహిళలకు కూడా అనుమతిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అందుబాటులో ఉండాలనే.. రాజమహేంద్రవరం ఖ్యాతి దేశం నలుదిశలా విస్తరించాలనే సంకల్పంతోనే ఆలయం నిర్మించాం. చారిత్రక నగరం కావడంతో ఇక్కడి ప్రాశస్త్యం భావితరాలకు గుర్తుండిపోవాలనే ఆలయాన్ని ప్రారంభించాం. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఇది ఎంతో అందుబాటులోకి వచ్చింది. మరింత అభివృద్ధి చేస్తాం. – పట్టపగలు వెంకట్రావు, చైర్మన్, రోటరీ చారిటబుల్ ట్రస్ట్, మహాకాళేశ్వరాలయం -
కశ్మీర్ తగలబడుతోంది
ఉజ్జయిని: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన తప్పుల కారణంగా కశ్మీర్ తగలబడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపిం చారు. రెండురోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఆయన పర్యటించారు. ముందు గా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివభక్తుడైన రాహుల్ గాంధీ 2010లోనూ ఈ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మాల్వా– నిమాడ్ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడుతూ..ఒక ర్యాంకు– ఒక పెన్షన్ (ఓఆర్ఓపీ) పథకంపై ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మరోవైపు గత కొద్దీ రోజులుగా కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తప్పిదాల కారణంగా జవాన్లు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులకు కశ్మీర్ తలుపులు బార్ల తీసిందని ఆరోపించారు. ఎప్పుడు సర్జికల్ స్ట్రైక్స్, ఆర్మీ, నేవీ గురించి మాట్లాడే మోదీ..సైనికుల సమస్యలపై మాత్రం పల్లెత్తు మాట మాట్లాడరని విమర్శించారు. అసలు సర్జికల్ స్ట్రైక్స్ వల్ల సాధించింది ఏమిటో ప్రజలకు చెప్పాలని మోదీని డిమాండ్ చేశారు. -
జ్యోతిర్లింగాల క్షేత్రం ఓంకారేశ్వర్!
నర్మదానది నీటి పరవళ్లలో అల్లనల్లన తేలియాడుతూ వచ్చే చల్లని గాలి ఓంకార నాదం చేస్తూ హృదయంలో భక్తిరసాన్ని తట్టిలేపుతుంది. వింధ్య పర్వత సోయగాల వీక్షణతోనే మనసు శివపంచాక్షరి స్తోత్రాన్ని జపించడంలో మునిగిపోతుంది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై న కారాయ నమఃశివాయ... అంటూ స్వామిని స్తుతిస్తూ ఓంకారేశ్వరుని ఆలయానికి చేరుకుందాం. నర్మద, కావేరీ సంగమ క్షేత్రం ఓంకారేశ్వర్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహిమాన్వితమైన రెండు జ్యోతిర్లింగాలు ఓంకారేశ్వర్‌లోనే ఉండటం ఈ ప్రాంత విశిష్టత. మన దేశంలోని మధ్యప్రదేశ్‌లో ఇండోర్ పట్టణానికి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర్. కాషాయ దుస్తులు ధరించిన సాధువులు, గంభీరంగా సాగే నర్మదానది, అక్కడి ఘాట్లలో భక్తుల సందడి.. చూడగానే మనసుకు కాశీ క్షేత్రం తలపుకు రాకుండా ఉండదు. అందుకే ఈ పట్టణాన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. నర్మదానది ఒడ్డునే ఓంకార రూపంలో వింధ్యపర్వతం ఉంది. ఈ పర్వతం ఓంకార రూపంలో ఉండటంతో స్వామికి ఓంకారేశ్వరుడు అని, స్వామి పేరుమీదుగానే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది. గిరి పరిక్రమ ఫలితం ఎంతెంతో! ఇక్కడ నర్మదా నది స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు ఉండటం విశేషం. అందుకే భక్తులు కూడా నదికి, స్వామికి పరిక్రమను పూర్తి చేసి, స్వామి కృపకు పాత్రులవుతారు. ఓంకారగిరి ప్రదక్షిణ కైలాసపర్వతాన్ని చుట్టి వచ్చిన ఫలితం ఇస్తుందని, జన్మజన్మల సుకృతంగా భావిస్తారు భక్తులు. ఏడు కిలోమీటర్ల ఈ గిరి పరిక్రమకు మొత్తం నాల్గు గంటల సమయం పడుతుంది. ఈ పరిక్రమలో ముందుగా ‘పంచముఖ గణనా«థుడి’ని దర్శించుకుంటాం. ఈ గణనాథుడిని మాంధాత మహర్షి ప్రతిష్టించాడని ఐతిహ్యం. ఇక్కడ నుంచి మార్గమధ్యంలో అతిపురాతనమైన ‘ఖేరాపతి హనుమాన్’ ఆలయం చేరుకుంటాం. దీనికి సమీపంలోనే కేదారేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ స్వామి లింగరూపంలో కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ప్రదేశంలోనే నర్మదా నదిలో రాళ్ల మీద రాళ్లు అంతస్తులుగా పేర్చి కనిపిస్తాయి. సొంతంటి ఇల్లు కల నెరవేరాలని భక్తులు ఈ రాళ్లు పేర్చి మొక్కుకుంటారు. అక్కడ నుంచి మరికొంత ముందుకు వెళితే ‘రుణముక్తేశ్వర స్వామి’ని ఆలయాన్ని చేరుకుంటాం. ఇక్కడ స్వామి వారికి శనగలు సమర్పిస్తే రుణ విముక్తులు అవుతారని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే సుందర రాధాకృష్ణుల మందిరం, గౌరీ సోమనాథుల ఆలయాలు ఉన్నాయి. ‘లాలాహనుమాన్ దేవాలయం’లో స్వామి శయనరూపంలో కనిపించడం విశేషం. అనంతరం భక్తులు ఆశాదేవి ఆలయం చేరుకుంటారు. ఈ మార్గంలోనే ఆఖరుగా గౌరీనా«ద్ ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి అత్యంత సమీపంలో ఓంకారేశ్వర్ మందిరం ఉంటుంది. గిరి ప్రదక్షిణ పూర్తిచేసిన భక్తులు స్వామి ఆలయానికి చేరుకుంటారు. దర్శనమాత్రం చేతనే భక్తులకు అషై్టర్యాలను ప్రసాదించే పరమేశ్వరుడు నాగాభరణ ధారిగా దర్శనమిస్తాడు. ఈ ప్రధాన ఆలయంలోనే త్రిశుద్ధనాథ్, వైద్యనాథ్, మహాకాలేశ్వర్, కేదారినాథ్, గుప్తనాథ్ అనే ఐదు ఉప ఆలయాలూ ఉన్నాయి. ఈ ఐదు ఆలయాలను పంచలింగ ధామాలుగా వ్యవహరిస్తారు. వింధ్య తపస్సు మెచ్చిన ఈశ్వరుడు దేశంలోని పర్వతాలలో మేరు పర్వతం, వింధ్య పర్వతం అత్యంత ఎల్తైనవిగా పేరుపొందాయి. కలహభోజనుడైన నారదుడు ఒక రోజు వింధ్య పర్వతం వద్దకు వచ్చి మేరు పర్వతాన్ని విశేషంగా ప్రశింసించాడట. దీంతో వింధ్యకు కోపం, అసూయ కలిగి తాను మేరు పర్వతం కంటే మించి పోవాలనే సంకల్పంతో శివుని ప్రార్థిస్తూ తపస్సు చేసిందట. శివుడు ప్రత్యక్షమై, నీ మనసులోని కోరిక సిద్ధిస్తుందని పలికాడట. శివుడు వింధ్యకు దర్శనం ఇచ్చినప్పుడు పలువురు మహర్షులు అక్కడికి వచ్చి శివుని దర్శించి, అతడు ఇదే స్థలంలో నిలిచిపోవాలని కోరారట. దీంతో శివుడు వింధ్య పర్వతం మీదనే కొలువుదీరాడట. శివుని వరంతో వింధ్య రెచ్చిపోయి విపరీతంగా పెరగసాగిందట. వింధ్య ఎత్తు సూర్యచంద్రులకు కూడా ఆటంకం కలిగించిందట. వింధ్య ఎత్తు వల్ల కలిగిన ఉపద్రవాన్ని అరికట్టాలని దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు దేవతల మొర విని వింధ్య సమస్య పరిష్కారానికి అగస్త్యమునిని ప్రార్థించమని సూచించాడట. కాశీలో ఉన్న అగస్త్యుని దేవతలు కలుసుకొని వింధ్య వల్ల ఎదురవుతున్న సమస్యను వివరించి కాపాడమని అర్థించడంతో అగస్త్యుడు వింధ్య పర్వతం సమీపించి తాను దక్షిణాదికి వెడుతున్నానని, నీ ఎత్తు ఎక్కువగా ఉన్నందున ఎక్కజాలనని, ఇదివరకటి ఎత్తుకు చేరుకోమని కోరడంతో మహర్షి మాట కాదనడానికి వీలులేదు కనుక వింధ్య సాధారణ ఎత్తుకు తగ్గిపోయిందట. అగస్త్యుడు పర్వతం దాటి వెడుతూ తాను తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండాలని కోరి ముందుకు వెళ్లాడట. అయితే అతడు తిరిగి ఉత్తరాదికి రాకుండా శ్రీశైలంలో నిలిచిపోయాడట. మహర్షులు దేవతల ప్రార్థనపై వెలసిన శివలింగాన్ని రెండు భాగాలుగా విభజించగా వాటిలో ఒక భాగం ఓంకారేశ్వరుడుగా మరో భాగం అమలేశ్వరుడిగా వెలిశారు. ఈ రెండు జ్యోతిర్లింగాలను దర్శించినంతనే తమ జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తారు. అలంకారంగా శయనహారతి ఓంకారేశ్వర్‌లో స్వామికి నిత్యం అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ప్రతిరోజూ శయన అలంకార హారతి కనులారా వీక్షించాల్సిందే. శ్రావణమాసంలో తిరునాళ్లు, కార్తికమాసంలో ప్రత్యేక ఉత్సవాలు, మాఘమాసంలో మహా శివరాత్రి వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగు తాయి. ఇక శ్రావణమాసంలో జరిగే శ్రావణ మేళా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకో దగింది. ఒక పడవలో ఓంకారేశ్వరుడు, మరో పడవలో మమలేశ్వరుడు నర్మదానదిలో మేళ తాళాల నడుమన జలవిహారం చేస్తారు. నది మధ్యలో ఒక చోట కలిసి, ఒకరి చుట్టూ ఒకరు ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తారు. శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం జరిగే ఈ వేడుకను వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఆధునికత అంటని వాతావరణం ఓంకారేశ్వర్‌లో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ స్థానిక సంస్కృతికి ఏమాత్రం విఘాతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ఇక్కడి గిరిపుత్రుల అమాయకత్వం, ప్రశాంత వాతావరణం, ప్రజల సామాన్య జీవనస్థితిగతులను చూస్తే నాగరికత ఇక్కడి మనిషినీ, ప్రకృతిని ఇంకా స్పృశించలేదని స్పష్టం అవుతుంది. ఎంతో కళాత్మకంగా ఉండే ఈ పట్టణంలో మహిళలు కొండల మీద పూచే పువ్వులను కోసుకొచ్చి శివారాధనకు తెచ్చి అమ్ముతుంటారు. విభిన్నరకాలుగా ఉండే ఆ పువ్వుల పరిమళం మన మనసులో ఆధ్యాత్మిక పరమళాలను వెదజల్లుతుంది. హనుమాన్ మూర్తి రంగు వస్త్రధారణలో సాధువులు కనిపిస్తారు. నిలువ నీడలేని భిక్షకులు దేశం అంతటా కనిపిస్తారు. అయితే, ఇక్కడ మాత్రం దారికి అడ్డం పడకుండా ఒక సేవకు ఎదురుచూపులా కనిపిస్తారు భిక్షకులు. మౌనంగా అతిథులు ఇచ్చిన దానిని కళ్లకు అద్దుకుని భగవద్‌కృపగా తీసుకుంటారు. తీర్థయాత్రలు చేయడం అంటే ఆపన్నులకు సాయం చేయడమే అనేది ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. – నిర్మలారెడ్డి చిల్కమర్రి స్వామి దర్శనం ప్రతి రోజు ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామిని దర్శించుకోవచ్చు. ఈ పట్టణంలో బస చేయడానికి ధర్మశాలలు, సత్రాలు, వివిధ ట్రస్ట్‌ల గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. ఓంకారేశ్వర్‌కు దారి ఇండోర్ నుంచి ఓంకారేశ్వర్ 77 కిలోమీటర్లు. ఇండోర్‌లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఉజ్జయిని నుంచి 133, హైదరాబాద్ నుంచి 772 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర్. హైదరాబాద్ నుంచి ఓంకారేశ్వర్‌కు నేరుగా రైలు మార్గం లేదు. భోపాల్ లేదా ఇండోర్ వెళ్లి అక్కడ నుంచి ఓంకారేశ్వర్ చేరుకోవాలి.